నకిలీ పత్రంతో కారుణ్య నియామకం పొందాడు!
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:27 AM
ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న తండ్రి మరణిస్తే కుమారుడికి కారుణ్య నియామకం కింద కొలువు వస్తుంది.
ఉద్యోగ విరమణ తర్వాత తండ్రి మరణం
విధుల్లో ఉండగానే చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించిన కొడుకు
సహకరించిన ఉద్యోగులు..
నల్లగొండ జిల్లాలో ఘటన
25న ఉద్యోగం.. 14మంది అరెస్టు..
నల్లగొండ క్రైం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న తండ్రి మరణిస్తే కుమారుడికి కారుణ్య నియామకం కింద కొలువు వస్తుంది. ఆ తండ్రి ఉద్యోగ విరమణ అనంతరం చనిపోతే.. ఉద్యోగంలో ఉన్నప్పుడు చనిపోయాడని నకిలీ పత్రాలు సృష్టించి ఉద్యోగం పొందితే? నేరస్తుడే అవుతాడు కదా. ఈ లాజిక్ మరిచి పథకం అమలు చేసి దొరికిపోయాడో వ్యక్తి. నిందితుడు నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం ఓగోడుకు చెందిన చామకూరి రాజు! అతడికి మరో 13 మంది సహకరించారు. వీరిలో డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బందీ ఉన్నారు. నల్లగొండ ఎస్పీ శరశ్చంద్ర పవార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజు తండ్రి వెంకటేశ్వర్లు శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన గత ఏడాది మే నెల 31న ఉద్యోగ విరమణ చేశారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ నవంబరు 26న మృతిచెందారు. తండ్రి వెంకటేశ్వర్లు సర్వీసులో ఉన్నప్పుడే మృతిచెందినట్టు రికార్డులు సృష్టిస్తే తనకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆయన కుమారుడు రాజు భావించాడు. డీఎంహెచ్‌వో కార్యాలయ సీసీ పోలే రంజిత్‌కుమార్‌ను సంప్రదించి నకిలీ ధ్రువీకరణ పత్రం రూపొందించి కారుణ్య నియామకం పొందేలా మాట్లాడుకున్నారు. ఇందుకోసం రూ.13 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మునిసిపల్ కార్పొరేషన్‌లో వార్డు ఆఫీసర్ శివ జనార్దన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రదీ్‌పరెడ్డి, మీ సేవ ఏవో రాజశేఖర్, మీ సేవ కేంద్ర నిర్వాహకుడు చంద్రశేఖర్ కుమ్మక్కై రాజుకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.
చామల వెంకటేశ్వర్లు కుమారుడైన రాజుకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని శాలిగౌరారం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ కృష్ణసూర్యశిల్ప ఫైల్‌ను డీఎంహెచ్‌వో కార్యాలయానికి పంపారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గింకల రాకేశ్, జూనియర్ అసిస్టెంట్ తుంగతుర్తి మోహనకృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహబూబ్ అలీ, ఆఫీస్ సూపరింటెండెంట్ జితేందర్‌రెడ్డి, సీసీ పోలే రంజిత్‌కుమార్, శాలిగౌరారం పీహెచ్‌సీ సీనియర్ అసిస్టెంట్ జగనాథ్‌రెడ్డి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై ఓ నివేదికను రూపొందించి, డీఎంహెచ్‌వోకు అందజేశారు. దీంతో రాజుకు దామరచర్ల పీహెచ్‌సీలో కారుణ్య నియామకం కింద ఈ ఏడాది అక్టోబరు 25న ఉద్యోగం కల్పించారు. అయితే భర్త వెంకటేశ్వర్లు పేరిట తీసుకున్న ధ్రువీకరణ పత్రం రద్దుచేయాలని భార్య వసంత నల్లగొండ పురపాలక కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. తనను కొంతమంది తప్పుదోవ పట్టించి.. నకిలీ డెత్ సర్టిఫికెట్ తీసుకునేలా చేశారని పేర్కొంది. ఘటనపై పురపాలక కమిషనర్ వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టారు. విధుల్లో ఉండగానే మృతిచెందినట్లు ధ్రువీకరణ పత్రం రూపొందించి ఉద్యోగం పొందారని విచారణలో తేలటంతో రాజు సహా 14మందిని పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు.