Share News

అభిమాని నిరంజన్‌ను కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:28 AM

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ (17)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. బుధవారం హనుమకొండ, హనుమాన్ నగర్‌లోని బాలుడి ఇంటికి వెళ్లారు.

అభిమాని నిరంజన్‌ను కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Pawan Kalyan

వరంగల్, జూన్ 17: ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ (17)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. బుధవారం హనుమకొండ, హనుమాన్ నగర్‌లోని బాలుడి ఇంటికి వెళ్లారు. బాలుడితో కొద్దిసేపు ముచ్చటించారు. నిరంజన్ కుటుంబానికి పవన్ భరోసా ఇచ్చారు. నిరంజన్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష ఆర్ధిక సాయం అందించారు. చిన్ననాటి నుంచి మీరంటే ప్రాణం అని చెప్పిన నిరంజన్ మాటలకు పవన్ చలించి పోయారు. నిరంజన్‌ను హత్తుకుని ముద్దాడారు.


తను ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ పాటలకు వేసిన డాన్స్‌ల వీడియోలను నిరంజన్.. పవన్‌కు చూపించారు. తిరుమల నుంచి తెప్పించిన వస్త్రాన్ని నిరంజన్‌కు అందించారు. భద్రకాళి ఆలయంలో పూజ చేయించిన అమ్మవారి వెండి ప్రతిమను నిరంజన్ తల్లిదండ్రులకు అందజేశారు. ఇక, పవన్‌ పర్యటన నేపథ్యంలో అభిమానులు పెద్ద సంఖ్యలో బాలుడి ఇంటి దగ్గరికి చేరుకున్నారు.


కాగా, నిరంజన్‌కు చిన్నప్పటి నుంచి పవన్ అంటే ప్రత్యేక అభిమానం. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న అతడు తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌‌ను కలవాలన్న కోరికను కుటుంబసభ్యులతో వెలిబుచ్చాడు. ఈ విషయం పవన్ వరకు వెళ్లింది. ఆయన తన అభిమాని కోసం హనుమకొండకు వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానిని కలిశారు. అతడికి చెప్పలేనంత సంతోషాన్ని అందించారు.


ఇవి కూడా చదవండి

కీలక మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ

దసరా నాటికి అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్: భూపతిరాజు శ్రీనివాసవర్మ

Updated Date - Jun 17 , 2026 | 12:40 PM