ఏఐతో యువతకు తగ్గుతున్న ఉద్యోగ అవకాశాలు: రిషి సునాక్
ABN , Publish Date - Apr 23 , 2026 | 10:36 PM
ఏఐతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ కారణంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ అన్నారు. ప్రాథమిక స్థాయి యువ ఉద్యోగుల అవసరం లేకుండానే సంస్థలు ఏఐ సాయంతో ఉత్పాదకతను పెంచుకుంటున్నాయని అన్నారు. ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా చదువులు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు లభించడంలో ఇబ్బందులు ఎదురవుతుండటం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. ఏఐపై యువతలో నెలకొన్న భయాలు సబబేనని కూడా అభిప్రాయపడ్డారు.
తమ సంస్థల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగ నియామకాల్లో పెరుగుదల లేని విషయాన్ని పలువురు సీనియర్ అధికారులు తనతో అన్నట్టు కూడా రిషి సునాక్ తెలిపారు. న్యాయసేవలు, ఫైనాన్స్, క్రియేటివ్ రంగాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన చెప్పారు. సిబ్బంది సంఖ్య పెంచకుండానే ఉత్పాదకత పెంచుకునేలా ఏఐ సాయంతో కొత్త విధానాలను సంస్థలు అనుసరిస్తున్నాయని రిషి సునాక్ తెలిపారు.
ఈ ట్రెండ్‌ను తట్టుకునేందుకు ప్రభుత్వాలు తమ పన్ను విధానాల్లో దీర్ఘకాలిక మార్పులు చేయాలని రిషి సునాక్ సూచించారు. జాతీయ ఇన్సూరెన్స్‌కు కంపెనీల చెల్లింపుల స్థానంలో వాటి లాభాలపై పన్నులు విధించే విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వాలకు ఆయన సూచించారు. తద్వారా ఏఐతో పెరిగే కంపెనీల లాభదాయకత ప్రభుత్వాలకు ఒక ఆదాయ వనరుగా మారుతుందని కూడా చెప్పారు. ఉద్యోగులకు ఏఐ ప్రత్యామ్నాయంగా మారకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. ఉద్యోగితపై మునుపటి సాంకేతికత విప్లవాల ప్రభావంతో పోలిస్తే ఏఐతో మార్పులు భిన్నమైనవని ఆయన హెచ్చరించారు. కాబట్టి, గతంలో అనుసరించిన పరిష్కారాలకు బదులు కొత్త విధానాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అయితే, దీర్ఘకాలికంగా ఏఐతో సానుకూల ప్రభావం ఉంటుందని కూడా తాను నమ్ముతున్నట్టు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీధర్ వెంబు టిప్స్.. ఏఐ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే..
ఏఐపై వైట్‌కాలర్ ఉద్యోగుల తిరుగుబాటు!