హైదరాబాద్, సికింద్రాబాద్ 3 ముక్కలు!
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:51 AM
నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా బిల్లుతో ముడిపెట్టి గతంలో దెబ్బతిన్న కేంద్ర ప్రభుత్వం.. మళ్లీ ఆ దిశగా వేగంగాఅడుగులు వేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, కడప, రాజంపేట, నంద్యాల లోక్‌సభ స్థానాలనూ మూడు భాగాలుగా విభజించాలి
లోక్‌సభ సీట్లను 543 నుంచి 824కు పెంచడానికి ప్రధాని ఆర్థిక సలహా మండలి వర్కింగ్ పేపర్ సమర్పణ
ప్రస్తుతం ఉన్న అన్ని నియోజకవర్గాలనూ చీల్చక్కర్లేదని,170 నియోజకవర్గాలను విభజిస్తే చాలని ప్రతిపాదన
అందులో 111 లోక్‌సభ స్థానాలను 3 భాగాలుగా..59 నియోజకవర్గాలను రెండుగా విడగొట్టాలని సూచన
విభజనకు జనాభాతోపాటు భాషాపరమైన పోలరైజేషన్,పట్టణీకరణ, భాషావైవిధ్యాన్నీ చూడాలని సలహా
న్యూఢిల్లీ, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా బిల్లుతో ముడిపెట్టి గతంలో దెబ్బతిన్న కేంద్ర ప్రభుత్వం.. మళ్లీ ఆ దిశగా వేగంగాఅడుగులు వేస్తోంది. అందుకు కార్యరంగాన్ని సిద్ధం చేసే క్రమంలో భాగంగా డీలిమిటేషన్‌కు సంబంధించి ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) కీలక ప్రతిపాదనలతో వర్కింగ్ పేపర్‌ను సమర్పించింది. దేశంలో లోక్‌సభ నియోజకవర్గాలను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 824కు పెంచాలని సూచిస్తూనే.. ఎన్ని నియోజకవర్గాలను విభజించాలి? ఎన్ని భాగాలుగా విభజించాలి? అందుకు కేవలం జనాభాను మాత్రమే కాకుండా ఏయే అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలనే వివరాలను ‘డీలిమిటేషన్ వర్కింగ్ పేపర్ 2026’ పేరిట రూపొందించిన 78 పేజీల నివేదికలో పొందుపరచింది. పునర్విభజనకు దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని పాటించాల్సిన పని లేదని.. అన్ని నియోజకవర్గాలనూ విభజించక్కర్లేదని, మొత్తం 170 నియోజకవర్గాలను విభజిస్తే సరిపోతుందని అందులో సూచించింది. ఆ 170 స్థానాల్లోనూ.. 59 నియోజకవర్గాలను రెండు ముక్కలుగా, 111 నియోజకవర్గాలను 3 ముక్కలుగా చేయాలని అభిప్రాయపడింది. 2009 నుంచి 2024 వరకు జరిగిన లోక్ సభ ఎన్నికల డాటా బేస్ ఆధారంగా.. నియోజకవర్గాల పునర్విభజనకు జనాభాతో పాటుగా అధిక పట్టణీకరణ, ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా, భాషాపరమైన పోలరైజేషన్ (అంటే ఒకే భాష మాట్లాడేవారి సమూహం ఒకేచోట ఎక్కువగా ఉండడం), భాషాపరమైన వైవిధ్యం (ఒకే చోట వివిధ భాషలకు చెందిన సమూహాలు ఉండడం).. అనే మరో ఐదు అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సలహామండలి సూచించింది. ఈ ప్రాతిపదికలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మూడు భాగాలుగా చేయాలని ఈఏసీ-పీఎం సూచించిన నియో.జకవర్గాల్లో.. తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు.. ఏపీలోని విశాఖ, కడప, రాజంపేట, నంద్యాల ఉండడం గమనార్హం. ఉదాహరణకు.. హైదరాబాద్‌లో తెలుగు, ఉర్దూ భాషలు మాట్లాడేవారి సంఖ్య ఎక్కువ. అంటే భాషాపరమైన పోలరైజేషన్ ఉన్నట్టు. ఇలా భాషాపరమైన పోలరైజేషన్ ఉన్నచోట్ల ఓటింగ్ శాతం 11 నుంచి 13 శాతం ఎక్కువగా పడుతున్నట్టు కూడా గత ఎన్నికల గణాంకాల ఆధారంగా ఈఏసీ-పీఎం గుర్తించింది. కాగా.. నియోజకవర్గాల సంఖ్యను 800కు పైగా పెంచేందుకు ప్రాతిపదికను నిర్ణయించేందుకు తాము శాస్త్రీయంగా ప్రయత్నించామని చెప్పేందుకే కేంద్రం ఈ అధ్యయనం చేయించినట్లు.. వచ్చేపార్లమెంటు సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మరోసారి ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.

