Share News

వైరస్‌లతో పోరాడే ప్రోటీన్

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:54 AM

మనిషి శరీరంలోకి హానికారక వైరస్‌ ప్రవేశించిన వెంటనే గుర్తించి శరీరానికి హెచ్చరికలు జారీ చేయడమేగాక, రోగ నిరోధక వ్యవస్థను అప్రమత్తం చేసే ప్రొటీన్‌ను సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు గుర్తించారు.

వైరస్‌లతో పోరాడే ప్రోటీన్
ccmb

  • డీజడ్‌ఐపీ3ను గుర్తించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు

  • హానికారక వైరస్‌ ప్రవేశిస్తే శరీరానికి హెచ్చరికలు

  • రోగ నిరోధక శక్తిని అప్రమత్తం చేసే ప్రోటీన్‌

  • యాంటీ వైరల్‌ చికిత్సలకు కొత్త మార్గం!

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మనిషి శరీరంలోకి హానికారక వైరస్‌ ప్రవేశించిన వెంటనే గుర్తించి శరీరానికి హెచ్చరికలు జారీ చేయడమేగాక, రోగ నిరోధక వ్యవస్థను అప్రమత్తం చేసే ప్రొటీన్‌ను సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు గుర్తించారు. డాక్టర్‌ సంతోష్‌ చౌహాన్‌ సారథ్యంలోని సీసీఎంబీ పరిశోధకుల బృందం మానవ ప్రొటీన్ల పనితీరుపై ఏడేళ్లుగా పరిశోధనలు జరుపుతోంది. దీంట్లోభాగంగా, డీజడ్‌ఐపీ3 ప్రోటీన్‌ను తాజాగా గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ‘ది ఈఎంబీఓ జర్నల్‌’లో ప్రచురితం అయ్యాయి. వీటి ప్రకారం.. కణజాలంలోకి వైరస్‌ ప్రవేశించిన వెంటనే డీజడ్‌ఐపీ3 ప్రోటీన్‌ క్రియాశీలంగా మారి తన రూపాన్ని మార్చుకుంటుంది. అనంతరం మైటోకాండ్రియాను చేరుకొని రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. టైప్‌ 1 ఇంటర్‌పెరాన్‌ అనే రక్షణ అణువులను విడుదల చేసి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటుంది. ఈ ఆవిష్కరణ ఆధారంగా డాక్టర్‌ చౌహాన్‌ బృందం డీజడ్‌ఐపీ 3 ప్రోటీన్‌ను ప్రేరేపించే ఔషధాలను అభివృద్ధి చేయటంపై దృష్టి పెట్టింది. వీటి ద్వారా శరీర సహజ రోగనిరోధక శక్తిని కృత్రిమంగా బలోపేతం చేసే దిశగా పరిశోధనలు జరుపుతున్నారు. సార్స్‌ కొవిడ్‌, చికన్‌గున్యా, జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ సహా పలు రకాల వైర్‌సల నుంచి డీజడ్‌ఐపీ 3 ప్రోటీన్‌ రక్షణ కల్పిస్తుందని డాక్టర్‌ చౌహాన్‌ తెలిపారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరముందన్నారు. కణజాల సహజ రక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం ద్వారా యాంటీ వైరల్‌ చికిత్సలను కొత్తమార్గంలోకి మళ్లించవచ్చన్నారు. ఈ పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నిధులను సమకూర్చిందని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?

భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!

Updated Date - Oct 23 , 2026 | 05:59 AM