కోర్టుల్లో కేసులొద్దు.. రాజీ మార్గమే ఉత్తమం
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:54 AM
పోలీసు శాఖలో డీఎస్పీల పదోన్నతుల విషయంలో నెలకొన్న సమస్యకు పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటానని డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో స్వయంగా మాట్లాడతానన్నారు.
వరంగల్ జోన్, హైదరాబాద్ సిటీ పరిధిలోని డీఎస్పీలు
ఒప్పుకొంటే వెంటనే 37మందికి అదనపు ఎస్పీలుగా ప్రమోషన్
త్వరలో దశలవారీగా మిగతా వారికి కూడా పదోన్నతులు: డీజీపీ
హైదరాబాద్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో డీఎస్పీల పదోన్నతుల విషయంలో నెలకొన్న సమస్యకు పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటానని డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో స్వయంగా మాట్లాడతానన్నారు. వరంగల్ జోన్, హైదరాబాద్ సిటీ పరిధిలోని డీఎస్పీలు సహకరిస్తే 37మందికి వెంటనే పదోన్నతి, పోస్టింగ్‌లు లభిస్తాయని ఆయన వివరించారు. తర్వాత దశల వారీగా మిగతావారికి పదోన్నతులు లభిస్తాయని హమీ ఇచ్చారు. కోర్టు కేసుల కారణంగా పదోన్నతుల ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోందని, కేసులు వేసి నష్టపోవద్దని డీఎస్పీలకు సూచించారు. 1991లో పోలీసు శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్లుగా చేరిన వారిలో వరంగల్ జోన్ వారి కన్నా హైదరాబాద్ జోన్‌లో వారికి పదోన్నతులు త్వరగా లభించాయి. హైదరాబాద్ జోన్‌లో పోలీసు వ్యవస్ధ వేగంగా విస్తరించిన క్రమంలో సైబరాబాద్, మల్కాజిగిరి, తాజాగా ఫ్యూచర్ సిటీ వంటి కమిషనరేట్ల ఏర్పాటుతో అనేక పోలీసు స్టేషన్లు అప్‌గ్రేడ్ అయ్యాయి. దీంతో ఇన్‌స్పెక్టర్ స్ధాయి పోస్టులు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో హైదరాబాద్ జోన్ సబ్ ఇన్‌స్పెక్టర్లలో చాలామంది ఇతర జోన్లతో పోలిస్తే ముందుగా ఇన్‌స్పెక్టర్ పదోన్నతులు పొందారు. ఇదే నోషనల్ సీనియారిటీ తర్వాతి దశల్లో కొనసాగడంతో డీఎస్పీ స్ధాయి ప్రమోషన్ల సమయంలో వరంగల్, హైదరాబాద్ జోన్ల మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే సీవీ ఆనంద్ చొరవ తీసుకుని ఈ సమస్యపై సమావేశాన్ని నిర్వహించారు. అందులో తాజా ప్రతిపాదన చేయగా.. హైదరాబాద్ జోన్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి.. సీఎం చంద్రబాబు నివాళులు
ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంపు