Share News

మహానగరంలో మాయగాళ్లు

ABN , Publish Date - Aug 26 , 2026 | 06:08 AM

హైదరాబాద్‌ నగరంలో నకిలీ వైద్యులు, నకిలీ ఆస్పత్రులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మెడికల్‌ షాపు స్పెల్లింగ్‌ కూడా తెలియనివాళ్లు ఏకంగా క్లినిక్‌లు తెరిచి వైద్యం పేరుతో తమకు తోచిన టాబ్లెట్లు, ఇంజక్షన్లు ఇస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

మహానగరంలో మాయగాళ్లు

  • ఏమాత్రం అర్హతల్లేకున్నా క్లినిక్‌లు నడుపుతూ వైద్యం

  • తోచిన మందులు, ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలతో చెలగాటం

  • ఒక్కో రోగి నుంచి వందల్లో వసూలు

  • టాస్క్‌ఫోర్స్‌ దాడులు

  • 11 మంది నకిలీ వైద్యుల అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరంలో నకిలీ వైద్యులు, నకిలీ ఆస్పత్రులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మెడికల్‌ షాపు స్పెల్లింగ్‌ కూడా తెలియనివాళ్లు ఏకంగా క్లినిక్‌లు తెరిచి వైద్యం పేరుతో తమకు తోచిన టాబ్లెట్లు, ఇంజక్షన్లు ఇస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కొందరైతే గాయాలకు కుట్లు కూడా వేస్తున్నారు. ఇంటర్‌ ఫెయిలైనోళ్లు, ఫుడ్‌ స్టాల్‌ నడిపేటోళ్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, మెడికల్‌ షాపులో పనిచేసినోళ్లు.. ఇలాంటి వాళ్లంతా నకిలీ ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్లు తయారు చేసుకొని వైద్యులుగా చలామణీ అవుతున్నారు. ఒక్కో రోగి నుంచి వందల్లో ఫీజులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. ఇలాంటి క్లినిక్‌లపై విశ్వసనీయ సమాచారం అందుకున్న హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్‌ జోన్‌లలో స్పెషల్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. నకిలీ వైద్యుల ఆటకట్టించారు. మొత్తం 11 మంది నకిలీ వైద్యులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి మెడికల్‌ సామాగ్రితో పాటు ఫార్మసీ మందులను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో కొన్ని ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయినవి కూడా ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలను వెల్లడించారు. జూబ్లీహిల్స్‌ జోన్‌ పరిధిలో సరైన వైద్య అర్హతలు లేకుండా క్లినిక్‌లు, ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్లు నిర్వహిస్తూ.. రోగులకు ఐవీ సెలైన్లు, ఇంజక్షన్లు ఇవ్వడమే కాకుండా సర్జికల్‌ కుట్లు(స్టిచెస్‌) వేస్తూ ప్రాణాపాయం కలిగిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆయా క్లినిక్‌ల పేర్లను, నకిలీ వైద్యుల వివరాలను వెల్లడించారు. సికింద్రాబాద్‌ జోన్‌లో ఆరుగురు నకిలీ డాక్టర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Updated Date - Aug 26 , 2026 | 06:08 AM