తాతా మధు, నవీన్‌రెడ్డి చర్య సభా హక్కులకు విఘాతం
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:45 AM
శాసనసభ స్పీకర్‌ను అవమానించేలా అత్యంత హేయమైన పద్ధతిలో దుర్భాషలాడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్ రెడ్డిపై సభా హక్కులు, విధానాలు, క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా శాసన మండలి చైర్మన్ తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ మంగళవారం తీర్మానం చేసింది.
వారిపై చర్యలకు మండలికి శాసనసభ సిఫారసు
తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి శాసనమండలికి
కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఇలాంటివి మళ్లీ జరగకుండా కఠిన చర్యలు అవసరం
దేశానికి తెలిసేలా సభ నిర్ణయం ఉండాలి: దామోదర
ఫాంహౌస్ కుట్రలో భాగమే ఆ వ్యాఖ్యలు: భట్టి
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): శాసనసభ స్పీకర్‌ను అవమానించేలా అత్యంత హేయమైన పద్ధతిలో దుర్భాషలాడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్ రెడ్డిపై సభా హక్కులు, విధానాలు, క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా శాసన మండలి చైర్మన్ తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ మంగళవారం తీర్మానం చేసింది. దీనిని సభలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశపెట్టగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బలపరిచారు. అనంతరం మూజువాణి ఓటు ద్వారా సభ దానిని ఆమోదించింది. తీర్మానాన్ని తాతా మధు, నవీన్ రెడ్డి చర్య సభా హక్కులకు విఘాతం
ప్రవేశపెట్టే సందర్భంలో మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. ఇలాంటి రోజు వస్తుందని తానెప్పుడూ ఊహించలేదని, ఎమ్మెల్సీలు తమ హోదాను మరిచి దిగజారుడు పదజాలంతో స్పీకర్‌ను, వారి తల్లిని అవమానించేలా మాట్లాడడం అత్యంత హేయమని మండిపడ్డారు. ‘‘సభ గౌరవాన్ని అందరూ కాపాడాలి. రాజకీయాల్లో విమర్శలు, అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ, వ్యక్తిగత దూషణలు హేయం. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైన పోస్టు. సభాపతినే అవమానించడం సమంజసం కాదు. స్త్రీని తల్లిగా, బిడ్డగా, శక్తిగా ఆరాధించే, గౌరవించే సంప్రదాయం మనది. అలాంటి సమాజంలో రాజకీయ కక్షలతో ఒక తల్లిని తీసుకుని వచ్చి దూషించడం అత్యంత బాధాకరం. స్పీకర్ చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు. తల్లి లేని లోటుతో ఎదిగి.. ఈ స్థానానికి చేరుకున్నారు’’ అని వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత కూడా ఆత్మగౌరవానికి విఘాతం కలిగే మాటలు వినాల్సి రావడం దురదృష్టమన్నారు. సంఘటన జరిగి 36 గంటలు గడిచినా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని తప్పుబట్టారు. స్పీకర్ పదవిని గౌరవించాలని, అది కులానికి, జాతికి, మతానికి సంబంధించినది కాదని తెలిపారు. ప్రజా జీవితంలో ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాలని, అహంకార పూరిత వైఖరి సరికాదని, ఇలాంటి మాటలు పునరావృతం కాకుండా కఠిన వైఖరి అవసరమని స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు సరిగా మాట్లాడకపోతే శాసనసభ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే విషయాలు దేశానికి తెలిసేలా సభ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
శాసనసభ తీర్మానం ఇదీ..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, ఎన్. నవీన్ కుమార్ రెడ్డి ఈనెల 7వ తేదీన శాసనసభ ప్రాంగణంలోని గేట్ నంబర్ 3 వద్ద శాసన సభాపతిని ఉద్దేశించి అత్యంత అవమానకరంగా, కించపరిచేలా చేసిన దూషణలను ఈ సభ తీవ్రంగా ఖండిస్తోంది. సభా మర్యాదలకు విరుద్ధమైన వ్యాఖ్యలపై నిరసన నమోదు చేస్తోంది. ఈ ఇద్దరు సభ్యులు మహిళల ఎదుట చొక్కాలు విప్పి అనుచితంగా, అసభ్యకరంగా సమాజం తలదించుకునేలా ప్రవర్తించడాన్ని సభ ఖండిస్తోంది. ఇటువంటి ప్రవర్తన శాసన మండలి సభ్యుని హోదాకు ఏమాత్రం తగదని, శాసన సభాపతి గౌరవం, అధికారం, రాజ్యాంగబద్ధ హోదాకు తీవ్ర భంగం కలిగించిందని భావిస్తోంది. ఇది తెలంగాణ శాసనసభ గౌరవం, సభా హక్కులు, సంస్థాగత సమగ్రతకు విఘాతం కలిగించే చర్యగా పరిగణిస్తోంది. రాజకీయ విభేదాలు, వ్యక్తిగత అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు ఏవైనా సరే.. సభాపతి హోదాలో ఉన్న వ్యక్తి గౌరవాన్ని, అధికారాన్ని తగ్గించే ఉద్దేశంతో సభ్యులు ప్రవర్తించడాన్ని సహించేది లేదని అభిప్రాయపడుతుంది. తమ పార్టీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖర్ రావు బాధ్యత స్వీకరించి, సభ హుందాతనం, సభా మర్యాదలను పరిరక్షించేందుకు, శాసన సభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని తీర్మానిస్తోంది. తాతా మధుసూదన్, నవీన్ రెడ్డి శాసన మండలి సభ్యులుగా ఉన్నందున ఈ తీర్మానం ప్రతితోపాటు సభ ముందు ఉంచిన ఆధారాలు, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు, సంబంధిత కార్యకలాపాల వివరాలను తెలంగాణ శాసన మండలి చైర్మన్‌కు పంపించాలని ఈ సభ తీర్మానిస్తోంది.
