Share News

కారు గుర్తును మర్చిపోవాల్సిందే!

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:21 AM

వచ్చే ఎన్నికల్లో నా సంగతి చూస్తానంటున్న కేసీఆర్‌కు పాలమూరు గడ్డపై సవాల్‌ విసురుతున్నా.. నిన్ను మళ్లీ మొలకెత్తనివ్వం. మీ పార్టీ జెండాలు ఎగురనివ్వం...

కారు గుర్తును మర్చిపోవాల్సిందే!

  • కేసీఆర్‌ను మళ్లీ మొలకెత్తనివ్వం.. ‘ఔర్‌ ఏక్‌ బార్‌.. కాంగ్రెస్‌ సర్కార్‌’ తథ్యం

  • కేసీఆర్‌.. దమ్ముంటే అసెంబ్లీకి రావాలి

  • పదేళ్ల నీ పాలన, నా పాలనపై చర్చిద్దాం

  • చర్చలో ఓడిపోతే క్షమాపణలు చెబుతా

  • చర్చకు మహారాష్ట్ర సీఎం దాగుడుమూతలు

  • ఆయన్ను తీసుకురాకపోతే బీజేపీ నేతలను తరుముడే

  • జడ్చర్ల ప్రజా పాలన - ప్రగతి ఉత్సవాల సభలో రేవంత్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘వచ్చే ఎన్నికల్లో నా సంగతి చూస్తానంటున్న కేసీఆర్‌కు పాలమూరు గడ్డపై సవాల్‌ విసురుతున్నా.. నిన్ను మళ్లీ మొలకెత్తనివ్వం. మీ పార్టీ జెండాలు ఎగురనివ్వం. గద్దెలు కూలుతాయి. పార్టీ గుర్తును మరిచిపోవాల్సిందే’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, ‘ఔర్‌ ఏక్‌ బార్‌.. కాంగ్రెస్‌ సర్కార్‌’ ఏర్పాటు తథ్యమని పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో తాను డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించిన ఊర్లలో కేసీఆర్‌ ఓట్లు అడగాలని, తాను ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ఊర్లలో ఓట్లు అడుగుతానని, అలా చేస్తే కేసీఆర్‌కు డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పాలమూరు ప్రాజెక్టులను సందర్శించిన ఆయన.. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో శుక్రవారం నిర్వహించిన ‘ప్రజాపాలన- ప్రగతి ఉత్సవాల’ సభలో ప్రసంగించారు. పాలమూరు ప్రాజెక్టులపై పాదయాత్ర చేస్తామని బీఆర్‌ఎస్‌ నాయకులు బయల్దేరారని, పాలమూరు నుంచి కాశీ వరకు పొర్లుదండాలు పెట్టినా వాళ్ల పాపాలు తీరవని, ప్రజలు క్షమించరని వ్యాఖ్యానించారు. పాలమూరు జిల్లాలో ఊరు లేకపోయినా.. పార్లమెంటులో నోరు లేకపోయినా.. భుజాలపై మోసి పాలమూరు ప్రజలు పార్లమెంట్‌కు పంపిస్తే పదేళ్లలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసి పాలమూరులో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదని ధ్వజమెత్తారు. లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం కూలేశ్వరమై కూలిపోయిందని ఎద్దేవా చేశారు.

3.jpg


దమ్ముంటే అసెంబ్లీకి రా చర్చిద్దాం..

కేసీఆర్‌ దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై.. రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ పాలనపై చర్చ పెడదామని, ఒకవేళ ఆ చర్చలో తాను ఓడిపోతే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌కు క్షమాపణలు చెబుతానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ‘‘రెండున్నరేళ్లలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ.22 వేల కోట్లు ఖర్చు చేశా. ఒక్క పాలమూరు జిల్లా ప్రాజెక్టులకే రూ.8 వేల కోట్లు కేటాయించా. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 15 లక్షల రేషన్‌ కార్డులు ఇచ్చాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ ఇస్తున్నాం. ఉచిత బస్సు పథకం కింద ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు చెల్లించాం. మహిళా సంఘాలకు బస్సులు, పెట్రోల్‌ బంక్‌లు ఇచ్చాం. ఉచిత ప్రయాణమే కాదు.. బస్సులకు యజమానులను చేశాం. 67,600 ప్రభుత్వ నియామకాలు చేపట్టాం. లెక్కల్లో అనుమానాలుంటే తేదీ నిర్ణయిస్తే వచ్చి లెక్క చెబుతా. 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. సన్నధాన్యం పండించిన రైతులకు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. రెండున్నరేళ్లలో రూ.27 వేల కోట్లు రైతు భరోసా కింద ఖాతాల్లో జమ చేశాం. ఒక్క వ్యవసాయ రంగానికే రూ.1.50 లక్షల కోట్లు వెచ్చించాం’’ అని వివరించారు. తాడు, బొంగరం లేని బిల్లా రంగాలను వదిలాడని, వారిద్దరికే పొసగడం లేదని, వారు తన పాలనపై ఏం మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇచ్చిన ధైర్యంతో గల్లీలో ఉండే కేడీతోనైనా, ఢిల్లీలో ఉండే మోడీతోనైనా కొట్లాడతానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను మేకవ న్నె పులి అని గుర్తించక రెండుసార్లు ముఖ్యమంత్రి చేశామన్నారు. దొంగలకు సద్దులు మోసేవారితో జాగ్రత్తగా ఉండాలని, మనవారైనా అప్రమత్తత అవసరమని వ్యాఖ్యానించారు. వనపర్తిలో ఒకరు, పాలమూరులో ఒకరు మోపయ్యారని విమర్శించారు. గోదావరి జలాల్లో జరిగిన అన్యాయంపై మహారాష్ట్ర సీఎంను నిలదీస్తామని, చర్చలకు రమ్మంటే దాగుడుమూతలు ఆడుతున్నారని, రాష్ట్ర బీజేపీ నేతలు మర్యాదగా ఆయనను చర్చలకు తీసుకురావాలని, లేకపోతే తెలంగాణ నుంచి తరమడం ఖాయమని హెచ్చరించారు. సభలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపట్టి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

5.jpg

Updated Date - Jun 06 , 2026 | 04:21 AM