ఫెర్టిలైజర్ యాప్‌ను తేనున్న కేంద్రం.. ఒకే యాప్ ద్వారా అన్ని ఎరువులు..
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:08 AM
దేశంలో ఎరువుల పంపిణీని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్‌ను అమలులోకి తీసుకువస్తోంది. రైతులు నేరుగా ఎరువుల దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘాలకు వెళ్లకుండా... ముందుగా ఈ యాప్‌లోనే ఎరువులు బుక్ చేసుకుని ఆ తర్వాత నిర్ణీత సమయానికి వెళ్లి తెచ్చుకునేలా ఈ వ్యవస్థను అమలుచేయనుంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : దేశంలో ఎరువుల పంపిణీని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్‌ను అమలులోకి తీసుకువస్తోంది. రైతులు నేరుగా ఎరువుల దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘాలకు వెళ్లకుండా... ముందుగా ఈ యాప్‌లోనే ఎరువులు బుక్ చేసుకుని ఆ తర్వాత నిర్ణీత సమయానికి వెళ్లి తెచ్చుకునేలా ఈ వ్యవస్థను అమలుచేయనుంది. ఈ ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనే దీన్ని పక్కాగా అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో యూరియా పంపిణీని క్రమబద్ధీకరించి, సరఫరాను మెరుగుపరిచేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ గత సంవత్సరం నుంచి ‘యూరియా యాప్’ను అమలులోకి తెచ్చింది. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఎదురైనా... ఆ యాప్ వల్ల యూరియా పంపిణీ మెరుగుపడింది.
ఆ యాప్ విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఫెర్టిలైజర్ యాప్‌ను అమలుచేయాలనే ఆలోచనకు వచ్చింది. ఆధార్‌తో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న అందరి రైతుల వివరాలు, వారి భూముల విస్తీర్ణం వివరాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల నుంచి తీసుకుంది. అలాగే కేంద్రం ఇప్పటికే ‘ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఐఎఫ్ఎంఎస్) అమలుచేస్తోంది. దీని ద్వారా రాష్ట్రాలు, జిల్లాల వారీగా ఎరువుల అవసరాన్ని అంచనా వేస్తూ, సబ్సిడీ విధానం అమలు చేస్తూ, ఎరువుల కొరత, ఆక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌ను నియంత్రిస్తూ వస్తోంది. దీనికి అనుసంధానంగా ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’(ఎఫ్‌ఎఫ్‌ఎస్) యాప్‌ను అమలులోకి తేవాలని నిర్ణయించింది. కాగా దేశవ్యాప్తంగా ఒకే యాప్ అమలులోకి రానుండడంతో రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్‌ను రద్దుచేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
దుకాణాల్లో నిల్వల వివరాలు అందుబాటులో..
సమీప దుకాణాల్లో నిల్వల పరిస్థితి తెలుసుకోవటం, ఎరువులను ముందుగానే బుక్ చేసుకోవటం వంటి సౌకర్యాలు ఈ యాప్‌లో ఉంటాయి. ఇందుకు ముందుగా ఆధార్ నెంబరు, ఓటీపీతో నమోదు పూర్తిచేయాలి. తర్వాత భూమి, పంట వివరాలు నమోదు చేయాలి. సమీప డీలర్‌ను ఎంపిక చేసుకొని ఎరువులు బుక్ చేసుకోవాలి. వాటి క్యూఆర్ కోడ్, సంక్షిప్త సందేశం మొబైల్, వాట్సాప్‌కు వస్తాయి. వాటిని ఆ డీలర్‌కుచూపించి ఎరువులు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఆ బాలికపై ఏ కేసు నమోదు చేయట్లేదు: ఢిల్లీ పోలీసులు