Share News

ఏఐకు శిక్షణ.. గంటకు రూ.250.. భారతీయులకు కొత్త ఉపాధి

ABN , Publish Date - Jun 14 , 2026 | 10:12 AM

రోబోలకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన డేటా సేకరణ కార్యక్రమాలతో వేల మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు. దుస్తులు మడతపెట్టడం, కాఫీ తయారు చేయడం వంటి పనులను కెమెరాతో రికార్డు చేసి షేర్ చేసేందుకు గంటకు రూ.250ల చొప్పున సంపాదిస్తున్నారు.

ఏఐకు శిక్షణ.. గంటకు రూ.250.. భారతీయులకు కొత్త ఉపాధి
AI jobs in India

ఇంటర్నెట్ డెస్క్: ఏఐతో భారతీయులకు కొత్త ఉపాధి మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఏఐతో నడిచే రోబోలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలతో ప్రస్తుతం వేల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతానికి ఇది కొందరికి మంచి ఆదాయ మార్గంగా మారినప్పటికీ భవిష్యత్తులో మాత్రం ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

ఏమిటీ శిక్షణ కార్యక్రమాలు..

ప్రస్తుతం ఏఐ ఆధారిత చాట్‌బాట్స్ శిక్షణ కోసం ఆన్‌లైన్‌లో అపరిమితమైన సమాచారం అందుబాటులో ఉంది. ఈ డిజిటల్ కంటెంట్‌తో కంపెనీలు ఏఐ చాట్‌బాట్స్‌కు మెరుగులు దిద్దుతున్నాయి. అయితే, మనుషులు చేసే పనులన్నీ చేసేందుకు అనువుగా హ్యుమనాయిడ్ రోబోలను డిజైన్ చేసేందుకు భిన్నమైన డేటా అవసరం. మనుషులు తమ రోజువారి పనులు చేసేటప్పుడు చేతులు, వేళ్లు ఎలా కదుపుతున్నారు? వస్తువులను తమకు అనువుగా వివిధ రకాలుగా ఎలా పట్టుకుంటున్నారు? వంటి కీలక విషయాల్లో రోబోలకు శిక్ష ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అవి దైనందిన పనుల్లో మనుషులకు సాయంగా ఉండగలవు. అయితే, ఇలాంటి శిక్షణకు అనువుగా ఉండే డేటా, వీడియోలు సేకరించడం రోబో తయారీ కంపెనీలకు సవాలుగా మారింది.


ఈ సమస్యకు పరిష్కారంగా కొన్ని కంపెనీలు రంగంలోకి దిగాయి. మనుషులకు కెమరాలు ఇచ్చి తాము రోజువారి చేసే పనులను రికార్డు చేయిస్తున్నాయి. దుస్తులు మడతబెట్టం, కాఫీ, శాండ్‌విచ్‌లు తయారు చేయడం వంటి పనులకు సంబంధించిన వీడియోలను సేకరించి రోబోతయారీ సంస్థలకు అందిస్తున్నాయి. ఈ రకమైన వీడియోలు రికార్డు చేసినందుకు భారత్‌లో కొన్ని కంపెనీలు ఒక్కొక్కరికీ గంటకు రూ.250ల చొప్పున ఇస్తున్నాయి. ఈ డేటా ఆధారంగా రోబో కంపెనీలు తమ ఉత్పత్తులకు శిక్ష ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.


ఏఐ శిక్షణ కోసం డేటా సేకరణకు భారత్ ప్రధాన కేంద్రంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. కార్మికుల సంఖ్య, టెక్ వినియోగం అధికంగా ఉండటంతో అనేక కంపెనీలు ఏఐ శిక్షణ డేటా కోసం భారత్ బాటపడుతున్నాయి. ఈ డేటాతో శిక్షణ ఇస్తే రోబోల సామర్థ్యాలు మెరుగుపడతాయి. అయితే, రోబోల వినియోగం పెరిగే కొద్దీ ఆటోమేషన్ విస్తరించి మనుషుల ఉపాధి అవకాశాలపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలపై ఏఐతో ఎలాంటి ప్రభావం పడుతుందో అధ్యయనం చేయాలని నీతీ అయోగ్ కూడా గతంలో పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. రానున్న రోజుల్లో భారీగా పెరగనున్న మొబైల్స్ ధరలు!

భవిష్యత్తులో డబ్బుకు విలువ.. మనుషులకు పని ఉండదు: మస్క్

Updated Date - Jun 14 , 2026 | 10:36 AM