Share News

ఆర్థిక, రాజకీయ వివాదాలతోనే సామినేని హత్య

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:52 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా సీపీఎం రాష్ట్ర నాయకుడు సామినేని రామారావు (72) హత్య మిస్టరీ వీడింది.

ఆర్థిక, రాజకీయ వివాదాలతోనే సామినేని హత్య
ramarao

  • వీడిన సీపీఎం నేత రామారావు మర్డర్‌ మిస్టరీ .. నలుగురు నిందితుల అరెస్టు.. కత్తులు, ఇతర వస్తువులు స్వాధీనం

  • దర్యాప్తు కొనసాగుతోందన్న సీపీ

  • గతంలో తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులోనూ వీరే నిందితులు

  • అమాయకులను ఇరికించారు

  • భట్టి అల్లిన కట్టు కథ ఇది: తమ్మినేని

ఖమ్మం/చింతకాని, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా సీపీఎం రాష్ట్ర నాయకుడు సామినేని రామారావు (72) హత్య మిస్టరీ వీడింది. ఏడాది క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన బోడపట్ల శ్రీనివాసరావు అలియాస్‌ మెంటల్‌ శ్రీను, నూకల లింగయ్య, మల్లారపు లక్ష్మయ్య, కార్లపుడి ఉదయ్‌కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు సంబంధించిన ఒక నాయకుడికి, హత్యకు గురైన రామారావుకు ఆర్థిక, రాజకీయ వివాదాలు ఉన్నాయని.. ఆ కారణంతోనే రామారావు హత్య జరిగిందని గుర్తించామని తెలిపారు. నిందితుల నుంచి కత్తులు, నాలుగు సెల్‌ఫోన్లు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిందితులను ఖమ్మం మూడో అదనపు జడ్జి ఎదుట హాజరుపర్చగా 14రోజులరిమాండ్‌ విధించారు.


ఏడాది పాటు దర్యాప్తు చేసి..

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సామినేని రామారావు గత ఏడాది అక్టోబరు 31న తన ఇంటిపక్కన ఉన్న పశువుల కొట్టంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై చేపట్టిన దర్యాప్తు, నిందితుల అరెస్టు వివరాలను ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ గురువారం సాయంత్రం వెల్లడించారు. సుమారు ఏడాది పాటు పోలీసులు, ప్రత్యేక బృందాలు, సాంకేతిక, ఫోరెన్సిక్‌ బృందాలతో దర్యాప్తు చేశామని తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన నిందితుల చెప్పులు, కాలిముద్రలు, వస్త్రం ముక్కలు, కత్తులు పెట్టిన కవర్‌తోపాటు పలు ఆధారాలను.. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న జాతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ నిపుణుల బృందంతో విశ్లేషణ చేయించామన్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా పరిశీలన జరిపామని చెప్పారు. అన్ని ఆధారాలను సమీకృతం చేసి.. ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లికి చెందిన బోడపట్ల శ్రీనివాసరావు అలియాస్‌ మెంటల్‌ శ్రీను, నూకల లింగయ్య, మల్లారపు లక్ష్మయ్య, కార్లపుడి ఉదయ్‌కుమార్‌ ఈ హత్యలో పాల్గొన్నట్టు నిర్ధారించి, గురువారం అరెస్టు చేశామని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.

తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులోనూ..

సామినేని రామారావు హత్య కేసులో అరెస్టయిన నలుగురు నిందితుల్లో ముగ్గురు గతంలో బీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులోనూ నిందితులు కావడం గమనార్హం. 2022 ఆగస్టు 15న జరిగిన తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో బోడపట్ల శ్రీనివాసరావు ఏ1గా, నూకల లింగయ్య ఏ3గా, మల్లారపు లక్ష్మయ్య ఏ7 నిందితులు. ఆ కేసులో వీరు బెయిల్‌పై ఉన్నారు. తొలుత సీపీఎంలో కీలకపాత్ర పోషించిన తమ్మినేని కృష్ణయ్య.. తర్వాతి పరిణామాల్లో బీఆర్‌ఎ్‌సలో చేరారు. దీనితో పలు సందర్భాల్లో తెల్దారుపల్లిలో రాజకీయ వివాదాలు, ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో కృష్ణయ్య హత్యకు గురయ్యారు. ఆ కేసులోని కీలక నిందితులు ఇప్పుడు సామినేని రామారావు హత్యకేసులోనూ ఉండటం చర్చనీయాంశంగా మారింది.


భట్టి అల్లిన కట్టుకథ: తమ్మినేని

సామినేని రామారావు హత్య కేసులో అసలు నేరస్తులను తప్పించి, అమాయకులను ఇరికిస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి పోలీసులతో కట్టుకథలు అల్లించారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా పాతర్లపాడులో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామారావుభార్య చూపించిన వ్యక్తులను కేసులో లేకుండా చేశారని చెప్పారు. రామారావు హత్య వెనకాల రియల్‌ ఎస్టేట్‌, ఆస్తుల తగాదాలు, కుటుంబ కలహాలు ఉన్నాయంటూ కథలు అల్లారని ఆరోపించారు. పోలీసులు అమాయకులను నిందితులుగా చూపుతున్నారని.. పార్టీ కోసం ఆలోచించే తెల్దారుపల్లి గ్రామంపై నిందలు వేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ కేసులో సిట్‌ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 30 , 2026 | 06:28 AM