Share News

Drinking water: అమ్మో.. ఈ నీటిని ఎలా తాగేది...

ABN , Publish Date - Jan 06 , 2026 | 09:06 AM

హైదరాబాద్ మహానగరంలో కొన్ని ఏరియాల్లో కలుషిత నీరు సరఫరా అవుతోంది. ఎప్పుడో పాతకాలం నాటి పైప్‏లైన్‏లే ఉండడంతో అవి మరమ్మతులకు గురవుతుండడంతో నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడడమేగాక నీరు కూడా కలుషాతమవుతోంది.

Drinking water: అమ్మో.. ఈ నీటిని ఎలా తాగేది...

- నగరంలో పలు ప్రాంతాల్లో సరఫరా.. మొదటి అరగంట దుర్వాసనతో రాక

- ప్రతీరోజు వాటర్‌బోర్డుకు ఫిర్యాదులు..

- పాతకాలం నాటి పైపులైన్లతోనే సమస్యలు

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహా నగరంలో కలుషిత జలాలు కలవరపెడుతున్నాయి. తాజాగా సరూర్‌నగర్‌లోని బాపునగర్‌ రోడ్డు నంబర్‌ 2, 3, 4లో వారం రోజులుగా కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి. దీనిపై స్థానిక వాటర్‌బోర్డు అధికారులకు ఫిర్యాదు చేస్తే.. ‘నీళ్లను 20 నిమిషాలు వదిలేయండి. లేకుంటే అవే నీళ్లు బాయిల్‌ చేసుకొని తాగాలి’ అంటూ ఉచిత సలహాలిస్తున్నారు. ఈ విషయం ఎండీ అశోక్‌రెడ్డి దృష్టికి రావడంతో అధికారులను హెచ్చరించి మరమ్మతు పనులకు ఆదేశాలిచ్చారు.


ఏళ్ల నాటి పైపులైన్‌ వ్యవస్థ

నగరంలోని కోర్‌ సిటీ పరిధిలో నిజాం కాలం నాటి పైపులైన్‌ వ్యవస్థ ఉన్నది. నగర విస్తరణలో తాగునీటి పైపులైన్‌ పక్కనే డ్రైనేజీ లైన్లు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ లైన్ల నుంచి తాగునీటి పైపులైన్‌ వ్యవస్థ వెళ్తున్న పరిస్థితి ఉన్నది. పురాతన పైపులైన్‌ వ్యవస్థ తరచూ దెబ్బతింటోంది. మంచినీటి పైపులెన్లు లీకులు ఏర్పడితే వెంటనే మురుగునీరు కలుస్తోంది. గతంలో వాటర్‌బోర్డు అధికారుల అధ్యయనంలో కూడా సీవరేజీ, డ్రెయినేజీ లైన్ల పక్క నుంచి వెళ్ళిన మంచినీటి పైపులైన్లు మార్చాలని సూచించారు.


city4.jfif

కోర్‌సిటీలోని పాతబస్తీతో పాటు నారాయణగూడ, ఖైరతాబాద్‌, మెహదీపట్నం, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, సనత్‌నగర్‌, అంబర్‌పేట, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో ఎన్నో ఏళ్ల నాటి పైపులైన్‌ వ్యవస్థను మార్పు చేయాలని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. కానీ సుమారు 2వేల కిలోమీటర్ల మేర గల పైపులైన్‌ వ్యవస్థను మార్పు చేయాలంటే రూ.3వేల కోట్లకు పైగా వ్యయం అవుతుందని ఐదేళ్ల క్రితం అంచనా వేశారు. అంతకు మించి ముందుకు వెళ్లలేదు.


అక్రమ కనెక్షన్లతో..

నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ కనెక్షన్ల ఏర్పాటు సమయంలో ప్రధాన పైపులైన్లు దెబ్బతింటున్నాయి. వివిధ రకాల తవ్వకాల వల్ల కూడా పైపులైన్లు పగులుతున్నాయి. శాస్ర్తీయంగా మరమ్మతు పనులు చేస్తే ఇబ్బందులుండవు. కానీ అక్రమార్కులు రాత్రివేళలో ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారు. దాంతో ఆయా ప్రాంతాల్లో లీకేజీ సమస్యలు తలెత్తున్నాయి.


city5.3.jpg

పైపులైన్ల ఛాంబర్ల వద్ద లీకేజీలతోనే

నగరంలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి పైపులైన్ల ఛాంబర్ల వద్ద లీకేజీలవుతున్నాయి. అక్కడ బుదర పేరుకుపోయి పైపులైన్లలోకి చేరుతోంది. పైపులైన్ల వాల్వ్‌ల ఏర్పాటు కోసం, ఛాంబర్ల మరమ్మతు కోసం అత్యవసర పనుల కింద చేపడుతున్నారు. కానీ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. గ్యారంటీ, వారంటీ లేకుండా సాగుతున్న పనులు కావడంతో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు. కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు వాల్వ్‌ల మరమ్మతు పేరుతో జేబులు నింపుకుంటున్నారు.


నెంబర్‌ వన్‌గా నిలిచిన ఇండోర్‌లో..

స్వచ్ఛ భారత్‌లో దేశంలోనే మొదటి నగరంగా నిలిచిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రెండు రోజుల క్రితం కలుషిత నీళ్లతో ఓ పసికందుతో సహా పదిమంది వరకు చనిపోవడం సంచలనంగా మారింది. దాదాపు 250మందికి పైగా వాంతులు, విరోచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. గతంలో హైదరాబాద్‌ మహా నగరంలో కూడా ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్‌ ప్రాంతంలో కలుషిత జలాల సరఫరాతో పదిమందికి పైగా మరణించిన విషయం విధితమే. నాలుగేళ్ల క్రితం మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌ వెనుక వైపు గల శ్రీరామ కాలనీలో కలుషిత జలాల సరఫరాతో ఇద్దరు మరణించగా.. లంగర్‌హౌజ్‌, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో పలువురు ఆస్పత్రి పాలయ్యారు. ఇలా హైదరాబాద్‌ మహా నగరంలో వాటర్‌బోర్డు సరఫరా చేసే నీరే నగరవాసుల దాహార్తి తీరుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో కలుషితంగా సరఫరా అవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.


ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లే

మహా నగరంలో వీఐపీల తాకిడి గల వాటర్‌బోర్డు డివిజన్‌ ఎస్‌ఆర్‌నగర్‌. ఈ ప్రాంతంలో కలుషిత జలాలు సరఫరా అవుతున్నా స్థానిక డివిజన్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. బీకేగూడ సాయిబాబా నగర్‌ - జయప్రకాశ్‌ నగర్‌ మధ్య గల వీధిలో నీటి సరఫరా సమయంలో మురుగు వస్తోంది. గతంలో డ్రైనేజీ లైన్‌ నిండితే తాగునీరు కలుషితంగా వచ్చేది. కానీ ప్రస్తుతం డ్రైనేజీ లైన్‌ నిండకపోయినా కలుషిత నీరు వస్తోంది. మొదటి పది నిమిషాల పాటు నీరు పట్టుకోలేక వదిలేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక వాటర్‌బోర్డు అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో తాగునీటి పైపులైన్‌ కూడా ఐదారేళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. కలుషిత జలాలు సరఫరా కావడానికి కారణాలను కనీసం తెలుసుకోవడం లేదు. సమస్య పరిష్కారం చేయడం లేదు. కలుషిత జలాలు తాగి ఇండోర్‌, భోలక్‌పూర్‌ లాంటి ఘటనలు తలెత్తితేనే వాటర్‌బోర్డు అధికారులు మేలుకుంటారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..

బీసీ కులగణనపై ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేశారా..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 06 , 2026 | 09:06 AM