ఫిరాయింపు రాజకీయాలకు చరమగీతం పాడాలి: బండి సంజయ్
ABN , Publish Date - Sep 24 , 2026 | 03:12 PM
ఫిరాయింపుల రాజకీయాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. పార్టీ మారే నేతల తీరుపై మండిపడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై ఘాటు విమర్శలు చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24: తాజా రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఫిరాయింపుల రాజకీయాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలోకి ఫిరాయించడం నైతికతకే మచ్చ అని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలకు సిగ్గు రాలేదని, ఆయా రామ్, గయా రామ్ సంస్కృతిని ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దానం నాగేందర్ వ్యవహారంలో వాస్తవాలను కప్పిపుచ్చి కొన్ని మీడియా సంస్థలు తీర్పును వక్రీకరిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపుల రాజకీయాలను సమర్థిస్తూ ఎవరికి వారే తమ విజయంగా చెప్పుకోవడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని, ఈ తీర్పు ఆ రెండు పార్టీలకు చెంపపెట్టు వంటిదని స్పష్టం చేశారు.
ఈ అనైతిక రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమని, నైతికతను మంటకలిపిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఆ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే లేదని తేల్చిచెప్పారు. హిందూ బంధువులు, ప్రజలంతా ఏకమై ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ఈ రెండు పార్టీలను రాజకీయంగా నిమజ్జనం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడకుండా ప్రజలే గట్టి గుణపాఠం చెప్పాలని, ఈ ఎన్నికల ద్వారా అలాంటి బలమైన సంకేతాలను పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి:
కొడుకు అరెస్టుతో తండ్రి నేర చరిత్ర వెలుగులోకి.!
బిహార్‌లో దారుణం.. మరో బాలికపై లైంగిక వేధింపులు