Share News

భవిష్యత్తులో డబ్బుకు విలువ.. మనుషులకు పని ఉండదు: మస్క్

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:57 PM

భవిష్యత్తులో డబ్బుకు విలువ, మనిషికి పని ఉండవని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ అన్నారు. ఏఐ, రోబోల రాకతో కొరత అనేదే లేకుండా పోతుందని చెప్పారు.

భవిష్యత్తులో డబ్బుకు విలువ.. మనుషులకు పని ఉండదు: మస్క్
Elon Musk

ఇంటర్నెట్ డెస్క్: సంపద సృష్టిలో తనకు తిరుగేలేదని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ఎప్పుడో రుజువు చేశారు. ప్రపంచంలో తొలి ట్రిలియన్‌నీర్‌గా అతి త్వరలో రికార్డు సృష్టించనున్నారు. స్పేస్‌ఎక్స్ ఐపీఓ తరువాత మస్క్ నికర సంపద 1.1 ట్రిలియన్లు దాటిపోతుందని ఒక అంచనా. ఈ నేపథ్యంలో మస్క్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో డబ్బుకు విలువే ఉండదని అబండెన్స్ సమ్మిట్-2026 సమావేశాల సందర్భంగా తెలిపారు. మానవ సమాజాన్ని ఏఐ ఎంతలా మార్చేయనున్నదీ కళ్లకు కట్టినట్టు వివరించారు.

కృత్రిమ మేధ, రోబోల వినియోగం పెరిగేకొద్దీ మనుషుల జీవన విధానం గుర్తుపట్టలేనంతగా మారిపోతుందని చెప్పారు. పని, ఆదాయం, డబ్బుపై ప్రస్తుతమున్న భావనలు సమూలంగా మారిపోతాయని అన్నారు. ‘మనందరికీ సార్వత్రిక ఆదాయం ఉంటుంది. కావాల్సిన వారికి ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చేసే రోజు ఒకటి వస్తుంది. ఏఐ, రోబోట్లతో అన్ని రకాల సేవలు, వస్తువులను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసుకుంటాము. కొరత అనేది ఉండదు. చివరకు మనుషులకు పనే లేకుండా పోతుంది. అప్పటికి డబ్బుకు విలువ కూడా ఉండదు’ అని అన్నారు. అంటే మీరు తొలి ట్రిలియనీర్‌గా మారుతున్న తరుణంలోనే డబ్బుకు విలువ తగ్గిపోయే దశ కూడా మొదలవుతోందని అంటారా? అని వ్యాఖ్యాత ప్రశ్నించారు. దీని మస్క్ అవునని సమాధానం ఇచ్చారు.


ప్రతి మనిషికీ కనీస ఆదాయం ఉండాలన్న నేటి చర్చ నుంచి ప్రతి ఒక్కరికీ గొప్ప సంపద సొంతం కావాలనే చర్చ మొదలవుతుందని చెప్పారు. డబ్బు స్థానాన్ని ఏది భర్తీ చేస్తుందన్న ప్రశ్నకు కూడా మస్క్ సమాధానం ఇచ్చారు. భవిష్యత్తులో విద్యుత్, కంప్యూటింగ్ సామర్థ్యం, ఫ్యాక్టరీలు, ముడి సరుకులు డబ్బు కంటే విలువైనవిగా మారుతాయని అన్నారు. ఈ పరిమితుల ఆధారంగా ఏఐ నిర్ణయాలు తీసుకుంటుందని కూడా చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

ఢిల్లీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం.. గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం..

యాపిల్ ఐఓఎస్ 27లో అదిరిపోయే ఫీచర్లు.. ఏయే ఫోన్లకు అందుబాటులోకి వస్తుందంటే..

Updated Date - Jun 12 , 2026 | 01:22 PM