ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్‌కు నిదర్శనం పోలీస్ బ్యాండ్ పోటీలు: కేంద్ర మంత్రి బండి సంజయ్
ABN , Publish Date - Nov 20 , 2026 | 08:34 PM
దేశవ్యాప్తంగా 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల్లో పాల్గొన్న వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలకు చెందిన బ్యాండ్ బృందాలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 20: దేశవ్యాప్తంగా 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల్లో పాల్గొన్న వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలకు చెందిన బ్యాండ్ బృందాలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు.
హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు.. ఈశాన్య ప్రాంతాల నుంచి పశ్చిమ సరిహద్దుల వరకు దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన బృందాలు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయని కొనియాడారు. ఆయా బృందాల ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, వారి ప్రదర్శనలు చూసి గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ ముగింపు వేడుక కేవలం ఒక పోటీ ముగింపు మాత్రమే కాదని, నెలల తరబడి బ్యాండ్ బృందాలు చేసిన కఠోర శ్రమ, నిరంతర సాధన, అంకితభావానికి నిదర్శనమని అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బృందాలు ఒకే వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించడం భారతదేశ ఐక్యతను చాటుతోందని తెలిపారు.
పోలీస్, సైనిక బ్యాండ్లు శతాబ్దాల చరిత్ర కలిగిన గొప్ప సంప్రదాయానికి ప్రతీకలని బండి సంజయ్ పేర్కొన్నారు. గతంలో యుద్ధరంగంలో డప్పులు, బ్యూగిల్ ధ్వనులు సైనిక దళాలకు దిశానిర్దేశం చేయడంతో పాటు వారిలో ధైర్యం, ఉత్సాహాన్ని నింపేవని గుర్తుచేశారు. అమర వీరులకు నివాళులర్పించే కార్యక్రమాలు, గణతంత్ర దినోత్సవ పరేడ్‌లలో పోలీస్, సైనిక బ్యాండ్ల పాత్ర ఎంతో కీలకమని వివరించారు. 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగం (సీఆర్‌పీఎఫ్)కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు దేశ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేస్తాయని, ఈ వేడుకలు 'ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్' స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయని బండి సంజయ్ అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..