Share News

ఏఐ భవితవ్యం.. అప్పటివరకూ జనాల జాబ్స్ సేఫ్!

ABN , Publish Date - Apr 25 , 2026 | 08:27 AM

ఏఐపై అనేక మందిలో పలు భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ పలు కీలక వివరాలను పంచుకున్నారు. ఆయన ఏం చెబుతున్నారంటే..

ఏఐ భవితవ్యం.. అప్పటివరకూ జనాల జాబ్స్ సేఫ్!
LLMs, AGI Impact

ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధతో ఉద్యోగాల కోత తప్పదన్న ఆందోళన జనాల్లో పెరుగుతూనే ఉంది. పలు కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే లేఆఫ్స్‌ను ప్రకటించాయి. భవిష్యత్తులో మరిన్ని తొలగింపులు పక్కా అన్న వార్తలూ వెలువడుతున్నాయి. అయితే, మనుషులతో సమానమైన సృజనాత్మకత, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ప్రస్తుత ఏఐకి లేవని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా తెలిపారు.

ప్రొఫెసర్ మిశ్రా చెబుతున్న దాని ప్రకారం, ప్రస్తుతమున్న చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ సాధనాలను లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎమ్) అని అంటారు. అంతకుముందే ఉన్న సమాచారం ఆధారంగా ఇవి కొత్త టెక్స్ట్‌ను రెడీ చేస్తాయి. ఈమెయిల్స్ రాయడం, డాక్యుమెంట్స్‌ను సంక్షిప్త రూపంలో వివరించడం, కంప్యూటర్ కోడ్ రాయడం, వంటివాటిని ఇవి అంతకుముందే ఉన్న సమాచారం ఆధారంగా చేస్తాయి. పాత డేటాలోని సరళి, ధోరణలను గుర్తించి అందుకు అనుగుణంగా యూజర్లు అప్పగించిన పనులను పూర్తి చేస్తాయి. ప్రస్తుత ఎల్ఎల్‌ఎమ్‌లు మనుషుల్లాగా ఆలోచించలేవని ప్రొఫెసర్ మిశ్రా వివరించారు. కొత్తగా అవి వేటినీ సృష్టించలేవని అన్నారు. వాటి వద్ద అప్పటికే ఉన్న డేటా ఆధారంగానే అవి పనిచేస్తాయని అన్నారు.


కాబట్టి, ఇవి మనుషులకు సహాయకారులుగా మాత్రమే పనిచేయగలవని చెప్పారు. మనుషుల బాధ్యతలను పూర్తిగా స్వీకరించే సత్తా వీటికి ఉండదని చెప్పారు. ఇవి కేవలం మనుషులు చేసే పనుల్ని కాస్త మెరుగుపరుస్తాయని వివరించారు. కాబట్టి, స్వతంత్ర నిర్ణయాలు, సృజనాత్మకత అవసరమైన వాస్తవిక ప్రపంచంలో ఎల్ఎల్‌ఎమ్‌లు కచ్చితంగా తడబడతాయని అన్నారు. వైద్యం, ఇంజనీరింగ్, జర్నలిజం వంటి రంగాల్లో అంతిమ నిర్ణయాలు తీసుకోవాల్సింది ఆయా రంగాల నిపుణులే అని స్పష్టం చేశారు.

అయితే, ఎల్ఎల్ఎమ్‌లకు భిన్నమైన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అందుబాటులోకి వస్తే మాత్రం ప్రపంచంలో కొత్త మార్పులు వస్తాయని ప్రొఫెసర్ మిశ్రా తెలిపారు. మనుషులతో సమానమైన లేదా అంతకు మించిన సామర్థ్యం ఏజీఐకి ఉంటుందని చెప్పారు. తర్కం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం, తనంతట తానే కొత్త విషయాలను నేర్చుకోవడం వంటి సామర్థ్యాలు ఈ సాంకేతికతకు ఉంటాయని ఆయన వివరించారు. ఫలితంగా ఇవి కొత్త ఐడియాలను సృష్టించగలవని అన్నారు. ఒక కొత్త బిజినెస్ మోడల్‌ను లేదా కొత్త ఉత్పత్తిని డిజైన్ చేసే సత్తా ఈ టెక్‌కు ఉంటుందని వివరించారు. ఈ టెక్నాలజీ ఉనికిలోకి వచ్చాక అసలైన పెనుమార్పులు జరుగుతాయని చెప్పారు. అయితే, ఏజీఐ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే ప్రశ్నకు ప్రస్తుతం కచ్చితమైన సమాధానం లేదని నిపుణులు చెబుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఏఐతో యువతకు తగ్గుతున్న ఉద్యోగ అవకాశాలు: రిషి సునాక్

శ్రీధర్ వెంబు టిప్స్.. ఏఐ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే..

Updated Date - Apr 25 , 2026 | 09:26 AM