చైనా ఏఐతో బ్యాంకుల హ్యాకింగ్.. దక్షిణ కొరియాలో కలకలం
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:39 AM
ఏఐ టూల్ సాయంతో కొందరు హ్యాకర్లు దక్షిణకొరియా బ్యాంకులు, ఇతన ఆర్థిక సంస్థలను టార్గెట్ చేయడం కలకలానికి దారితీసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ టూల్ సాయంతో కొందరు హ్యాకర్లు దక్షిణకొరియా బ్యాంకులు, ఇతన ఆర్థిక సంస్థలను టార్గెట్ చేయడం కలకలానికి దారితీసింది. దాదాపు 68 వేల మంది కస్టమర్ల డేటా లీకైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గతవారం సైబర్ దాడిని గుర్తించామని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. తమ దేశంలో 7 ముఖ్యమైన ఆర్థిక సంస్థలపై హ్యాకర్లు దాడి చేసినట్టు తెలిపారు.
ఈ ఉదంతంపై విచారణ ప్రారంభించామని దక్షిణ కొరియా జాతీయ పోలీసు దర్యాప్తు సంస్థ మంగళవారం తెలిపింది. చైనాలో తయారైన Artex AI అనే టూల్‌తో ఈ దాడి జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అయితే, హ్యాకర్ల పేర్లు, వారు ఏ దేశానికి చెందిన వారు అనే వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఈ విషయమై అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐతో సైబర్ దాడులు ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని అన్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలతో సమావేశం నిర్వహించారు. సైబర్ భద్రత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాజా దాడి చేసిన సైబర్ నేరగాళ్లకు చెందిన 28 ఐపీ అడ్రస్‌లను, వారు ఎక్కడి నుంచి దాడులు చేశారు అనే సమాచారాన్ని కూడా షేర్ చేశారు. ఏఐతో హ్యాకింగ్ ఉదంతం నేపథ్యంలో దక్షిణకొరియాలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. డిజిటలీకరణ పతాకస్థాయిలో ఉన్న దేశంలో సైబర్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంపై అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
పాన్ కార్డ్ పోయిందా..? తిరిగి పొందండిలా..!
ఏఐ మ్యూజిక్ యాప్ సునో నుంచి కొత్త టూల్.. మాటకు మ్యూజిక్ టచ్