ఎన్విడియాకు రాన్సమ్వేర్ వార్నింగ్! 10 రోజుల డెడ్‌లైన్
ABN , Publish Date - Nov 18 , 2026 | 09:27 PM
ప్రముఖ కంప్యూటర్ చిప్ మేకర్ ఎన్విడియా రాన్సమ్వేర్ ముప్పు ఎందుర్కొంటున్నట్టు అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ కంప్యూటర్ చిప్ మేకర్ ఎన్విడియా ర్యాన్సమ్వేర్ ముప్పు ఎందుర్కొంటున్నట్టు అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి. సంస్థకు చెందిన కీలక సమాచారాన్ని చేజిక్కించుకున్నట్టు ది జెంటిల్మెన్ అనే సైబర్‌క్రైమ్ గ్రూప్ తాజాగా వెల్లడించింది. ఎన్విడియా 10 రోజుల్లోపు స్పందించకపోతే ఆ సమాచారాన్ని డార్క్‌వెబ్‌లో పెడతామని హెచ్చరించింది. డెడ్‌లైన్ గడువును గుర్తు చేస్తూ ఓ డార్క్‌వెబ్‌సైట్‌లో టైమర్ కూడా పెట్టింది. అయితే, తమ వద్ద ఎలాంటి సమాచారం ఉందనేది మాత్రం నేరగాళ్లు వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి ఎలాంటి శాంపిల్ డేటాను కూడా వెబ్సైట్లో పెట్టలేదు. ఏ మార్గంలో ఎన్విడియా డేటాను చేజిక్కించుకున్నదీ కూడా వెల్లడించలేదు. తమతో సంప్రదింపులు జరిపేందుకు ఎన్క్రిప్టెడ్ టాక్స్ ఐడీని మాత్రం డార్క్‌వెబ్‌లో షేర్ చేశారు.
సైబర్‌న్యూస్ అనే సంస్థ తొలిసారిగా ఈ కథనాన్ని ప్రచురించింది. ఇక డేటా లీకయ్యిందా? లేదా? అనే అంశంపై ఎన్విడియా సంస్థ కూడా ఇప్పటివరకూ స్పందించలేదు. ది జెంటిల్మెన్ గ్రూప్ గతంలో పలు సంస్థలకు ఇలాంటి హెచ్చరికలు చేసింది. అయితే, పాత డేటా ఆధారంగా ఇలాంటి కొన్ని హెచ్చరికలు చేసినట్టు వెలుగులోకి రావడంతో చివరకు భంగపడింది. 2025 జులైలో తొలిసారిగా ది జెంటిల్మెన్ సంస్థ పేరు తెరపైకి వచ్చింది. హ్యాకింగ్‌కు కావాల్సిన సాధనాలను సైబర్హ్యాకర్లకు ఇస్తుంటుంది. వీటితో నేరగాళ్లు హ్యాకింగ్ చేసి వసూలు చేసిన సొమ్ములో కొంత భాగాన్ని తీసుకుంటుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలనూ చదవండి:
49 ఏళ్లుగా అంతరిక్ష యాత్ర! భూమికి ఒక కాంతి-దినం దూరంలో..
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక గూగుల్ డ్రైవ్ లేకుండానే డైరెక్ట్ బ్యాకప్