విషాదం.. పవన్ అభిమాని హనుమకొండ నిరంజన్ మృతి..
ABN , Publish Date - Jul 08 , 2026 | 07:52 AM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని హనుమకొండ హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ మృతి చెందాడు. నిరంజన్ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్ ప్రాణాలు కోల్పోయాడు.
వరంగల్, జులై 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని హనుమకొండ హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ మృతి చెందాడు. నిరంజన్ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, అతడి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. తల్లిదండ్రులు చికిత్స కోసం బాలుడిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్ ప్రాణాలు కోల్పోయాడు.
ఆఖరి కోరిక తీర్చిన పవన్ ..
నిరంజన్ చిన్నప్పటినుంచి పవన్‌కు వీరాభిమాని. ఏడేళ్ల వరకు బాగానే ఉన్న నిరంజన్ ఆరోగ్యం.. డ్యూచెస్ మస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) అనే జన్యు సంబంధమైన వ్యాధి వల్ల క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఎదుగుదల కూడా ఆగిపోయింది. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ పవన్‌ను కలవాలని ఉందని తల్లిదండ్రులకు చెప్పాడు. నిరంజన్ ఆకాంక్షను వీడియోల ద్వారా తెలుసుకున్న జనసేనాని ఆ కోరికను నెరవేర్చారు. గత నెల 18వ తేదీన హనుమకొండ వెళ్లారు. మంచంపై కదలలేని స్థితిలో ఉన్న నిరంజన్‌ను చూసి చలించిపోయారు.
ఆ మంచంపైనే కూర్చుని నిరంజన్ చేతిని ఆప్యాయంగా ముద్దాడిన పవన్ కల్యాణ్.. ‘ఎలా ఉన్నావు?’ అంటూ ఆత్మీయంగా పలకరించారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది? అధైర్యపడకు.. మరింత మంచి చికిత్స అందిస్తే తప్పకుండా కోలుకుంటావు.. లేచి తిరుగుతావు’ అని ధైర్యం చెప్పి ఉత్సాహపరిచారు. అక్కడినుంచి వెళ్లే ముందు జనసేన డైరీలో ‘ప్రియమైన నిరంజన్.. ప్రేమతో.. ఆ దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ..’ అని పవన్ తన స్వదస్తూరితో సందేశం రాసి ఇచ్చారు. పవన్ తన వీరాభిమాని నిరంజన్‌ను కలిసి నెల రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి
ప్రపంచ కప్ అర్జెంటీనాకే ఇవ్వాలని ఫిక్స్ చేశారు: ఈజిప్టు ప్లేయర్
విషాదం.. పవన్ అభిమాని హనుమకొండ నిరంజన్ మృతి..