నిష్పత్తి మారకుండానే..
ప్రధాని ఆర్థిక సలహామండలి సమర్పించిన వర్కింగ్ పేపర్‌లో చేసిన సూచనల ప్రకారం.. పెద్ద రాష్ట్రాలన్నింటిలో దాదాపు 50 శాతం సీట్ల పెరుగుదల ఉంటుంది. చిన్న రాష్ట్రాల్లో మాత్రం సీట్ల సంఖ్యను నేరుగా రెట్టింపు చేయాలని ప్రతిపాదించారు. అదే క్రమంలో.. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్ల నిష్పత్తి మాత్రం మారకుండా చూసుకున్నారు. ఉదాహరణకు.. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు వాటా మొత్తం సీట్లలో 23.7 శాతంగా ఉంది. కొత్త మోడల్ ప్రకారం అది 23.6 శాతంగా ఉంటుంది. ఇక ఉత్తర, మధ్య, పశ్చిమ భారత రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్,బిహార్, మహారాష్ట్రల వాటా 45.6 శాతంగా ఉంది. అది 45.2 శాతం అవుతుంది.
పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ లోక్ సభ సీట్లు 17 నుంచి 26కు, ఆంధ్రప్రదేశ్ సీట్లు 25 నుంచి 38కి, కర్ణాటక సీట్లు 28 నుంచి 42కు, కేరళ లోక్ సభ సీట్లు 20 నుంచి 30కి, తమిళనాడు సీట్లు 39 నుంచి 59కి, ఉత్తర ప్రదేశ్ సీట్లు 80 నుంచి 120కి పెరుగుతాయి.
మిజోరం, పుదుచ్చేరి, సిక్కిం, లద్దాఖ్, అండమాన్ నికోబార్ ద్వీపాలు, నాగాలాండ్, చండీఘర్, లక్షద్వీప్ వంటి చోట్ల ఇప్పుడున్న నియోజకవర్గాలు రె ట్టింపు అవుతాయి.
నియోజకవర్గాలను చీల్చేందుకు కేవలం నియోజకవర్గాల సైజు మాత్రమే కాకుండా అక్కడి జనాభా, భాషాపరమైన ప్రాతిపదికను కూడా పరిశీలించాలని అది సూచించింది. ఒక నియోజకవర్గం సైజు పెద్దదిగా ఉన్నంత మాత్రాన ఓట్ల శాతం పెరుగుతుందని చెప్పలేమని అక్కడి స్థానిక పట్టణీకరణ, షెడ్యూల్డు జాతుల సాంద్రత, భాషా వర్గాల మధ్య పోటీ కూడా ఓట్ల శాతాన్ని నిర్ణయిస్తుందని నివేదిక నిర్ధారించింది.
ఇలా కొన్ని నియోజకవర్గాలనే లక్ష్యంగా పెట్టుకుని చీల్చడం ద్వారా దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం 2.3 పర్సంటేజ్ పాయింట్ల మేర పెరుగుతుందని తెలిపింది (అది 2.3 శాతం కాదు. 2.3 పర్సంటేజ్ పాయింట్లు. శాతానికి, పర్సంటేజ్ పాయింట్స్‌కి తేడా ఉంది. ఉదాహరణకు గత ఎన్నికల్లో 60శాతం పోలింగ్ జరిగి.. ఇప్పుడు 66శాతం జరిగితే.. పోలింగ్ 6 శాతం పెరిగినట్టు కాదు.. 6 పర్సంటేజ్ పాయింట్ల మేర పెరిగినట్టు. ఎందుకంటే 60లో 6 శాతం అంటే.. 3.6 మాత్రమే.). తద్వారా అదనంగా 2.28 కోట్ల మంది ఓటర్లు అదనంగా ఓటింగ్ ప్రక్రియలో భాగమవుతారని నివేదిక పేర్కొంది.
