నూతన ఏఐ మోడల్స్‌ను ఆవిష్కరించిన మెటా!
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:12 AM
ఏఐ రంగంలో ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ సంస్థలతో పోలిస్తే కాస్త వెనకబడ్డట్టు కనిపించిన మెటా మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ రంగంలో ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ సంస్థలతో పోలిస్తే కాస్త వెనకబడ్డట్టు కనిపించిన మెటా మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. మ్యూజ్ వండర్, వండర్‌ఫుల్ అనే కొత్త ఏఐ మోడల్స్‌ను ఆవిష్కరించింది. పోటీ సంస్థల టాప్ ఏఐ మోడల్స్‌తో సరిసమానంగా తమ మోడల్స్ పనిచేస్తున్నాయని మార్క్ జుకర్‌బర్గ్ ఈ సందర్భంగా చెప్పారు. ఏఐ పరిశోధనల్లో తామూ టాప్‌లోకి వచ్చేశామని అన్నారు. ‘మొదట్లో మేము మ్యూజ్ స్పార్క్ లాంచ్ చేశాము. ఇప్పుడు మరింత సమర్థవంతమైన, అత్యాధునిక మోడల్స్‌ను తీసుకొచ్చాము. ఏఐ పరిశోధనల్లో ముందువరుసలోకి వచ్చేశాము’ అని అన్నారు.
మునుపటి మోడల్స్‌తో పోలిస్తే మ్యూజ్ వండర్ పనితీరు మరింత మెరుగ్గా, సంక్లిష్టంగా ఉంటుందని జుకర్‌బర్గ్ చెప్పారు. ప్రస్తుతం ఏఐ టాప్ మోడల్స్ తీరు ఇలాగే ఉందని వివరించారు. ఆంథ్రోపిక్ (ఓపర్ 5.5), ఓపెన్ ఏఐ (జీపీటీ 6 ఆస్ట్రా) టాప్ మోడల్స్‌తో తమ ఏఐ పోటీపడుతోందని చెప్పారు. ఈ స్థాయికి చేరుకునేందుకు ఎంతో పెట్టుబడి, శ్రమ అవసరమైందని కూడా ఉన్నారు. తమ ఏఐ టీమ్ ఎంతో శ్రమించి తాజా మోడల్స్‌ను తీర్చిదిద్దిందని అన్నారు.
ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ సంస్థలు టాప్‌లో నిలిచిన ఏఐ రంగంపై పట్టుకోసం గత కొంతకాలంగా మెటా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. స్కేల్ ఏఐ అనే మరో ఏఐ సంస్థను 14 బిలియన్ డాలర్ల పెట్టుబడితో సొంతం చేసుకుంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు అలెగ్జాండర్ వాంగ్‌ను తమ ఏఐ విభాగానికి అధిపతిగా నియమించుకుంది. మ్యూజ్ వండర్ గురించి వాంగ్ మాట్లాడుతూ తమ ప్రయాణంలో ఈ మోడల్స్ ఆవిష్కరణ ఓ ముఖ్యఘట్టమని వ్యాఖ్యానించారు. పోటీ సంస్థల టాప్ మోడల్స్‌తో పోటీ పడే స్థితికి తాము చేరుకున్నామని అన్నారు. వ్యక్తిగత, ప్రొఫెషనల్ ఏజెంటిక్ పనుల్లో తమ మోడల్స్ మంచి సామర్థ్యాలు కనబరుస్తున్నాయని చెప్పారు.
ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపుతో మెటా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. మే నెలలో 10 శాతం మంది సిబ్బందిని (దాదాపు 8 వేలు) తొలగించింది. మెటా చర్యలతో చిన్నారులకు సోషల్ మీడియా ఓ వ్యసనంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి కేసును సెటిల్ చేసుకునేందుకు అమెరికా ప్రభుత్వానికి మెటా 18 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఔషధాల్లాగా ఏఐనీ నియంత్రించాలి: బిల్ గేట్స్
చాట్‌జీపీటీతో తప్పుడు ప్రచారం.. రష్యా, ఇరాన్ అకౌంట్స్‌పై ఓపెన్ ఏఐ నిషేధం