Share News

రోహిత్‌ విషయంలో ఏం చేద్దాం?

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:38 AM

డ్రగ్స్‌ కేసులో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి విషయంలో బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇదే కేసులో పట్టుబడిన ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కు టీడీపీ వెంటనే షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

రోహిత్‌ విషయంలో ఏం చేద్దాం?

బీఆర్‌ఎస్‌ నాయకత్వం మల్లగుల్లాలు

నాడు కవితపై ఆగమేఘాల మీద చర్యలు

నేడు పైలట్‌కు ఆలస్యంగా షోకాజ్‌ నోటీసు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)

డ్రగ్స్‌ కేసులో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి విషయంలో బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇదే కేసులో పట్టుబడిన ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కు టీడీపీ వెంటనే షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం తేలేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనీ ఆదేశించింది. అయితే, ఇక్కడ రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుబడిన రోహిత్‌రెడ్డి విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆలస్యంగా స్పందించింది. రెండ్రోజుల తర్వాత మంగళవారం పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ అతనికి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రోహిత్‌పై చర్యల విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఎందుకు తాత్సారం చేసిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ లైన్‌ దాటినందుకు సొంత కుమార్తె కవితను ఆగమేఘాలపై సస్పెండ్‌ చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు రోహిత్‌ విషయంలో ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటుంబంతో మంచి సంబంధాలే ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్‌రెడ్డి కీలకంగా ఉన్నారు. గతంలో రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో స్ట్రింగ్‌ ఆపరేషన్‌ చేసి, బీజేపీ వ్యక్తులుగా చెప్పుకొంటున్న ముగ్గురిని అరెస్ట్‌ చేయించడంతోపాటు అప్పటి బీజేపీ పెద్దలు కొందరిపై ఆరోపణలు కూడా చేశారు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కీలకమైన ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడు రోహిత్‌రెడ్డే. ఆయన ద్వారానే బీఆర్‌ఎస్‌ ఈ వ్యవహారమంతా నడిపింది. ఇప్పుడు డ్రగ్స్‌ కేసులో రోహిత్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అతను అడ్డం తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే బీఆర్‌ఎస్‌ నాయకత్వానికి కొత్త తలనొప్పులు మొదలవుతాయి. కానీ, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున అతనిపై చర్యలు తీసుకోకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని భావించి నోటీసు జారీ చేసినట్లు తెలిసింది.


రోహిత్‌ నా కొడుకుతో సమానం..!

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తర్వాత రోహిత్‌కు బీఆర్‌ఎస్‌ నాయకత్వం పూర్తి అండగా నిలిచింది. గత ప్రభుత్వంలో ఆయన కోరిన పనులన్నీ చకచకా జరిగిపోయేవి. ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రత కూడా కల్పించారు. గత ఎన్నికల్లో రోహిత్‌ను గెలిపించుకునేందుకు బీఆర్‌ఎస్‌ పెద్దలంతా రంగంలోకి దిగారు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి సైతం టికెట్‌ నిరాకరించారు. అప్పట్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగేందుకు యత్నించిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్తను కూడా పోటీలో లేకుండా చేశారు. ఇందుకోసం బీఆర్‌ఎస్‌ అగ్రనేత.. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే, వ్యాపార భాగస్వామి(ప్రముఖ వ్యాపారవేత్త)ని పిలిచి హెచ్చరించారు. ‘రోహిత్‌ నా కొడుకుతో సమానం. అక్కడ అతనే గెలవాలి. ఏం చేస్తావో తెలియదు. మీ పార్టనర్‌ తాండూరులో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయకూడదు’ అని హెచ్చరించి పంపారు. దీంతో సదరు వ్యాపారవేత్త తన భాగస్వామితో ‘నువ్వు పోటీ చేస్తే మనకు ఇబ్బంది’ అని, విరమించుకోవాలని నచ్చజెప్పే యత్నం చేయగా.. ఇద్దరి మధ్య పెద్ద వివాదమే జరిగింది. చివరకు వ్యాపార భాగస్వాములిద్దరూ విడిపోయారు. మాజీ ఎమ్మెల్యేకు తాండూరులో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కలేదు. పార్టీ వేరేచోట టికెట్‌ ఇచ్చినా.. ఆయన ఓడిపోయారు.

Updated Date - Mar 18 , 2026 | 04:38 AM