కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలులో 13 నెలల చిన్నారి మృతి
ABN , Publish Date - Aug 21 , 2026 | 09:21 PM
కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలులో విషాదం చోటుచేసుకుంది. రైలులో తల్లిదండ్రులతో పాటు ప్రయాణిస్తున్న 13 నెలల చిన్నారి అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది.
ఇంటర్‌నెట్ డెస్క్: కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలులో విషాదం చోటుచేసుకుంది. రైలులో తల్లిదండ్రులతో పాటు ప్రయాణిస్తున్న 13 నెలల చిన్నారి అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఓ భార్యాభర్తల జంట సొంతూరు వెళ్లేందుకు బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో తమ 13 నెలల బిడ్డతో కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. ఆ జంట రిజర్వేషన్ చేయించుకున్న సీటులో కూర్చుంది. వారి ప్రయాణం మొదలైన కొన్ని నిమిషాల్లోనే విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ చేరుకునేలోగా చిన్నారిలో కదలికలు నిలిచిపోయాయి.
ఇది గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం అయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 10వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై దిగారు. రైల్వే స్టేషన్ ఆరోగ్య కేంద్రంలో చిన్నారికి చికిత్స అందించారు. అక్కడినుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి మృతికి గల కారణాలను పోస్టుమార్టం నివేదిక తర్వాత వెల్లడిస్తామని రైల్వే ఎస్‌ఐ మాధవ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం: మంత్రి సీతక్క
బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: టోర్నీ నుంచి సాత్విక్-చిరాగ్ ఔట్