ఇది ఫాంహౌజ్ కుట్ర: భట్టి
‘‘ఇటువంటి సంఘటనపై సభలో మాట్లాడే దుస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. సభాపతి ప్రసాద్ కుమార్ గురించి ఆ ఎమ్మెల్సీ వ్యక్తపరిచిన విధానం బీఆర్‌ఎస్ విధానంగానే కనిపిస్తోంది. ఇది వ్యక్తిగతంగా ప్రసాద్‌కు జరిగిన అవమానం కాదు. యావత్తు సభకు జరిగిన అవమానం. వారి దుష్ప్రవర్తనకు వారిపై చర్యలు తీసుకునే అధికారం ఈ సభకు ఉంది’’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సభ లోపల, ఆవరణలో సభ్యుల ప్రవర్తనకు సంబంధించి శిక్ష విధించవచ్చని, వారిని తొలగించవచ్చని, జైలుకు పంపించవచ్చని వివరించారు. ‘‘ప్రతిపక్ష పార్టీ నాయకత్వాన్ని చూస్తే బాధ కలుగుతోంది. ఆత్మగౌరవ పోరాటాల నేపథ్యంలో పుట్టిన తెలంగాణలో మళ్లీ ఫ్యూడల్ శక్తుల భావజాలంతోనే ఆ సభ్యుడు అలా మాట్లాడారు. ఫ్యూడల్ వ్యవస్థ నుంచి పుట్టిందే బీఆర్‌ఎస్. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు ఫాంహౌజ్‌లో సమావేశం జరిగింది. స్పీకర్‌పై దాడికి అక్కడే కుట్ర జరిగింది. వీళ్లందరినీ కూర్చోబెట్టుకున్న కుట్రదారు ఉద్బోధించాడు. పాత్రధారులతో చేయించాడు. బీఆర్‌ఎస్ నాయకత్వ విధానంతోనే ఈ కుట్ర జరిగింది. వాడు.. స్పీకర్ గాడు.. అంటూ మాట్లాడటం ఏం భాష!? ఒక తల్లిని పట్టుకుని అలా మాట్లాడటం చూసి ఈరోజు తెలంగాణ సమాజం తలదించుకుంది’’ అని వ్యాఖ్యానించారు. .
ఫాంహౌజ్ కుట్ర ప్రజాస్వామ్యంపైనే జరిగిందని, పశ్చాత్తాపం ప్రకటిస్తూ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా హరీశ్ రావు మళ్లీ సభాపతిపైకి ఉరికి, ఉరికి వచ్చారని, ఇంత జరిగినా వారిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదని మండిపడ్డారు. ఇటువంటి విచ్ఛిన్న శక్తులను సభ నుంచే కాదు రాష్ట్రం నుంచే దూరంగా ఉంచాలని పిలుపునిచ్చారు. దొరలు, పెత్తందార్ల మనస్తత్వంతో ఉన్న వారి నుంచి తెలంగాణను కాపాడుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు వాడిన భాష వెనుక కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్నామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సంఘటన జరగడానికి ముందు తాను స్పీకర్ చాంబర్‌లో ఉన్నానని, పోలీసు అధికారులు వచ్చి బీఆర్‌ఎస్ సభ్యులు నల్ల చొక్కాలు వేసుకుని, వాటిపై ఏవో నినాదాలు రాసుకుని సభ లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారని స్పీకర్‌కు చెప్పారని తెలిపారు. అప్పుడు రూల్ బుక్ ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశాలు ఇచ్చారని, రూల్ బుక్ ప్రకారం వ్యవహరించిన స్పీకర్‌పై అత్యంత దారుణంగా మాట్లాటడం తెలంగాణ సమాజాన్ని దిగ్ర్భాంతికి గురిచేసిందని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడారని, కనీసం పశ్చాత్తాపం ప్రకటించలేదని, స్పీకర్ కన్నీళ్లు పెట్టుకుంటే సభకే అవమానమని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవి కూడా చదవండి
కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు: మంత్రి ఉత్తమ్
ఈహెచ్‌ఎస్ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క