మేం లొంగిపోలేదు.. అరెస్ట్ చేశారు.. ABN ఆంధ్రజ్యోతితో దేవ్‌జీ
ABN , Publish Date - Mar 13 , 2026 | 02:28 PM
శుక్రవారం ఏబీఎన్ మీడియాతో మాట్లాడిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము లొంగిపోలేదని, పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. గణపతి ఎక్కడున్నాడో తమకు తెలియదని తేల్చి చెప్పారు.
హైదరాబాద్, మార్చి 13: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ గత ఫిబ్రవరి నెలలో ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, రాష్ట్ర కమిటీ సభ్యుడైన నర్సింహారెడ్డితో పాటు మొత్తం 25 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి నిర్ధారించారు. అయితే, శుక్రవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన దేవ్‌జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘మేం లొంగిపోలేదు.. అరెస్ట్ చేశారు. గణపతి ఎక్కడున్నాడో మాకు తెలియదు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ క్షీణించింది. ప్రభుత్వంతో పోరాటం సాధ్యం కాదు. 2023లో చివరిగా సెంట్రల్ కమిటీ సమావేశం జరిగింది. 2023 తర్వాత పార్టీకి దిశా నిర్దేశం చేయడం సాధ్యం కాలేదు. మావోయిస్టు పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ. పార్టీ నడవాలంటే డబ్బులు కావాల్సి ఉంటుంది. డబ్బు రూపకంగా కాకుండా.. ఉన్న డబ్బుతో బంగారాన్ని కొనుగోలు చేస్తే బాగుంటుందని భావించా. బంగారాన్ని కొనుగోలు చేశాం‘..
‘అయితే.. కిలోల కొద్దీ బంగారం.. కోట్ల రూపాయల డబ్బు ఉంది అని మాపైన, పార్టీపైన దురుద్దేశంతో ప్రచారం జరిగింది. నేను రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నాను అంటే అందరూ అపార్థం చేసుకున్నారు. పార్లమెంటరీ వ్యవస్థలోని ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అవ్వాలని నా మనసులో లేదు. ప్రజల్లో ఉండి ప్రజల కోసం లీగల్‌గా పోరాటం చేయడమే నా రాజకీయ జీవితం. జైల్లో ఉన్నవారిని విడుదల చేయాలని కోరాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
టీ20 ప్రపంచ కప్2026లో సౌతాఫ్రికా తెలివితక్కువ జట్టు: మైఖేల్ వాన్
కోహ్లీ ఆడుతున్న ప్రతి మ్యాచులోనూ తనదైన ముద్ర వేస్తాడు: ఇర్ఫాన్ పఠాన్