విద్యార్థుల విజయాన్ని మా ఖాతాలో వేసుకోం: సీఎం రేవంత్
ABN , Publish Date - Jul 25 , 2026 | 08:22 PM
విద్యార్థుల పోరాటం ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే తొలగించాలని, వారి విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోబోమని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జులై 25: విద్యార్థుల పోరాటం ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీని ఖండిస్తూ పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే తొలగించాలని, వారి విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోబోమని స్పష్టం చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలంతా ఇదే నినాదాన్ని వినిపించాలని సూచించారు. విద్యార్థుల పోరాటం వల్లే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని, ఇది యువత సాధించిన విజయమని అన్నారు.
విద్యార్థుల మొహాల్లో కనిపిస్తున్న ఆనందమే అసలైన విజయమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. చప్పన్ ఇంచ్ ఛాతీ అంటూ గొప్పలు చెప్పుకునే నాయకత్వం.. దేశ యువత ముందు ఓడిపోయిందని విమర్శించారు. అయితే విద్యార్థులపై నమోదైన కేసులు ఇంకా తొలగించలేదని, వెంటనే వాటిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నీట్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించలేదని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకూ వారి తరఫున కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
మోదీ చరిష్మా తగ్గింది: పీసీసీ చీఫ్
విద్యార్థుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్రం మెడలు వంచినందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. మోదీ చరిష్మా తగ్గిందని, ఆయన చర్యలను ప్రపంచం ఖండించిందని వ్యాఖ్యానించారు. జెన్ జీ యువతకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించాలని మహేష్ గౌడ్ అన్నారు. 21 ఏళ్లకే చట్టసభల్లోకి వచ్చే అవకాశం కల్పించేలా చట్టం తీసుకురావాలని, ఈ మార్పును తెలంగాణ నుంచే ప్రారంభిస్తామని తెలిపారు.
Also Read:
వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రియురాలితో మాట్లాడుతున్నాడని సహోద్యోగి హత్య..