Share News

Sankranti Travel Rush Begins: పల్లెకు పోదాం.. పండగ చేద్దాం

ABN , Publish Date - Jan 11 , 2026 | 03:27 AM

రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సంక్రాంతి పండగ రద్దీ మొదలైంది. శనివారం నుంచివిద్యాసంస్థలకు సెలవులు ఇవ్వటంతో ప్రజలు పండగ జోష్‌తో సొంత గ్రామాల బాట పట్టారు.

Sankranti Travel Rush Begins: పల్లెకు పోదాం.. పండగ చేద్దాం

  • రహదారులపై సంక్రాంతి పండగ రద్దీ షురూ

  • విజయవాడ రహదారి కిటకిట

  • టోల్‌ప్లాజాల వద్ద వాహనాల బారులు

  • ట్రాఫిక్‌జామ్‌ కాకుండా అధికారుల పకడ్బందీ చర్యలు

  • రహదారుల వెంట సిద్ధంగా మెకానిక్‌లు, అంబులెన్స్‌లు

  • రద్దీ ప్రాంతాలకు ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని అధికారుల సూచన

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సంక్రాంతి పండగ రద్దీ మొదలైంది. శనివారం నుంచివిద్యాసంస్థలకు సెలవులు ఇవ్వటంతో ప్రజలు పండగ జోష్‌తో సొంత గ్రామాల బాట పట్టారు. ముఖ్యంగా హైదరాబాద్‌- విజయవాడ 65వ నెంబర్‌ జాతీయ రహదారి శుక్రవారం నుంచే వాహనాలతో కిటకిటలాడుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హైవేపై భారీ రద్దీ నెలకొంది. హైవే వెంట ఉన్న హోటళ్లు, దాబాలు ప్రయాణికులతో సందడిగా మారాయి. జంక్షన్ల వద్ద పాదచారులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. హైవేపై ట్రాఫిక్‌ నియంత్రణకు 150 మంది పోలీసులను నియమించారు. క్రేన్‌లు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. మెకానికల్‌ సమస్యలతో రోడ్లపై వాహనాలు ఆగిపోతే వెంటనే బాగుచేసేందుకు ఆర్టీసీ నుంచి మెకానిక్‌లను రప్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేటు వద్ద శనివారం అర్ధరాత్రి వరకు వాహనాలు బారులుతీరాయి.

టోల్‌గేట్ల వద్ద హ్యాండ్‌ స్కానర్లను ఏర్పాటుచేసి వాహనాలు ఎక్కువసేపు ఆగకుండా చర్యలు తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అకాంక్ష్‌యాదవ్‌, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రభాకర్‌రెడ్డి శనివారం పంతంగి టోల్‌గేట్‌ వద్ద ట్రాఫిక్‌ రద్దీని పరిశీలించారు. వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంతంగి టోల్‌ప్లాజా మీదుగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం రాత్రి వరకు 1.35 లక్షల వాహనాలు రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సురక్షితంగా గమ్యం చేరి, సంతోషంగా పండగ జరుపుకోవాలని సూర్యాపేటలో జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ హైవేపై శనివారం వాహనదారులకు పువ్వులు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని టోల్‌ప్లాజాల వద్ద కూడా వాహనాల రద్దీ కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్‌-భూపాలపల్లి 163వ జాతీయ రహదారిపై కూడా సంక్రాంతి పండగ రద్దీ మొదలైంది. సంక్రాంతి ప్రయాణికులతో బాసర రైల్వేస్టేషన్‌ శనివారం కిటకిటలాడింది. ప్రయాణికులతో హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్లు నిండిపోయాయి.


ప్రత్యామ్నాయమే ఉత్తమం..

సంకాంత్రి పండగ కోసం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేవారు హైదరాబాద్‌ - విజయవాడ రహదారిపై రద్దీ ప్రాంతాల్లో ఇరుక్కుని సమయం వృథా చేసుకోకుండా ప్రయత్నాయాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవాలని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్లేవారు ఓఆర్‌ఆర్‌పై నుంచి వరంగల్‌ హైవేకు దిగి అక్కడి నుంచి భువనగిరి మీదుగా నార్కట్‌పల్లికి చేరుకోవాలని, అటు నుంచి అద్దంకి జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తే ట్రాఫిక్‌ సమస్యలు తక్కువగా ఉంటాయని సూచించారు. కొంతదూరం పెరిగినా హైదరాబాద్‌- నాగార్జునసాగర్‌ హైవే మార్గం ప్రయాణానికి అనుకూలమని తెలిపారు. గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లే వాహనాలు నాగార్జునసాగర్‌ హైవే మార్గాన్ని ఎంచుకోవాలని కోరారు.

భారీ రద్దీ ఉంటే.. టోల్‌గేట్లు తెరుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

సంక్రాంతి పండగ కోసం హైదరాబాద్‌ నుంచి స్వగ్రామాలకు వెళ్లేవారికి హైవేలపై ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ప్రధానంగా హైదరాబాద్‌ - విజయవాడ రహదారిపై మరమ్మతులు జరుగుతున్న చోట ప్రయాణం సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ఏడాది సంక్రాంతికి ఈ రహదారిపై సుమారు 12 లక్షల వాహనాలు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినా, భారీ రద్దీ ఉన్నా టోల్‌ప్లాజాల దగ్గర టోల్‌గేట్లను వెంటనే ఎత్తి వాహనాలను పంపించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. రహదారిపై ప్రతి 20 కిలోమీట్లరకు ఒక అంబులెన్స్‌ను ఉంచడంతో పాటు వాహనాలు రోడ్డుపై ఆగిపోతే వెంటనే తొలగించేందుకు క్రేన్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ప్రయాణికులకు రోడ్డుపై ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి 1033 టోల్‌ ఫ్రీ నెంబరు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

అత్యవసర ఆరోగ్య సమస్యలు వస్తే వేగంగా ఆస్పత్రికి తరలించడానికి అవసరమైతే హెలికాప్టర్‌ను వినియోగించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ రహదారిపై వాహనాల రాకపోకలను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. హైదరాబాద్‌ సమీపంలోని ఫ్యూచర్‌సిటీ నుంచి ఏపీలోని బందరు వరకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు సంబంధించిన డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) సిద్ధమైందని మంత్రి తెలిపారు. ప్రాఽథమిక అంచనా ప్రకారం దీని నిర్మాణానికి రూ.20 వేల కోట్లు అవసరమని చెప్పారు. ఈ రహదారి నిర్మాణానికి త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నట్టు పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌ - విజయవాడ రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనులను రూ. 10 వేల కోట్లతో చేపట్టనున్నట్లు వివరించారు. ఏపీ-తెలంగాణ మధ్యహై స్పీడ్‌ రైలు లైన్‌కు అవసరమైన డీపీఆర్‌ కోసం టెండర్లు పిలిచినట్టు మంత్రి తెలిపారు.


Also Read:

అరంగేట్రంలోనే అదరహో.. ఎవరీ అనుష్క శర్మ!

రిపబ్లిక్ డే సేల్‌కు రెడీ అవుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటి నుంచంటే..

ట్యాగ్‌లైన్‌ ఇష్టమే కానీ...

Updated Date - Jan 11 , 2026 | 07:30 AM