నేనొస్త బిడ్డో ఎయిమ్స్‌కు!
ABN , Publish Date - May 03 , 2026 | 04:33 AM
నేను రాను బిడ్డో సర్కారీ దవాఖానకు’ అనే పాట వినే ఉంటారు! కానీ.. హైదరాబాద్ శివార్లలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉంది! అతి తక్కువ రుసుములకే కార్పొరేట్ వైద్యం లభిస్తుండడంతో ....
బీబీనగర్ ఆస్పత్రిలో పేదలకు అందివచ్చిన కార్పొరేట్ వైద్యం
పది రూపాయలకే ఓపీ వైద్యసేవలు
పరీక్షలకు ప్రైవేట్ రుసుముల్లో పదో వంతే
రూ.25-250కే రక్తపరీక్షలు.. రూ.30-300కే ఎక్స్‌రే, ఈసీజీ
రూ.30 నుంచి 60లకే ఇతరత్రా పరీక్షలు
500 రూపాయల్లోపే 2డీ ఎకో టెస్టు
ఎంఆర్‌ఐకి రూ.2,500-3,500 వసూలు
రోజుకు 1500 - 2000 మందికి సేవలు
జాతీయస్థాయి వైద్యనిపుణులతో మెరుగైన వైద్యచికిత్సలు
పది జిల్లాల నుంచి ఆస్పత్రికొస్తున్న రోగులు
యాదాద్రి, మే 2 (ఆంధ్రజ్యోతి): ‘నేను రాను బిడ్డో సర్కారీ దవాఖానకు’ అనే పాట వినే ఉంటారు! కానీ.. హైదరాబాద్ శివార్లలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉంది! అతి తక్కువ రుసుములకే కార్పొరేట్ వైద్యం లభిస్తుండడంతో ఆ ఆస్పత్రికి రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. చుట్టుపక్కల పది జిల్లాల నుంచి నిత్యం వేలాది మంది ఆ ఆస్పత్రికి వస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, జాతీయ స్థాయి నిపుణులతో చికిత్సలు, అంతర్జాతీయ స్థాయి ఆధునిక వైద్యపరికరాలతో కచ్చితమైన రోగనిర్ధారణ, రకరకాల రోగనిర్ధారణ పరీక్షలకు సైతం అతి తక్కువ రుసుములు ఉండడంతో పేదవారితోపాటు మధ్యతరగతివారు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ.1,369 కోట్ల అంచనా వ్యయంతో.. 33 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 750 పడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రిని హైదరాబాద్-భూపాలపట్నం 163 జాతీయ రహదారిపై ఏర్పాటు చేస్తోంది. దాదాపు 200ఎకరాల విస్తీర్ణంలో స్టార్ హోటళ్లను తలపించే రీతిలో... ప్రశాంతమైన, పచ్చటి వాతావరణంలో నెలకొల్పిన ఎయిమ్స్ నిర్మాణాలు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. ఈ ఆస్పత్రి భవన సముదాయంలో దాదాపు ఐదేళ్లుగా అవుట్ పేషెంట్ సేవలు, రెండేళ్లుగా ఇన్‌పేషెంట్, అత్యవసర సేవలను అందిస్తున్నారు. ఇన్‌పేషెంట్ల కోసం ఇప్పటికే 160 పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెలలో హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ ఆస్పత్రిని పర్చువల్‌గా ప్రారంభించనున్నారు. జూన్ చివరి నాటికి పూర్తిస్థాయి వైద్య సేవలు, ఇన్‌పేషెంట్ల కోసం 750 పడకలను అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
అతి తక్కువ ధరలకే..
ఈ ఆస్పత్రిలో అవుట్‌పేషెంట్ సేవల రుసుము కేవలం రూ.10 మాత్రమే. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు రోగనిర్ధారణపరీక్షలకు వసూలు చేసే ఫీజుల్లో కేవలం పదో వంతు రుసుములకే ఇక్కడ వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఉదాహరణకు.. రక్తపరీక్షలకు కేవలం రూ.25నుంచి రూ.250, ఎక్స్‌రే, ఈసీజీ వంటి టెస్ట్‌లకు రూ.30 నుంచి రూ.300, యూరిన్, క్రియాటినైన్, కాలేయ, మూత్రపిండాల పనితీరు పరీక్షల వంటివాటికి రూ.30 నుంచి రూ.60 దాకా వసూలు చేస్తున్నారు. హృద్రోగులకు చేసే 2డీ-ఏకో టెస్టుకు రూ.500లోపే వసూలు చేస్తున్నారు. ఎంఆర్‌ఐ స్కాన్ (బ్రెయిన్, స్పైన్, బాడీ)కి కేవలం రూ.2,500 నుంచి రూ.3,500 దాకా చార్జ్ చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేసే రుసుములతో పోలిస్తే ఇవి పదో వంతు కూడా ఉండటం లేదని రోగులు అభిప్రాయపడుతున్నారు. అలాగే.. ఇక్కడ అత్యంత అధునాతనమైన ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రోజుకు సుమారు 1,500 నుంచి 2,000 మంది.. ఓపీ, డయాగ్నోసిస్ సేవలు పొందుతున్నారు. సిబ్బంది విషయానికి వస్తే.. 36 మంది సీనియర్ రెసిడెంట్లు, 107మంది ఫ్యాకల్టీ వైద్యులు సేవలందిస్తున్నారు. 902మంది బోధనేతర సిబ్బందితో పాటు వందల మంది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు.
సమస్యలూ ఉన్నాయి..
బీబీనగర్ ఎయిమ్స్‌కు రోజూ సుమారు 1500-2000 మంది ఓపీ సేవల కోసం వస్తున్నారు. అయితే, వారు తమ పేరు నమోదు చేసుకోవడానికి సరిపడా కౌంటర్లు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పేరు నమోదు చేయించుకోవడానికే రోగులు, వారి సహాయకులు గంటల కొద్దీ నిరీక్షించాల్సివస్తోంది. ఇక టెస్టుల కోసం రక్త, మూత్ర నమూనాలు ఇవ్వడానికి ఒక రోజంతా పట్టడమేగాక, రిపోర్టులు రావడానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతుండటం గమనార్హం. హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారిపై ఉన్న ఈ ఆస్పత్రికి దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సు సర్వీసులు సరిగా నిలపడానికి, బస్సుల కోసం నిరీక్షించడానికి సరైన బస్టాండ్ లేకపోవడంతో రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.