గ్రామీణ మహిళలతో పోలిస్తే పట్టణాల్లో ఉండే ఉద్యోగాలు చేసే మహిళల ఓటింగ్ 5శాతం మేర తక్కువగా ఉన్నట్టు ఈఏసీ పీఎం తన నివేదికలో పేర్కొంది. అందుకే మహిళల కోసం ప్రత్యేక పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేయాలని.. వారు ఓటు వేయడానికి అదనపు సమయం ఇవ్వాలని.. వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని సూచించింది.
భాషాపరమైన పోలరైజేషన్‌తో పెరిగే ఓటింగ్ శాతం..
ప్రధాని ఆర్థిక సలహామండలి సమర్పించిన వర్కింగ్ పేపర్‌లో.. మూడుగా విభజించాల్సిన టాప్-15 నగరాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు నగరాలున్నాయి. వాటిలో భాషాపరమైన పోలరైజేషన్ స్కోరు అత్యధికంగా హైదరాబాద్‌లో 0.126గా ఉంది. దేశంలోనే ఇది అత్యధికం. ఈ వర్కింగ్ పేపర్ ప్రకారం హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉర్దూ మాట్లాడేవారు అత్యధికంగా 10,66,653 మంది ఉండగా.. తెలుగు మాట్లాడేవారు 4,62,029 మంది ఉన్నారు. ఇలా రెండు భాషలు మాట్లాడేవారు ఎక్కువ మంది ఉన్నచోట్ల ఓటింగ్ శాతం 11 నుంచి 13 శాతం అధికంగా నమోదవుతుందని వర్కింగ్ పేపర్ పేర్కొంది. దీనికి కారణం.. ఏ భాషా సమూహానికి ఆ భాషా సమూహం.. తమ వర్గం ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఓటు వేయడానికి వెళ్లడమేనని వివరించింది. దీన్నే ఆర్థిక శాస్త్రంలో ‘ఎస్టేబాన్ రే మెకానిజం’ అంటారని వివరించింది. ఇలా రాష్ట్రం హైదరాబాద్ తర్వాత భాషాపరంగా అధిక పోలరైజేషన్ స్కోరు ఉన్నది సికింద్రాబాద్‌లో (0.120). తర్వాతి స్థానాల్లో ఏపీలోని నంద్యాల (0.117), రాజంపేట (0.114), కడప (0.105), విశాఖపట్నం (0.052) ఉన్నాయి. ఇంకా.. తమిళనాడులోని కన్యాకుమారి, కర్ణాటకలో ధార్వాడ్, బెల్గాం, బీజాపూర్, ఒడిశాలోని కంధమాల్, పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా దక్షిణ్, గుజరాత్‌లోని భావ్‌నగర్, రాజ్‌కోట్, ఝార్ఖండ్‌లోని లోహర్‌దాగా తదితర నియోజకవరగ్లాను మూడుగా విభజించాలని నివేదిక సూచించింది. అలా మూడుగా విభజించడం వల్ల.. ఏర్పడే ప్రతి కొత్త నియోజకవర్గంలోనూ ఓటింగ్ ఎన్ని పర్సంటేజ్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందో కూడా అంచనా వేసింది. దాని ప్రకారం.. హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని మూడుగా విభజిస్తే ఆ మూడింటిలో ప్రతి నియోజకవర్గంలోనూ 27.87 పర్సంటేజ్ పాయింట్ల మేర ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. అలాగే.. సికింద్రాబాద్ విభజనతో 26.93 పర్సంటేజ్ పాయింట్లు, విశాఖ విభజనతో 15.88 పర్సంటేజ్ పాయింట్లు, కడప విభజనతో 15.39 పర్సంటేజ్ పాయింట్లు, రాజంపేట విభజనతో 14.47 పర్సంటేజ్ పాయింట్లు, నంద్యాలలో 14.22 పర్సంటేజ్ పాయింట్ల మేర ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది.