Share News

ఇన్‌స్టాగ్రామ్‌లో మేసేజీ ఎన్‌క్రిప్షన్‌కు త్వరలో ముగింపు!

ABN , Publish Date - Mar 13 , 2026 | 07:26 PM

ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లలో ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను మే 8 నుంచి నిలిపివేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ ఫీచర్ తొలగింపుతో ప్రభావితమయ్యే చాట్స్‌ను యూజర్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో మేసేజీ ఎన్‌క్రిప్షన్‌కు త్వరలో ముగింపు!
Instagram end to end encryption

ఇంటర్నెట్ డెస్క్: మెసేజ్‌లకు ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వసతిని ముగిస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ తాజాగా పేర్కొంది. మే 8 నుంచి ఈ ఫీచర్ అందుబాటులో ఉండదంటూ తన బ్లాగ్‌లో ఇటీవల రాసుకొచ్చింది. యూజర్ల ప్రైవెసీని మరింత కట్టుదిట్టం చేసేందుకు సంస్థ 2023 డిసెంబర్‌లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

ఈ ఫీచర్ తొలగింపుతో ప్రభావితమయ్యే యూజర్లు తమ మునుపటి డేటాను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనే విషయాన్ని ఇన్‌‌స్టా వెల్లడించింది. ప్రభావిత చాట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ యూజర్లకు ఉంటుందని పేర్కొంది. యాప్ పాత వర్షన్‌ను వాడుతున్న వారు అప్‌డేట్ చేసుకుంటే డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుందని వెల్లడించింది. అయితే, ఎన్‌క్రిప్షన్ ఫీచర్ తొలగింపునకు కారణమేంటనేది మాత్రం సంస్థ వెల్లడించలేదు. ఇక ఫేస్‌బుక్ మెసెంజర్‌లో కూడా ఎన్‌క్రిప్షన్‌ను తొలగిస్తారా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతున్నారు.


ఇంటర్నెట్ ద్వారా అసభ్యకర కంటెంట్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్‌క్రిప్షన్ తొలగిస్తే కంపెనీకి అసభ్య కంటెంట్‌‌పై ఓ కన్నేసి ఉంచే అవకాశం చిక్కుతుంది. వ్యక్తిగత మెసేజీల్లో ఇలాంటి అసభ్య అంశాలు ఉంటే గుర్తించి వెంటనే తొలగించాలని యూఎస్ఏ, యూకే సహా అనేక దేశాలు పట్టుబడుతున్నాయి. ఈయూ చాట్ కంట్రోల్ రెగ్యులేషన్, యూకే ఆన్‌లైన్ సెఫ్టీ యాక్ట్ వంటి బిల్లులు చట్టరూపం దాలిస్తే టెక్ సంస్థలు తమ యూజర్ల ప్రైవేటు సంభాషణలపై కూడా దృష్టిపెట్టేలా ఆదేశాలు జారీ చేసే అధికారాలు ప్రభుత్వాలకు దక్కుతాయి.


ఈ వార్తలూ చదవండి:

వన్‌ప్లస్ నుంచి త్వరలో మరో ఫోన్! ఫీచర్స్ ఇవే

బడ్జెట్ ఐఫోన్‌ను రిలీజ్ చేసిన యాపిల్

Updated Date - Mar 13 , 2026 | 07:38 PM