శరీరాకృతిపై అసంతృప్తి
ABN , Publish Date - Aug 03 , 2026 | 06:27 AM
డిజిటల్ యాప్‌లు ఆహారాన్ని డెలివరీ చేయడమే కాక.. ఆహారపుటలవాట్లను, ఆలోచనలను అల్గారిథమ్‌ల ద్వారా శాసిస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆరోగ్య యాప్‌లు ఎడిట్ చేసిన చిత్రాల ద్వారా...
హైదరాబాద్‌లో 82 శాతం యువతది ఇదే పరిస్థితి
29 శాతం మందిలో ఈటింగ్ డిజార్డర్ లక్షణాలు.. డిజిటల్ యాప్‌ల వినియోగంతో తీవ్రసమస్యలు
ఆహారపుటలవాట్లను శాసిస్తున్న అల్గారిథమ్‌లు.. జర్మన్ పరిశోధకురాలి అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): డిజిటల్ యాప్‌లు ఆహారాన్ని డెలివరీ చేయడమే కాక.. ఆహారపుటలవాట్లను, ఆలోచనలను అల్గారిథమ్‌ల ద్వారా శాసిస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆరోగ్య యాప్‌లు ఎడిట్ చేసిన చిత్రాల ద్వారా శరీరాలను ఎలా అంచనా వేయాలో నిశ్శబ్దంగా, నిరంతరం నిర్దేశిస్తున్నాయి. వినియోగదారులు వాటితో తమ శరీర ఆకృతిని పోల్చుకుని తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్లు ఈ అధ్యయన నివేదిక పేర్కొంది. అలాగే, అలా్ట్రప్రాసెస్డ్ ఆహారపదార్థాలను తినడాన్ని ఆధునిక జీవనశైలిగా ప్రచారం చేయడం వల్ల వాటిని తిని ప్రజలు ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. నగరంలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) సహకారంతో.. జర్మనీలోని ఆగ్స్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన మెర్లే ముల్లర్ హాన్సెన్ అనే పరిశోధకురాలు 2023 జూలై నుంచి 2024 జనవరి మధ్య ఈ స్టడీ చేశారు. అందులో భాగంగా.. పలువురు మధ్యతరగతివారిని, ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులను, విద్యార్థులను ప్రశ్నించారు. అలాగే చండీగఢ్, న్యూఢిల్లీవాసులపై కూడా అధ్యయనం చేశారు. ఈ సమగ్ర సర్వే ఆధారంగా రూపొందించిన నివేదిక అంతర్జాతీయ జర్నల్ ‘సిటీ్‌స’లో ప్రచురితమైంది. దాని ప్రకారం..
హైదరాబాద్‌లో సర్వేలో పాల్గొన్న 30 ఏళ్లలోపువారిలో 82 శాతం మంది తమ శరీరాకృతిపై ఏ మాత్రం సంతృప్తికరంగా లేమని చెప్పారు. మొత్తం సర్వేలో పాల్గొన్నవారిలో 66 శాతం మంది (మూడింట రెండొంతుల మంది) ఈ అసంతృప్తి వెలిబుచ్చడం గమనార్హం.
34 శాతం మంది తమ శరీరాకృతిపై నెగెటివ్ కామెంట్స్ (బాడీ షేమింగ్) ఎదుర్కొన్నట్లు చెప్పారు. 18-25 సంవత్సరాల యువతలో 48 శాతం మంది కఠినమైన డైట్ పాటిస్తున్నారు. తినే ఆహారంపై విపరీతమైన ఆంక్షలు పెట్టుకుంటున్నారు.
ఫ సర్వేలో పాల్గొన్నవారిలో 29 శాతం మందిలో ఈటింగ్ డిజార్డర్ లక్షణాలు కనిపించాయి. ‘హెల్తిఫై మీ’ వంటి యాప్‌లలో క్యాలరీలు లెక్కించడం, నోటిఫికేషన్లు రావడం వల్ల కొంతమంది తీవ్ర ఆందోళనకు గురై ఒకేసారి ఎక్కువగా తినడం, ఆ తర్వాత ఉపవాసాలు ఉండటం వంటి విపరీతమైన ఈటింగ్ డిజార్డర్లలో చిక్కుకుంటున్నారు.
మహిళలు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ.. ఇంట్లో వంట ఒత్తిడి మహిళలపైనే ఎక్కువగా ఉంటోంది.
యాప్‌లలో శాకాహార వంటకాలు, ఫాస్ట్‌ఫుడ్‌కే ప్రాధాన్యం లభిస్తోంది. ముస్లిం, ఇతర మైనారిటీల సాంప్రదాయ వంటకాలు కనిపించట్లేదు.
మహిళలకు యాప్‌ల నుంచి ‘‘గిల్ట్ ఫ్రీ సలాడ్స్.. బరువు తగ్గండి’’ అని నోటిఫికేషన్లు వస్తుంటే, పురుషులకు ‘‘మజిల్ గెయిన్.. హై ప్రోటీన్’’ అంటూ జెండర్ ఆధారిత మార్కెటింగ్ సందేశాలు వస్తున్నాయి.
ఇంట్లోనూ జంక్ ఫుడ్స్
బయట జంక్ ఫుడ్స్ తినడం సాధారణమై చాలాకాలమైంది. కానీ.. ఇటీవలికాలంలో ఇళ్లల్లోనూ అలాంటి ఆహారం తినడం పెరిగిపోతున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. మైదాతో తయారుచేసిన పదార్థాలు, ఉప్పు, కారం ఎక్కువగా ఉండే వంటకాలు, అలా్ట్రప్రాసెస్డ్ ఆహార పదార్థాల వినియోగం పెరుగుతోంది. సంప్రదాయ వంటలు వండే కుటుంబాల్లో కూడా పిల్లల కోరికల కోసం ప్రతి వారం పిజ్జాలు, బర్గర్లు, చాట్లు ఆర్డర్ చేయడం సర్వసాధారణమైందని అధ్యయనం పేర్కొంది. దీనివల్ల ఊబకాయం, సంతానోత్పత్తి సమస్యలు, చిన్న వయస్సులోనే అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం దీనిపై తక్షణం దృష్టి సారించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. యాప్‌ల ద్వారా విక్రయించే ఆహారపదార్థాల లేబులింగ్‌పై కఠిన నిబంధనలు తీసుకురావాలని.. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించే బాడీ ఇమేజ్ ప్రచారాలపై నియంత్రణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..