Share News

గాయపడి ఉన్నాం.. రెచ్చగొట్టొద్దు

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:15 AM

ఆర్థికంగా, రాజకీయంగా కొనసాగుతున్న వివక్షతో దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే గాయపడి ఉన్నాయని, డీలిమిటేషన్‌ పేరుతో రెచ్చగొట్టవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

గాయపడి ఉన్నాం.. రెచ్చగొట్టొద్దు

  • 50 శాతం సీట్ల పెంపుతో అంతరం ఇంకా పెరుగుతుంది.. అప్పుడు దక్షిణాది ప్రజల నుంచి రియాక్షన్‌ తప్పదు

  • ప్రజా ఉద్యమాలకు దారి తీస్తుంది.. వెనక్కి తీసుకోకతప్పదు

  • ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది వాటా ఆధారంగా సీట్ల పెంపు

  • ఈ అంశాన్ని మెరిట్‌గా తీసుకుని డీలిమిటేషన్‌ చేపట్టండి

  • రాజకీయ కారణాలతోనే కొన్ని పార్టీలు దీనిపై సైలెంట్‌

  • మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకూ కోటా కల్పించాలి: సీఎం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా, రాజకీయంగా కొనసాగుతున్న వివక్షతో దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే గాయపడి ఉన్నాయని, డీలిమిటేషన్‌ పేరుతో రెచ్చగొట్టవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్డీయే చెబుతున్న మాదిరిగా 50 శాతం సీట్ల పెంపుతో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం మరింతగా పెరిగి తీవ్ర అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. అయినా, ముందుకెళ్లి సీట్ల పెంపును చేపడితే.. దక్షిణాదిన ప్రజల నుంచి రియాక్షన్‌ వస్తుందని, వివక్ష ఏర్పడి అది ఎక్కడికైనా దారి తీస్తుందని హెచ్చరించారు. మీడియా ప్రతినిధులు వివరణ కోరగా... ప్రజా ఉద్యమాలకు దారి తీస్తుందని స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌ విషయంలో కేంద్రం ముందుకు వెళితే.. నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న మాదిరిగా దీనిని కూడా వెనక్కి తీసుకోక తప్పదని హెచ్చరించారు. ద్రవిడులమని ఇప్పటికే చిన్నచూపు చూస్తున్నారని, రాజకీయంగానూ వివక్ష చూపుతున్నారని తెలిపారు. సీట్ల పెంపుతో దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న అంతరం ఇక ఏమాత్రం పెరగరాదని స్పష్టం చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్‌ ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. సీడబ్ల్యూసీ భేటీలో చర్చకు వచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ.. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు జరిగే అన్యాయాన్ని వివరించానని, పార్టీ అధిష్ఠానం తన అభిప్రాయాలను నోట్‌ చేసుకుందని చెప్పారు. పునర్విభజనపై ఇండియా కూటమి పక్షాలతో చర్చించాలని సీడబ్ల్యూసీ భేటీలో నిర్ణయించినట్లు చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో పెద్ద రాష్ట్రాలు మరింత పెద్దగా, చిన్న రాష్ట్రాలు మరింత చిన్నగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు టాప్‌ 10 ప్రాధాన్యం ఉన్న శాఖల్లో కనీసం నాలుగైనా దక్షిణాదికి ఇచ్చిందని, ఉత్తరాదికి చెందిన వ్యక్తి ప్రధానిగా ఉంటే దక్షిణాదికి రాష్ట్రపతి పదవి ఇచ్చి సమతుల్యత పాటించిందని గుర్తు చేశారు.


జనాభా ప్రాతిపదికకు బదులు దేశ ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది రాష్ట్రాల వాటా ఆధారంగా సీట్ల పెంపును ఎందుకు చేపట్టకూడదని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థలో 40 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదని, ఈ అంశాన్ని మెరిట్‌ లెక్కన తీసుకుని సీట్ల పెంపును చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న దృష్ట్యా దక్షిణాదికి ఉండే మెరిట్‌ అంశాల అధారంగా సీట్ల పెంపును చేపట్టాలని సూచించారు. ‘‘జనాభాలో 2.5 శాతం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణది 5 శాతం వాటా. యూపీ కేంద్రానికి చెల్లించే రూపాయికి తిరిగి రూ.3.50, మధ్యప్రదేశ్‌ రూ.2.50, బిహార్‌ రూ.4.50కి పైగా పొందుతుండగా, దక్షిణాది రాష్ట్రాలు 50 పైసలలోపే పొందుతున్నాయి. నైరుతి (సౌత్‌ వెస్ట్‌) రాష్ట్రాలు ఆర్థికంగా ఆధిపత్యం చెలాయిస్తే.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి’’ అని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న జనగణన ఆధారంగా డీలిమిటేషన్‌ చేపట్టాలని, తెలంగాణలో కులగణనను ఐదు నెలల్లో చేశామని, కేంద్రం తలచుకుంటే ఆరు నెలల్లో పూర్తి చేస్తుందని, వచ్చే 2027 మార్చి వరకు జనగణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 12 నెలల్లో డీలిమిటేషన్‌ పూర్తి చేసి, మహిళా రిజర్వేషన్లపై ముందుకెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు.

