రూ. 200 కోట్ల ఆస్తుల గుర్తింపు.. డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్..
ABN , Publish Date - Jul 02 , 2026 | 08:36 PM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ ఎస్. భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం నిర్వహించిన సోదాల్లో భీమ్‌రెడ్డి డైరీలో 15 మంది బినామీల పేర్లను అధికారులు గుర్తించారు.
హైదరాబాద్, జులై 2: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ ఎస్. భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ రోజు (గురువారం) ఉదయం 5 గంటల నుంచే భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగాయి. నార్సింగిలోని వేసెల్లా మెడోస్ విల్లాలో రెండు ఏసీబీ బృందాలు రెయిడ్స్ చేశాయి. హైదరాబాద్‌లోని భీమ్‌రెడ్డి నివాసంతో పాటు 20 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
గురువారం నిర్వహించిన సోదాల్లో భీమ్‌రెడ్డి డైరీలో 15 మంది బినామీల పేర్లను అధికారులు గుర్తించారు. హైదరాబాద్, జహీరాబాద్, రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, వికారాబాద్, మోమిన్‌పేట్‌లలో బినామీల పేర్ల మీద స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. మోమిన్‌పేట్‌లో స్నేహితుడి పేరు మీద ఫాంహౌస్.. గచ్చిబౌలిలో కూతురు పేరు మీద ఓ అపార్ట్‌మెంట్.. బెంగుళూరులో బంధువు పేరిట ఎకరా స్థలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు రూ.200 కోట్ల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.
భీమ్‌రెడ్డికి 16 ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు సోదాల్లో బయటపడింది. భీమ్‌రెడ్డి నివాసంలో కిలో బంగారం, 40 లక్షల రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు. మరో రెండు రోజుల పాటు ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగనున్నాయి. కాగా, భీమ్‌రెడ్డి హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేశారు. ప్రస్తుతం డీజీపీ ఆఫీసులోని కంప్యూటర్ సర్వీసెస్‌లో పని చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు.. సచివాలయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!
తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ హాజరు కారు: ఇరాన్ అధికారి