Share News

ఫార్ములా-ఈ కారు రేసుతో.. రూ.600 కోట్ల భారం పడేది

ABN , Publish Date - Aug 01 , 2026 | 08:15 AM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో మొత్తం రూ.75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పేర్కొంది. రేసుకు సంబంధించి 9, 10 సీజన్ల కోసం ఈ మొత్తాన్ని దుర్వినియోగం చేశారని తెలిపింది.

ఫార్ములా-ఈ కారు రేసుతో.. రూ.600 కోట్ల భారం పడేది

  • రెండు సీజన్ల రేసు నిర్వహించినందుకే

  • రూ.75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం

  • 54.88 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులు చెల్లించారు

  • అంతా తానై కథ నడిపిన నాటి మంత్రి కేటీఆర్‌

  • 77 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసిన ఏసీబీ

  • కోర్టుకు హాజరైన కేటీఆర్‌, సహ నిందితులు

  • రూ.లక్ష పూచీకత్తు.. ఇద్దరి జమానత్‌ కోరిన కోర్టు

  • ఈ నెల 25కు విచారణ వాయిదా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో మొత్తం రూ.75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పేర్కొంది. రేసుకు సంబంధించి 9, 10 సీజన్ల కోసం ఈ మొత్తాన్ని దుర్వినియోగం చేశారని తెలిపింది. అంతేకాకుండా.. 10, 11, 12వ సీజన్లకు సంబంధించిన ఒప్పందం కూడా అమల్లోకి వచ్చి ఉంటే ప్రభుత్వంపై రూ.600 కోట్ల భారం పడేదని వెల్లడించింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్ధానంలో 77 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం శుక్రవారం హాజరైన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు సహ నిందితులైన ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి తదితరులకు చార్జిషీట్‌ ప్రతులను ఏసీబీ అధికారులు అందజేశారు. మరోవైపు నిందితులంతా వ్యక్తిగత బాండ్‌ సమర్పించాలని, ఒకొక్కరు రూ.లక్ష చొప్పున పూచీకత్తు, ఇద్దరితో జమానత్‌ ఇప్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసింది. 2023లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్ల చెల్లింపులు నాటి మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. హెచ్‌ఎండీఏ నిధుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ మొత్తం చెల్లించారంటూ ఐఏఎస్‌ అధికారి దానకిశోర్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు 2024 డిసెంబరులో కేటీఆర్‌ తదితరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు. గవర్నర్‌ నుంచి కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు అనుమతి వచ్చిన తర్వాత ఈ ఏడాది మార్చి 23న ఏసీబీ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు.


ప్రధాన నిందితుడిగా కేటీఆర్‌..

ఏసీబీ 77 పేజీల చార్జిషీట్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ ఐదుగురిపై అభియోగాలు మోపింది. మొత్తం 14 మంది సాక్షుల వాంగ్మూలాలను చార్జిషీట్‌లో జత చేసింది. ఏసీబీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం మే 14న.. ఏ1 కేటీఆర్‌తోపాటు ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌, మాజీ హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ కన్సల్టెంట్‌ కిరణ్‌ మల్లేశ్వరరావు, ఫార్ములా ఈ-కారు రేసు కంపెనీ సీఈవో అల్బర్ట్‌ లోంగో విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. కాగా, కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ.. ఆయన మంత్రిగా తన అధికారాన్ని ఉపయోగించి సాధారణ ప్రభుత్వ అనుమతుల ప్రక్రియను పాటించకుండా నిర్ణయాలు తీసుకున్నారని చార్జిషీట్‌లో ఏసీబీ తెలిపింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిధుల విడుదల జరిగిందని, క్యాబినెట్‌, ఆర్థిక శాఖ, న్యాయశాఖ అనుమతులు లేకుండా హెచ్‌ఎండీఏ నుంచి నిధులు విడుదలయ్యాయని వివరించింది. హెచ్‌ఎండీఏ నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించారని, విదేశీ సంస్థ ఎఫ్‌ఈవోకు రెండు విడతల్లో రూ.46.82 కోట్ల విదేశీ మారక ద్రవ్యం చెల్లించారని పేర్కొంది. దీనివల్ల హెచ్‌ఎండీఏకు అదనంగా రూ.8.06 కోట్లు పన్ను రూపేణా చెల్లించాల్సి వచ్చిందని, ఈ చెల్లింపులు నిబంధనలకు విరుద్ధమని చార్జిషీట్‌లో స్పష్టం చేసింది. మొత్తంగా ఫార్ములా ఈ-కారు రేసు సీజన్‌ 9, 10 కోసం రూ.75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని తెలిపింది. గ్రీన్‌కో అనుబంధ సంస్థను రంగంలోకి దింపడం ద్వారా ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహణలో క్విడ్‌ ప్రోకో జరిగిందని, ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రూ.44 కోట్ల విరాళాలు అందుకుందని చార్జిషీట్‌లో ఏసీబీ పేర్కొన్నట్లు సమాచారం. ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహణ లాభదాయకంగా లేనప్పటికీ ఒకే ఒక్కరి ఆదేశాలతో మొత్తం కథ నడిచిందని, ఇందుకు సంబంధించిన డిజిటల్‌, ఎలక్ర్టానిక్‌ సాక్ష్యాధారాలను పొందుపరిచామని ఏసీబీ అధికారులు వివరించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన ఫైళ్ల నోటింగ్స్‌, ప్రభుత్వ ఉత్తర్వులు, హెచ్‌ఎండీఏ రికార్డులు, బ్యాంక్‌ లావాదేవీలు, ఒప్పంద పత్రాలు, అధికారుల వాంగ్మూలాలను ఆధారాలుగా ఏసీబీ పేర్కొంది. నాటి అధికారులు, హెచ్‌ఎండీఏ సిబ్బంది, ఆర్థిక శాఖకు చెందిన అధికారులను సాక్షులుగా చూపించింది.

Updated Date - Aug 01 , 2026 | 08:15 AM