శ్రీధర్ వెంబు టిప్స్.. ఏఐ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే..
ABN , Publish Date - Apr 19 , 2026 | 03:37 PM
ఏఐ ముప్పును తప్పించుకునేందుకు టెకీలకు జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు పలు కీలక సూచనలు చేశారు. ఇందుకు సంబంధించి ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐతో జాబ్స్ పోతాయన్న భయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగం ఉద్యోగుల్లో ఈ ఆందోళన మరింత ఎక్కువగా ఉంది. ఈ క్లిష్ట పరిస్థితులను తట్టుకునేందుకు ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోయే వారికి జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు పలు సూచనలు చేశారు. ఇందుకు సంబంధించి ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను పునాదిగా ఆయన అభివర్ణించారు. అయితే, కస్టమర్ల మెప్పు పొందాలంటే సంబంధిత రంగంపై గట్టి పట్టు, లోతైన అవగాహన ఉండాలని అన్నారు. విశ్వసనీయత, భద్రత, సపోర్టు వంటి వాటిని కస్టమర్లు ఆశిస్తారని తెలిపారు.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి అనేక ప్రక్రియలు ఏఐ రాకతో ఇప్పటికే ఆటోమేట్ అయిపోయాయని ఆయన చెప్పారు. ప్రొటోటైపింగ్ వంటి వాటిని ఏఐ చక్కబెడుతోందని చెప్పారు. ఒకప్పటి కంటే వేగంగా నిపుణులకు వర్కింగ్ మోడల్స్‌పై దృష్టిపెట్టే అవకాశం చిక్కిందని అన్నారు. అయితే, వినియోగయోగ్యమైన ప్రాడక్ట్ అభివృద్ధి చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని అన్నారు. విశ్వసనీయత, భద్రత, దీర్ఘకాలిక సపోర్టు వంటి అందించేందుకు ఎల్లప్పుడూ మనుషుల అవసరం ఉంటుందని అన్నారు. వీటిని ఏఐ ఆధారిత వర్క్ ఫ్లోలుగా మార్చడం అంత సులభం కాదని అన్నారు.
ఉత్పాదకత కొలమానాల గురించి టెకీలు అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీధర్ వెంబు సూచించారు. వేగంపైనే దృష్టిపెడితే విస్తృత లక్ష్యాలు తెరవెనకకు వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. ఏఐతో కస్టమర్లకు మరింత మెరుగైన సౌకర్యం కల్పించాలన్న దానిపైనే దృష్టిపెట్టాలన్నారు. మెషిన్లతో కలిసి ఎలా పనిచేయాలో కూడా ఇంజినీర్లకు తెలిసుండాలని అన్నారు. ఇక వెంబు అభిప్రాయాలతో నెట్టింట అనేక మంది ఏకీభవించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏఐపై వైట్‌కాలర్ ఉద్యోగుల తిరుగుబాటు!
వాట్సాప్‌ను నమ్మలేము: ఎలాన్ మస్క్