డీలిమిటేషన్‌ చిన్న రాష్ట్రాల సమస్య

‘‘కేరళ, యూపీ మధ్య లోక్‌సభ సీట్ల అంతరం ఇప్పుడు 60. ఎన్డీయే చెబుతున్న మాదిరిగా 50 శాతం సీట్ల పెంపు జరిగితే సీట్ల తేడా 90కి పెరుగుతుంది. ఇదే శాతాల పరంగా చూస్తే 100 నుంచి 150కి పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయి. బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల సీట్లు సరిపోతాయి. డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో సీట్లు 130 నుంచి 195 అయితే.. ఉత్తరాదిలో మొత్తం 600 సీట్ల వరకు ఉంటాయి’’ అని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌ పార్టీల సమస్య కాదని, ప్రాంతాలు, చిన్న రాష్ట్రాల ప్రజల సమస్యగా చూడాలని వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్‌ జరిగితే ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న అంతరం అలాగే ఉండేలా చూడాలన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు డీలిమిటేషన్‌ను వ్యతిరేకించట్లేదంటే ఆయా పార్టీలు సరెండర్‌ అయ్యాయేమోనని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌పైనా డీలిమిటేషన్‌ ప్రభావం ఉంటుందని, కానీ, రాజకీయ కారణాలతో అక్కడి పార్టీలు సైలెంట్‌గా ఉన్నాయేమోనని అన్నారు.


మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్‌ బ్రెయిన్‌ చైల్డ్‌

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఎన్డీయే ఇప్పటి వరకూ అధికారికంగా స్పందించలేదని, ఎజెండాను కూడా విపక్షాలకు చెప్పలేదని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ‘‘మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్‌ బ్రెయిన్‌ చైల్డ్‌. యూపీఏ హయాంలోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ 100 శాతం కట్టుబడి ఉంది. అందుకు మాకేం అభ్యంతరం లేదు. కానీ, మహిళా రిజర్వేషన్లకు, డీలిమిటేషన్‌కు లింకు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎన్డీయే కుట్ర చేస్తోంది’’ అని ఆరోపించారు. ఎన్డీయే మెలికల్లో రాజకీయ స్వార్థం ఉందని, డీలిమిటేషన్‌ ముసుగులో ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో మోసం చేయాలన్నది వాళ్ల ఉద్దేశమని తెలిపారు. ఇప్పుడున్న లోక్‌సభ సీట్లలో పురుషుల ప్రాతినిథ్యానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా కొత్తగా 272 సీట్లు పెంచి.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఇవ్వాలనుకుంటోందని, అందుకే, డీలిమిటేషన్‌ను ముందుకు తెస్తోందని వివరించారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కూడా కోటా కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉపన్యాసాల్లో మోదీ ఏమైనా చెబుతారని, చంద్ర మండలాన్ని కూడా భూమి మీదకు తెచ్చానని చెబుతారంటూ సీఎం రేవంత్‌ చమత్కరించారు.

గద్దర్‌ను కిషన్‌రెడ్డి కలిసిన విషయం మోదీకి తెలియదేమో!

గద్దర్‌ గురించి ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ స్పందించారు. గద్దర్‌ను కిషన్‌ రెడ్డి కలిసిన విషయం మోదీకి తెలియదేమో అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్లో జీవన్‌రెడ్డి చేరిక, కాంగ్రెస్పై కేటీఆర్‌ విమర్శలపై స్పందిస్తూ.. జీవన్‌ రెడ్డి చేరికను లాస్ట్‌ సప్పర్‌గా అభివర్ణించారు. ఆలె నరేంద్ర, దేశిని చిన మల్లయ్య, ఈటల రాజేందర్‌, విజయశాంతి, పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే కదా అని వ్యాఖ్యానించారు. పొన్నాల లక్ష్మయ్యను బీఆర్‌ఎస్లో ఎప్పుడైనా చూశారా? అంటూ ప్రశ్నించారు. ‘‘జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయాక వారి మీద గెలిచిన వారిని పార్టీలోకి చేర్చుకున్నారు. జూపల్లి, తుమ్మలకు కనీసం వార్డు మెంబర్‌ అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం కూడా లేకపోయింది’’ అని గుర్తు చేశారు.

Updated Date - Apr 11 , 2026 | 05:15 AM