Share News

CERT-In Alert: విండోస్ 10 లేదా విండోస్ 11 వాడే వారికి అలర్ట్!

ABN , Publish Date - Jan 15 , 2026 | 09:05 PM

విండోస్ 10/11 యూజర్లకు సీఈఆర్‌టీ-ఐఎన్ తాజాగా కీలక హెచ్చరిక చేసింది. తక్షణం తమ ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. డీడబ్ల్యూఎమ్‌ మెమరీ నిర్వహణ లోపం కారణంగా సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

CERT-In Alert: విండోస్ 10 లేదా విండోస్ 11 వాడే వారికి అలర్ట్!
CERT-In Alert for Windows OS Users

ఇంటర్నెట్ డెస్క్: విండోస్ 11 లేదా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడే భారతీయులకు ఇండియన్ ఎమర్జెన్సీ కంప్యూటర్ రెస్పాన్స్ టీమ్ తాజాగా (సీఈఆర్‌టీ-ఐఎన్) కీలక అలర్ట్ జారీ చేసింది. ఆపరేటింగ్ సిస్టమ్‌లోని ఓ సాంకేతిక అంశం కారణంగా యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. వ్యక్తులతో పాటు సంస్థలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది (CERT-In Alert for Window 10-11 users).

డెస్క్‌టాప్ విండో మేనేజర్‌లో ఈ సాంకేతిక బలహీనత ఉన్నట్టు సీఈఆర్‌టీ-ఐఎన్ తెలిపింది. ఇందులోని కొన్ని మెమరీ ఆబ్జెక్టుల నిర్వహణ సరిగా లేకపోవడంతో భద్రతా పరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. డెస్క్‌టాప్‌ లుక్‌తో పాటు యానిమేషన్స్‌, ఇతర విజువల్ ఎఫెక్ట్స్‌ను డెస్క్‌టాప్ విండో మేనేజర్ నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ సమస్య కారణంగా కంప్యూటర్ మెమరీలోని సున్నితమైన సమాచారం హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉందని పేర్కొంది. డెస్క్‌టాప్‌ హ్యాకర్ల చేతుల్లోకి పూర్తిగా వెళ్లకపోయినా భారీ సైబర్ దాడులకు హ్యాకర్లు ఈ లోపాన్ని ఆసరాగా చేసుకునే అవకాశం ఉందని తెలిపింది.


ప్రస్తుతం వినియోగంలో ఉన్న పలు విండోస్ వర్షన్‌లకు ఈ హెచ్చరిక వర్తిస్తుందని తెలిపింది. విండోస్ 10కు చెందిన 1607, 1809, 21H2, 22H2, వర్షన్‌లతో పాటు విండోస్ 11కు చెందిన 23H2, 24H2, 25H2 వర్షన్‌లలో ఈ నిర్వహణ లోపాన్ని గుర్తించినట్టు పేర్కొంది. ఈ లోపం తీవ్రతను మధ్యస్థాయిగా సీఈఆర్‌టీ-ఐఎన్ వర్గీకరించింది.

ఈ సమస్యను పరిష్కరించేందుకు వెంటనే సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సీఈఆర్‌టీ-ఐఎన్ సూచించింది. ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను రిలీజ్ చేసిందని కూడా తెలిపింది.


ఇవీ చదవండి:

30 వాట్స్ లేదా 60 వాట్స్ చార్జర్.. బ్యాటరీ మన్నికకు ఏది బెటర్?

వైద్య కళాశాలల అవసరం భవిష్యత్తులో ఉండదు.. ఎలాన్ మస్క్ వ్యాఖ్య

Updated Date - Jan 15 , 2026 | 09:12 PM