సుప్రీం జడ్జిగా తెలంగాణ సీజే
ABN , Publish Date - Sep 29 , 2026 | 03:12 AM
సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి ఇచ్చేందుకు ప్రతిపాదించింది.
జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌కు చాన్స్!
గుజరాత్ సీజే జస్టిస్ సునీత అగర్వాల్,
ఢిల్లీ సీజే జస్టిస్ డీకే ఉపాధ్యాయలకూ..
కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు
జస్టిస్ వినోద్‌కుమార్ మళ్లీ తెలంగాణకు!
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి ఇచ్చేందుకు ప్రతిపాదించింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునిత అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు చేసిన కొలీజియంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీఎస్ నరసింహ సభ్యులుగా ఉన్నారు. సోమవారం జరిగినకొలీజియం సమావేశంలో నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అపరేశ్ కుమార్ సింగ్ 2025 జూలై 19న తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టి్‌సగా ప్రమాణస్వీకారం చేశారు. 1965 జూలై 7న జన్మించిన ఆయన.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ హానర్స్, ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నారు. 1990లో పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి ప్రారంభించారు. 2012 జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు జడ్జిగా, 2014లో జార్ఖండ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2025 జూలై 19న తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టి్‌సగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఆయనను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుపీరంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. జస్టిస్ సునిత అగర్వాల్, జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఇద్దరూ తొలుత అలహాబాద్ హైకోర్టులో నియమితులయ్యారు.
కాగా, తెలంగాణ హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ వినోద్‌కుమార్ మళ్లీ తెలంగాణ హైకోర్టుకు రానున్నారు. ఈ ఏడాది నవంబర్ 16న ఆయన పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 2019 ఆగస్టు 26న జస్టిస్ వినోద్‌కుమార్ తెలంగాణ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2025 జూలై 31న మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
నేరుగా ప్రధాని మోదీ రాజీనామాను అడగండి.. సీజేపీకి కేజ్రీవాల్ సలహా
ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు