మహిళా కమిషన్ ఎదుటకు వీసీ జానయ్య
ABN , Publish Date - Nov 13 , 2026 | 05:53 AM
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్య... గురువారం రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జానయ్యతో పాటు ఫిర్యాదుదారు కూడా హాజరు కాగా, కమిషన్ ఇరువురినీ విడివిడిగా విచారించింది
లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారించిన కమిషన్
తగిన ఆధారాలు సమర్పించాలని ఇరుపక్షాలకు ఆదేశం
తేజశ్రీకి బీజేపీ ఎమ్మెల్సీల మద్దతు..అగ్రి వర్సిటీలో ర్యాలీ
హైదరాబాద్/రాంగోపాల్‌పేట్/రాజేంద్రనగర్, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్య... గురువారం రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జానయ్యతో పాటు ఫిర్యాదుదారు కూడా హాజరు కాగా, కమిషన్ ఇరువురినీ విడివిడిగా విచారించింది. ఈ కేసుకు సంబంధించి తమ వాదనలకు మద్దతుగా ఉన్న సాక్ష్యాధారాలు, సంబంధిత పత్రాలను సమర్పించాలని ఇరువురికి ఆదేశాలు జారీ చేసింది. ఆధారాలను పరిశీలించిన అనంతరం తదుపరి విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తేజశ్రీ... వీసీ అల్దాస్ జానయ్య తనను లైంగికంగా వేధించాడంటూ మహిళా కమిషన్‌తో పాటు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరినీ వ్యక్తిగత విచారణకు పిలిచి విడివిడిగా మాట్లాడినట్లు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద పేర్కొన్నారు. నిజం ఏమిటనేది కూలంకషంగా తెలుసుకున్న తర్వాత వివరాలు ప్రజల ముందు పెడతామని నేరేళ్ల శారద తెలిపారు. కాగా, ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటుచేస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రగిడ్డంగుల సంస్థ ఎండీ కొర్ర లక్ష్మి నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీని 15రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
తేజశ్రీకి బీజేపీ ఎమ్మెల్సీల మద్దతు
అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీకి మద్దతుగా బీజేపీ ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, అంజిరెడ్డి వర్సిటీకి వచ్చి సంఘీభావం తెలిపారు. తేజశ్రీ మద్దతుదారులతో కలిసి వర్సిటీ క్యాంటీన్ నుంచి పరిపాలన భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. సమస్యను సీఎం, గవర్నర్ దృష్టికి తీసుకువెళతామని, డీజీపీని కలసి బాధిత మహిళకు న్యాయం చేయాలని కోరుతామన్నారు. అవసరమైతే జ్యూడిషియరీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తామని, జాతీయ మహిళా కమిషన్‌కూ ఫిర్యాదు చేస్తామని అన్నారు. కాగా, తనను వీసీ వాట్సాప్ కాల్స్ ద్వారా వేధించాడని, తన చాంబర్‌లో ఇష్టానుసారంగా మాట్లాడాడని ఆరోపిస్తూ తేజశ్రీ చేపట్టిన నిరసనలు గురువారం ఆరో రోజుకు చేరుకున్నాయి. మరోవైపు, ఒకే వేదికపై వీసీ అల్దాస్ జానయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ మద్దతుదారులు పోటాపోటీ నినాదాలతో నిరసనలకు దిగడంతో వర్సిటీలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
మహిళా కమిషన్‌కు నేను ఫిర్యాదు చేయలేదు: తేజశ్రీ
మహిళా కమిషన్‌కు తాను ఫిర్యాదు చేయలేదని, అయినా తన పేరుతో ఫిర్యాదు అందిందని, విచారణకు రావాలని పిలిచారని తేజశ్రీ అన్నారు. విచారణ ఏకపక్షంగా జరిగిందని అనిపిస్తుందని వాపోయారు. తనను వీసీ వేధిస్తున్న సందర్భంలో తాను పైఅధికారులకు చెప్పుకున్నానని, వారందరూ సాక్ష్యం చెబుతారంటే వారిని పట్టించుకోకుండా కమిషన్ ఏకపక్షంగా విచారణ చేసినట్లు అనిపించిందని, దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాగా, ‘‘దేశం కోసం 20ఏళ్ల పాటు ఎయిర్‌ఫోర్స్‌లో సేవ చేశాను. కానీ, నేడు నా కుమార్తెకు జరిగిన అన్యాయం గురించి పోరాడుతుంటే, ఎదురవుతున్న పరిణామాలను చూస్తుంటే ఆవేదన కలుగుతోంది’’ అని తేజశ్రీ తండ్రి లక్ష్మణ్‌రావు వాపోయారు. తన కూతురుకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అటుంచి, కనీసం రశీదు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
తమిళనాడులోని జ్యువెలరీ షోరూమ్‌లో చోరీ.. రూ.25 కోట్ల ఆభరణాలు మాయం!
రసగుల్లా అనుకుని బాంబు కొరికి వ్యక్తి మృతి