టెక్ సంస్థలది ఈస్ట్ ఇండియా కంపెనీ రేంజ్! శ్రీధర్ వెంబు పోస్టు వైరల్
ABN , Publish Date - Feb 15 , 2026 | 01:34 PM
అంతర్జాతీయ బిగ్ టెక్ సంస్థల ఆర్థికశక్తి అసామాన్యమైనదని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు వ్యాఖ్యానించారు. వాటి రేంజ్ అర్థం కావాలంటే ఒకప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీని గుర్తు చేసుకోవాలని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ టెక్ సంస్థల (Big Tech Companies) ఆర్థిక శక్తిసామర్థ్యాలు సామాన్యం కాదని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు (Sridhar Vembu) తాజాగా కామెంట్ చేశారు. వాటి స్థాయిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒకప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీని (East India Company) గుర్తు చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వాలకు ఉన్నంత ఆర్థిక, కార్యనిర్వాహణ సామర్థ్యాలు బిగ్ టెక్ సంస్థల సొంతమని వ్యాఖ్యానించారు.
‘చాలా దేశాల కంటే ఈ టెక్ సంస్థలే పెద్దవి. ఒకప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీని గుర్తు చేసుకుంటే ఇది అర్థమవుతుంది’ అని పోస్టు పెట్టారు. ఇటీవల గూగుల్ ఒక్క రోజులో కళ్లు చెదిరే స్థాయిలో నిధులను సమీకరించిన వైనాన్ని చెబుతూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు శ్రీధర్ వెంబు ఈ మేరకు స్పందించారు.
గూగుల్ నిధుల సమీకరణకు ఆశ్చర్యపోతూ అవిరళ్ భట్నానగర్ తొలుత ఓ పోస్టును షేర్ చేశారు. గూగుల్ ఇటీవల ఒక్క రోజులోనే 32 బిలియన్ డాలర్ల రుణాన్ని (సుమారు రూ.2.8 లక్షల కోట్లు) సమీకరించగలిగిందని అన్నారు. ఈ స్థాయి నిధులను సమీకరించేందుకు భారత్ లాంటి దేశాలకు 100 రోజులు పడుతుందని చెప్పారు. భారత ప్రభుత్వం జారీ చేసే బాండ్స్ గరిష్ఠ కాలపరిమితి 40 ఏళ్లు కాగా గూగుల్ ఏకంగా 100 ఏళ్ల కాలపరిమితి గల బాండ్‌ను జారీ చేసి నిధులను సమీకరించిందని అన్నారు. ప్రభుత్వాల స్థాయిలో భారీ టెక్ సంస్థలు నిధుల సమీకరణను చేయగలుగుతున్నాయని చెప్పారు. ఈ పోస్టుపై శ్రీధర్ వెంబు స్పందిస్తూ ఒకప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీని గుర్తు చేశారు.
కాగా, అమెరికా టెక్ సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు జనవరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఉత్పత్తులైన జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌కు బదులు దేశీయ ఉత్పత్తి అయిన విసియోకు మళ్లుతున్నట్టు తెలిపారు. అప్పట్లో ఈ పరిణామంపై కూడా శ్రీధర్ వెంబు కామెంట్ చేశారు. కొన్ని సంస్థల చేతుల్లో డిజిటల్ పవర్ కేంద్రీకృతం అవడాన్ని ఐరోపా దేశాలు గుర్తించడం కాస్త ఆశ్చర్యకరమేనని అన్నారు. బ్రిటన్‌లో వాణిజ్య సంస్థగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమైన విషయం తెలిసిందే. తదనంతర కాలంలో ఆ సంస్థ ఆసియాలో బలమైన ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదిగింది.
ఈ వార్తలూ చదవండి:
మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ ఖతం: మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్
భారత్‌పైనే ఆశలన్నీ.. ఏఐ సమ్మిట్‌కు క్యూకడుతున్న టెక్ సంస్థలు