Share News

మాపై పురుష పోలీసులు దాడి చేశారు

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:32 AM

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఈ నెల 7న జరిగిన ఘటనపై బీఆర్‌ఎస్‌.. జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ)కు, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేసింది. మహిళా ప్రజాప్రతినిధులపై పురుష పోలీసులతో దాడి చేయించారని, అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగించారని తెలిపింది

మాపై పురుష పోలీసులు దాడి చేశారు
BRS LEADERS

  • అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.. మా హక్కులకు భంగం కలిగించారు

  • ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు.. 100 గంటలు దాటినా ఎఫ్‌ఐఆర్‌ లేదు

  • ఎన్‌సీడబ్ల్యూ, ఎన్‌హెచ్‌ఆర్‌సీకి బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఈ నెల 7న జరిగిన ఘటనపై బీఆర్‌ఎస్‌.. జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ)కు, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేసింది. మహిళా ప్రజాప్రతినిధులపై పురుష పోలీసులతో దాడి చేయించారని, అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగించారని తెలిపింది. పోలీసులు చేసిన ఈ దాడులపై స్పందించాల్సిన ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉంటున్నారని పేర్కొంది. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు ఏకపక్షంగా, ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ ప్రతినిధి బృందం శుక్రవారం న్యూఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయా రహట్కర్‌ను, ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలు విజయ భారతిని కలిసి ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనలకు సంబంధించిన అన్ని సీసీటీవీ ఫుటేజీలను భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్రతినిధులు కోరారు. ఈ బృందంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ తదితరులు ఉన్నారు.


గొంతు నులిమారు: సబితా ఇంద్రారెడ్డి

ఫిర్యాదు అనంతరం సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ‘‘ప్రజా సమస్యలపై పోరాడాల్సిన మేము.. మమ్మల్ని రక్షించుకునేందుకు పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. అసెంబ్లీలో అడుగుపెట్టకముందే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. నడిరోడ్డుపై నా గొంతు నులిమి, సహచర ఎమ్మెల్యే చీర, జుట్టు పట్టుకుని లాగారు. 20, 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధులుగా ఉన్న మా పట్ల పురుష పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అవమానకరం. దాడి జరిగి 100 గంటలు దాటినా ఎఫ్‌ఐఆర్‌ లేదు. పైగా, తిరిగి మాపైనే కేసులు పెట్టారు’’ అని మండిపడ్డారు.

చీర లాగి అవమానపరిచారు: సునీత

అసెంబ్లీ సాక్షిగా పురుష పోలీసులు తన చీర లాగి అత్యంత హేయంగా ప్రవర్తించారని సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని, రాష్ట్రంలో న్యాయం జరగకే ఢిల్లీకి వచ్చామని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బ్రిక్స్ సమ్మిట్: చిదంబరంనకు సొంత పార్టీ నేతల నుంచే కౌంటర్

ఒక్క రోజులో 20 లక్షలకు పైగా టిక్కెట్లు.. రైల్వే చరిత్రలో రికార్డు బుకింగ్స్

Updated Date - Sep 12 , 2026 | 03:32 AM