Share News

‘రూ.10 వేలు ఇవ్వకపోతే ఫెయిల్‌ చేస్తా..’

ABN , Publish Date - Sep 24 , 2026 | 08:08 AM

మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టు లెక్చరర్‌పై జరిగిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

‘రూ.10 వేలు ఇవ్వకపోతే ఫెయిల్‌ చేస్తా..’

  • విద్యార్థులకు కాంట్రాక్టు లెక్చరర్‌ బెదిరింపులు..

  • నిర్ధారించిన కమిటీ

మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టు లెక్చరర్‌పై జరిగిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులు చేసిన ఆరోపణలు వాస్తవమేనని నిజనిర్ధారణ కమిటీ విచారణలో తేలినట్లు సమాచారం. ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 వేలు డిమాండ్‌ చేయడం, డబ్బులు ఇవ్వకపోతే ఫెయిల్‌ చేస్తానంటూ బెదిరించడం, మెసేజ్‌ల ద్వారా పిలిచిన చోటుకు వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం వంటి ఆరోపణలపై కమిటీ విచారణ చేపట్టింది. కళాశాల ప్రిన్సిపాల్‌ ఆదేశాల మేరకు వైస్‌ ప్రిన్సిపాల్‌, ఇద్దరు సీనియర్‌ అధ్యాపకులు, మరో ఇద్దరు మహిళా ఫ్యాకల్టీ సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీ మంగళవారం విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా బాధిత విద్యార్థుల నుంచి వివరాలు సేకరించడంతోపాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టు లెక్చరర్‌ వివరణను సైతం నమోదు చేసినట్లు తెలిసింది. విచారణ అనంతరం కమిటీ తన నివేదికను ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హుస్సేన్‌కు సమర్పించగా.. ఆయన డిగ్రీ కళాశాలల కమిషనరేట్‌కు పంపినట్లు సమాచారం. విచారణ సందర్భంగా సదరు కాంట్రాక్టు లెక్చరర్‌ తనది పొరపాటేనని, ఇలాంటి ఘటనలు పునరావృతం కావని వేడుకున్నట్లు సమాచారం. ఇదే కళాశాలలో మరో లెక్చరర్‌ కూడా ఓ విద్యార్థినిని వేధించినట్లు ప్రిన్సిపాల్‌ దృష్టికి రావడంతో, ఆ అంశంపైనా విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే సంబంధిత విద్యార్థిని అందుబాటులో లేకపోవడంతో విచారణను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం.

Updated Date - Sep 24 , 2026 | 08:52 AM