తెలుగు రాష్ట్రాల నీటి వివాదంపై కేంద్రం కీలక నిర్ణయం
ABN , Publish Date - Aug 27 , 2026 | 06:51 PM
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై కేంద్రం రంగంలోకి దిగింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీతో పాటు నదీ జలాల అంశాలపై వరుస సమావేశాలకు కేంద్ర జల సంఘం సిద్ధమైంది. సెప్టెంబర్‌లో ఢిల్లీలో కీలక చర్చలు జరగనున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 27: తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నదీ జలాల వివాదాలపై కేంద్రం కీలకంగా కదులుతోంది. ఈ అంశాలపై సెప్టెంబర్ 7న ఢిల్లీలో కేంద్ర జల సంఘం (CWC) ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నదీ జలాల వివాదాలపై అజెండా.. అవసరమైన సమాచారాన్ని అందించాలని కేంద్రం ఫిబ్రవరి నుంచే పలుమార్లు లేఖలు రాసింది. అయినప్పట్టికీ స్పందన రాకపోవడంపై CWC అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉభయ రాష్ట్రాల నుంచి పూర్తి సమాచారం అందకపోయినా.. కేంద్రం తన పరిధిలోని అంశాలపై చర్చించేందుకు సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. కేంద్రం నివేదిక సమర్పించాల్సిన గడువు సమీపిస్తుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖపై కేంద్ర జల సంఘం స్పందించింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించిన అంశాలపై తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో సెప్టెంబరు 1న ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు CWC నిర్ణయించింది. ఢిల్లీలోని సేవా భవన్‌లో జరిగే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులతో తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించిన సాంకేతిక.. అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించనున్నారు. బ్యారేజీ నిర్మాణం, నీటి వినియోగం, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలపై అధికారులు చర్చించే అవకాశం ఉంది. సెప్టెంబరు 7న జరగనున్న ఉన్నతస్థాయి సమావేశానికి ముందు ఈ ప్రత్యేక భేటీ జరగనుండటంతో తుమ్మిడిహెట్టి అంశంలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి...
అనంతపురం హైవేపై అదుపుతప్పిన ఇన్నోవా.. ఇద్దరి మృతి
అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్
Read Latest Telangana News And Telugu News