Government Offices to Move into Own Building: అద్దె ఆఫీసులు ఇక సొంత భవనాల్లోకి
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:17 AM
ప్రైవేటు భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాల కోసం అవసరమైన మేర ఆఫీసు స్థలం వివరాలు ప్రభుత్వానికి చేరాయి. హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల సుమారు 4 లక్షల చదరపు అడుగుల మేర స్థలం ప్రభుత్వ కార్యాలయాల......
హైదరాబాద్‌లో అందుబాటులో 4 లక్షల చ.అడుగుల స్థలం
అద్దెకుంటున్న ప్రభుత్వ కార్యాలయాలు ఈ నెల 28 నాటికి సర్కారీ భవనాల్లోకి
మార్చి 31 నుంచి ప్రైవేటులో ఉండే కార్యాలయాలకు అద్దె చెల్లింపులు ఉండవ్
60 ప్రభుత్వ విభాగాలు.. 4.39 లక్షల చదరపు అడుగుల్లో అద్దెకు ఉంటున్నట్టు తేలిన లెక్క
వీటి అద్దెల కోసం ఏడాదికి రూ.800 కోట్లు.. 12 ఏళ్లలో రూ.9,600కోట్ల చెల్లింపులు
ఏపీ కార్యాలయాలు ఖాళీ అయ్యాక ఆ భవనాల్లోకి వెళ్లినా వందల కోట్లు మిగిలేవి
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాల కోసం అవసరమైన మేర ఆఫీసు స్థలం వివరాలు ప్రభుత్వానికి చేరాయి. హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల సుమారు 4 లక్షల చదరపు అడుగుల మేర స్థలం ప్రభుత్వ కార్యాలయాల కోసం అందుబాటులో ఉన్నట్లు పలు శాఖల అధికారులు గుర్తించారు. ప్రభుత్వ విభాగాలకు కేటాయించేందుకు ఎన్ని భవనాలు కావాలి? అక్కడ ఎంత విస్తీర్ణంలో ఆఫీసులు ఏర్పాటు చేసుకోవచ్చనే వివరాలను పూర్తి లెక్కలతో తేల్చారు. ఆయా వివరాలను బుధవారం అన్ని శాఖల ముఖ్య, ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో ఆయనకు నివేదించారు. దాని ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 60కు పైగా ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈమేరకు 4.39లక్షల చదరపు అడుగుల మేర స్థలం వినియోగిస్తున్నాయని తేల్చారు. ఈ భవనాల అద్దెల కోసమే ఏడాదికి రూ.800 కోట్ల చొప్పున చెల్లిస్తుండటం గమనార్హం. వీటిలో ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలకు కలిపి రూ.450 కోట్లు, కార్పొరేషన్లు, ఇతర కార్యాలయాలకు కలిపి రూ.350 కోట్ల చొప్పున చెల్లిస్తున్నట్టు తాజాగా అధికారులు తేల్చారు. అంటే ఈ లెక్క 12ఏళ్లలో రూ.9,600 కోట్లన్నమాట. అంటే నెలకు రూ.67కోట్ల చొప్పున భవనాలకే అద్దెలు చెల్లిస్తున్నారు. ఈ నిధులతో 12ఏళ్లలో సొంత భవనాలే నిర్మాణం చేసుకోవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రైవేటులో అద్దెకు ఉంటున్న ప్రభుత్వ విభాగాలు జనవరి 28 వరకు సొంతగూళ్లకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. మార్చి 31 నుంచి ప్రైవేటు భవనాలకు అద్దె చెల్లింపులు ఉండవని తేల్చి చెప్పింది. దీంతో ఈ వారంలో అద్దెకు ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల కేటాయింపు జరగనుందని తెలిసింది. ఆ తర్వాత ఆయా కార్యాలయాలకు అవసరమైన విధంగా వాటిని మార్చుకుని, సామగ్రి మొత్తాన్ని తరలించుకోవాలని కూడా సూచించినట్టు సమాచారం.
టీ-హబ్‌లోనూ స్థలం గుర్తింపు
హైదరాబాద్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించారు. హి మాయత్‌నగర్‌లో ఉన్న గృహకల్ప, నాంపల్లిలో గాంధీభవన్‌కు ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు కార్యాలయంతో పాటు దానికి పక్కనే ఉన్న మరో భవనం, అమీర్‌పేటలోని మైత్రివనం కాంప్లెక్స్, దానికి పక్కనే ఉన్న స్వర్ణజయంతి బిల్డింగ్‌లను గుర్తించారు. వీటితో పాటు హైటెక్‌సిటీలోని హైటెక్స్‌లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) భవనంలో దాదాపు 18వేల నుంచి 20వేల చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్థలం ఉందని తేల్చారు. ప్రభుత్వం పరిధిలో ఉన్న టీ-హబ్‌లోనూ 19వేల చ.అడుగుల స్థలం ఉన్నట్టు గుర్తించారు. అసెంబ్లీకి ఎదురుగా ఉన్న హాకా భవనం, ఆయిల్‌ఫెడ్ భవనంతో పాటు హైదరాబాద్ మొత్తంలో చాలా భవనాలను గుర్తించారు. ఇక సచివాలయానికి దగ్గర్లోనే ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ప్రస్తుతానికి ఆఫీసులకు కేటాయించేందుకు స్థలం లేదని, భవిష్యత్తులో ఖాళీ అయితే వేరే కార్యాలయానికి కేటాయించేలా ముందుగానే ఆలోచన చేస్తున్నారు.
ఏపీ వెళ్లాక ఆ భవనాలను తీసుకున్నా వందల కోట్లు మిగిలేవి
తెలంగాణ ఏర్పాటయ్యాక ఏపీకి చెందిన కార్యాలయాలు హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాల్లో కొనసాగాయి. తర్వాత నాలుగేళ్లకు అంటే 2017-18 తర్వాత చాలా వరకు కార్యాయాలను ఏపీ ఖాళీ చేసింది. అప్పటినుంచి అవి ఖాళీగానే ఉంటున్నాయి. ఏపీ కార్యాలయాలు ఇక్కడి నుంచి తరలిన తర్వాత ఆ భవనాల్లోకి ప్రైవేటులో ఉంటున్న ప్రభుత్వ విభాగాలను తరలించినా వందల కోట్లు మిగిలేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా ఏపీ ఖాళీ చేసి వెళ్లిన భవనాల్లోకే పలు కార్యాలయాలు వెళ్తున్నట్టు సమాచారం. 12 ఏళ్లలో దాదాపు 8 ఏళ్లగా ఏడాదికి 800 కోట్ల చొప్పున 6,400కోట్లు అద్దెల కోసం చెల్లించినట్టు సమాచారం. వీటికి కార్యాలయాల ఖర్చు అదనంగా ఉందని, అన్నీ కలిపి వేలకోట్లకు పైగానే ఖర్చయి ఉంటుందని తెలుస్తోంది.