Share News

వన్‌ప్లస్ మూసివేత రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ సీఈఓ

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:46 PM

మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ మూసివేత రూమర్స్‌పై కంపెనీ సీఈఓ రాబిన్ లియు స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో బుధవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు.

వన్‌ప్లస్ మూసివేత రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ సీఈఓ
OnePlus India

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ మూతపడుతోందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కంపెనీ మార్కెట్ విలువ అంతకంతకూ క్షీణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. మూసివేత రూమర్స్‌పై కంపెనీ సీఈఓ రాబిన్ లియు స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో బుధవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. అసత్య ప్రచారాలు నమ్మవద్దని, భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.


అతి పెద్ద మార్కెట్లు ఇవే..

భారత్, చైనా దేశాల్లో వన్‌ప్లస్‌కు భారీ మార్కెట్ ఉంది. ఈ రెండు దేశాల్లో మాత్రమే ఏకంగా 75 శాతం సేల్స్ జరుగుతున్నాయి. భారత్‌లో 2023 సంవత్సరంలో 17 మిలియన్ యూనిట్లుగా ఉన్న సేల్స్ 2024 సంవత్సరం నాటికి 13 నుంచి 14 మిలియన్ యూనిట్లకు పడిపోయాయి. కంపెనీ మార్కెట్ వాటా కూడా 6.1 శాతం నుంచి 3.9 శాతానికి పతనమైంది. చైనా దేశంలో 2 శాతంగా ఉన్న మార్కెట్ వాటా 1.6 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ‘ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్’ ఓ కథనం ప్రచురించింది. ఆ కథనంలో..


‘గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో వన్‌ప్లస్ తన మార్కెట్ వాటాను కోల్పోతూ ఉంది. ఈ కంపెనీని దశల వారీగా మూసివేస్తారు. ఒప్పోలో పూర్తిగా విలీనం చేయబోతున్నారు. ఓపెన్‌కు కొనసాగింపుగా రావాల్సిన వన్‌ప్లస్ ఓపెన్ 2 లాంచింగ్ నిలిచిపోయింది. వన్‌ప్లస్ 15ఎస్ విడుదల ప్లాన్‌ను రద్దు చేశారు’ అని రాసుకొచ్చింది. దీంతో టెక్ లవర్స్‌లో ఆందోళన మొదలైంది. హెచ్‌టీసీ, ఎల్‌జీ, బ్లాక్‌బెర్రీ తరహాలో వన్‌ప్లస్ కూడా కనుమరుగు కాబోతోందని బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కంపెనీ సీఈఓ ఇచ్చిన క్లారిటీతో టెక్ లవర్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడాచ చదవండి

ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా

విశ్వాసానికి నిలువెత్తు రూపం.. యజమాని చనిపోయినా..

Updated Date - Jan 21 , 2026 | 04:29 PM