మోత మోగింది
ABN , Publish Date - Sep 09 , 2026 | 05:08 AM
కేసీఆర్ ఫాంహౌస్ చౌరస్తా వందలాది డప్పుల మోతతో దద్దరిల్లింది! దాదాపు కిలోమీటరున్నర మేర కాంగ్రెస్ దళిత నాయకులు చావు డప్పు మోగిస్తూ పాదయాత్ర చేశారు. ‘దళిత వ్యతిరేకి కేసీఆర్ డౌన్ డౌన్’, ‘కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి’ అంటూ నినాదాల మోత మోగించారు.
వందలాది డప్పుల మోతతో దద్దరిల్లిన ఫాంహౌస్ చౌరస్తా
కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు
కిలోమీటరున్నర పాదయాత్ర.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు
దళిత ద్రోహి కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి స్వల్ప గాయాలు.. నిమ్స్‌కు తరలింపు
దామరకుంటలో గల్లాలు పట్టుకున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు
బీఆర్‌ఎస్ నేత ఇంటిపై రాళ్ల దాడి
ఫాంహౌస్ వద్ద భారీ బందోబస్తు
గజ్వేల్, యాదాద్రి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ ఫాంహౌస్ చౌరస్తా వందలాది డప్పుల మోతతో దద్దరిల్లింది! దాదాపు కిలోమీటరున్నర మేర కాంగ్రెస్ దళిత నాయకులు చావు డప్పు మోగిస్తూ పాదయాత్ర చేశారు. ‘దళిత వ్యతిరేకి కేసీఆర్ డౌన్ డౌన్’, ‘కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి’ అంటూ నినాదాల మోత మోగించారు. ఫాంహౌస్ చౌరస్తాలో కూర్చుని కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కొన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణులు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. వెరసి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన ‘చలో ఎర్రవల్లి ఫాంహౌస్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి దేవుని సతీష్ మాదిగ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు భారీగా వరదరాజపూర్‌కు చేరుకున్నారు.
అక్కడి నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లేందుకు పోలీసులు వారికి అనుమతి ఇచ్చారు. వందలాది డప్పు మోతలతో నిరసన తెలుపుతూ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ రోప్ పార్టీలు, బారికేడ్లు, డీసీఎంలను అడ్డుగా పెట్టి మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఐజీ సన్‌ప్రీత్‌సింగ్ వారిని అడ్డుకున్నారు. నర్సారెడ్డి, ఆంక్షారెడ్డి లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు బారికేడ్లను అడ్డు పెట్టి అడ్డుకున్నారు. దాంతో, వారు అక్కడే కూర్చుని కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారినిబయటకు పంపించేందుకు యత్నించగా పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నర్సారెడ్డి కాలికి, చెవికి గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ప్రజ్ఞాపూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. అనంతరం పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను ఒప్పించి వరదరాజపూర్ వైపు పంపించారు. అక్కడికి డప్పులతో, నినాదాలతో వచ్చిన కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు అక్కడకు చేరుకుని కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎదురు నినాదాలు చేయడంతోపాటు చెప్పులు చూపించారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుండడంతో సీపీ రశ్మీ పెరుమాళ్, గజ్వేల్ ఏసీపీ నర్సింలు ఇరు వర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు.
దామరకుంటలో ధ్వంసరచన
దామరకుంటలో నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన కాం గ్రెస్ శ్రేణుల కార్ల అద్దాలను బీఆర్‌ఎస్ నేతలు ధ్వంసం చేశారు. ప్రభుత్వ విప్‌లు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆలేరు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యకర్తలు డప్పులు మోగిస్తూ తెలంగాణ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్య లు చేశారని ఆరోపించారు. కేసీఆర్ సభకు హాజరై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీశ్ రావు దిష్టిబొమ్మలను దహనం చేశారు. దాదాపు గంటపాటు డప్పులు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. తుర్కపల్లి నుంచి ఎర్రవెళ్లి వైపునకు కాంగ్రెస్ శ్రేణులు వెళుతున్న కాన్వాయ్‌పై యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దు గ్రామాలు దాటిన వెంటనే దామరకుంట వద్ద బీఆర్‌ఎస్ శ్రేణుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. దామరకుంటకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కృష్ణాయాదవ్, మరికొంత మంది కార్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఆరు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడికి ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు సైతం ప్రతి దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాలూ వాగ్వాదానికి దిగి గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీటీసీ ఇంటిపైకి రాళ్లు రువ్వి ఆయ న ఇంటి అద్దాలను కాంగ్రెస్ శ్రేణులు ధ్వంసం చేశారు. పోలీసు బలగాలు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టాయి. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు రాగా.. వారిని పోలీసులు ఎర్రవల్లి నుంచే తిప్పి పంపించేశారు.
బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్టులు
కాంగ్రెస్ నిరసనల నేపథ్యంలో పోలీసులు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేత లను ముందస్తుగా అరెస్టు చేశారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో, భువనగిరి, యాదగిరిగుట్ట పట్టణాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఆందోళనలు చేపట్టింది. యాదగిరిగుట్టలో ఎమ్మె ల్యే బీర్ల అయిలయ్య ఇంటి వద్ద డప్పులతో నిరసన వ్యక్తం చేయగా, భువనగిరి అంబేడ్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేశారు. ఇక, మెదక్ జిల్లాలో పలువురు నేతలు పోలీసుల నుంచి తప్పించుకుని మర్కుక్ మండలం చుట్టూ దాక్కుని మెరుపు ధర్నాలకు దిగారు. వర్గల్ మండలం సింగాయపల్లి రా జీవ్ రహదారిపై బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మ ర్కుక్ మండల కేంద్రం, గౌరారం చౌరస్తా వద్ద కూడా ధర్నాకు దిగారు. మర్కుక్‌లో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీ ఆర్‌ఎస్ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో మాజీ ఎంపీపీ పాండుగౌడ్ కాలికి ఫ్రాక్చర్ అయింది. ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, కరుణాకర్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. మరికొందరు ఫాంహౌస్‌వైపు వచ్చేందుకు యత్నించగా పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు.
బేషరతుగా క్షమాపణ చెప్పాలి: సతీష్ మాదిగ
స్పీకర్ ప్రసాద్‌కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, మాల, మాదిగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవుని సతీష్‌మాదిగ డిమాండ్ చేశారు. వరదరాజపూర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 6న ఫాంహౌజ్‌లో సమావేశం ఏర్పాటు చేసి పోలీసులపై దాడి చేయాలని, స్పీకర్‌పై దూషణ చేయాలని కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు నూరిపోశారని, అందులో భాగంగానే తాతా మధుసూదన్ అసభ్యపదజాలంతో స్పీకర్‌ను దూషించారని ఆరోపించారు.
వేలాది డప్పులతో రేవంత్ ఇంటిని ముట్టడిస్తాం: వంటేరు
వేలాది డప్పులతో త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని బీఆర్‌ఎస్ గజ్వేల్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా సీఎం వ్యవహరిస్తున్నారని, ఫాంహౌజ్‌పై కాంగ్రెస్ మూకలను రెచ్చగొట్టి పంపిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చావును కోరుతున్న రేవంత్‌రెడ్డికి ప్రజలు రాజకీయ సమాధి పెడతారని అన్నారు.
భారీగా పోలీసు బందోబస్తు
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ పూర్తిగా పోలీస్ వలయంలోకి వెళ్లిపోయింది. ఎక్కడా చీమ కూడా దూరకుండా వెయ్యి మంది పోలీసులతో పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ప్రత్యేక ఇన్‌చార్జిలను నియమించారు. మంగళవారం ఉదయం నుంచే మల్టీజోన్ -1 ఐజీ ఎస్. చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో రాజన్న జోన్ డీఐజీ సన్‌ప్రీత్‌సింగ్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫాంహౌజ్‌కు వచ్చే గౌరారం, వరదరాజపూర్, ఎర్రవల్లి, దామరకుంట, శివారు వెంకటాపూర్ రోడ్లను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. గత పన్నెండేళ్లలో సిద్దిపేట జిల్లాలో సీపీలుగా పని చేసిన జోయల్ డేవిస్, అనురాధ, సుమతితోపాటు గజ్వేల్ డివిజన్‌లో పనిచేసిన ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలను పెద్ద ఎత్తున ఎర్రవల్లికి పిలిపించారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ యుద్ధంలో ఎక్కడి వారు అక్కడికి తిరిగి వెళ్లడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఈహెచ్‌ఎస్ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క
అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలి: కేసీఆర్