Share News

Future Technology: ఏఐ.. క్వాంటమ్‌ టెక్నాలజీ.. హీరోలు

ABN , Publish Date - Jan 01 , 2026 | 06:53 AM

కొత్త ఏడాది రాగానే తెలుగువారిలో చాలా మందికి గుర్తొచ్చే పాట ఇది! ఈ సందర్భంలో కొత్త అంటే.. నూతన సంవత్సరం అనే కాదు!

Future Technology: ఏఐ.. క్వాంటమ్‌ టెక్నాలజీ.. హీరోలు

  • ఇప్పటికే మనందరి జీవితాల్లోకీ చొచ్చుకొచ్చిన ఏఐ

  • వైద్యం, పరిశోధన ఐటీ రంగాల్లో కృత్రిమ మేధ జోరు

  • కొత్త సంవత్సరంలో మరిన్ని రంగాల్లో ఏఐ కీలకపాత్ర

  • ‘క్వాంటమ్‌’ ఫలాలు కూడా అందరికీ అందుబాటులోకి

‘‘కొత్తకు ఎపుడూ స్వాగతం.. పాతకో వందనం’’ ..కొత్త ఏడాది రాగానే తెలుగువారిలో చాలా మందికి గుర్తొచ్చే పాట ఇది! ఈ సందర్భంలో కొత్త అంటే.. నూతన సంవత్సరం అనే కాదు! కొత్త టెక్నాలజీ.. కొత్త ఫ్యాషన్‌.. మొత్తంగా కొత్తదనమేదైనా సరే స్వాగతం చెబుతాం అని అర్థం! అలా స్వాగతిస్తాం కాబట్టే.. 2024లో కొత్తకొత్తగా అప్పుడే రెక్కలు విచ్చుకుంటున్న ‘కృత్రిమ మేధ (ఏఐ)’ పరిజ్ఞానం 2025లో మనందరి చేతుల్లోకీ అందుబాటులోకి వచ్చేసింది! తప్పటడుగులు వేసే చిన్నపిల్లాడిలా తడబడిన ఏఐని వేలుపట్టి నడిపించి ఏడాది చివరికల్లా చాలా పనులకు వాడుకునే స్థితికి వచ్చేశాం. మరీ ముఖ్యంగా.. వైద్యం, పరిశోధన, ఐటీ రంగాల్లో ఏఐ ఇప్పటికే అద్భుతాలు చేస్తోంది. 2026లో ఈ ఏఐ వినియోగం మరింత పెరిగిపోతుందని.. ‘ఇందుగలదు అందులేదన్న సందేహం వలదు’ అన్నట్టుగా విశ్వరూపం దాల్చి మన జీవితాల్లోకి మరింత చొచ్చుకొస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు! దీనికితోడుగా.. క్వాంటం ఫలాలు కూడా ఈ ఏడాది సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, ఆ టెక్నాలజీ మన దైనందిన జీవితాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు. 2024లో మొదలైన ఏఐ విప్లవం 2025లో మనందరి జీవితాలనూ ప్రభావితం చేసే స్థితికి చేరుకున్నట్టుగానే.. 2025లో మొదలైన క్వాంటం రంగ విప్లవం 2026లో పలు రంగాలను ప్రభావితం చేస్తుందన్నది వారి భావన.


నష్టం కాదు.. లాభమే!

మనం పనిచేసే తీరును, సమస్యలను పరిష్కరించుకునే తీరును ఏఐ ఒక్క ఏడాదిలోనేమార్చేసిందనడంలో సందేహం లేదు. కంప్యూటర్లు వచ్చినప్పుడు వేలాది మంది ఉద్యోగాలు పోతాయని చాలా మంది భయపడ్డారు. భయపెట్టారు. కానీ వాస్తవంలో జరిగింది ఏంటంటే.. కంప్యూటర్ల వల్ల లక్షలాది మందికి ఉద్యోగాలు దొరికాయి. భారతదేశంలో మధ్యతరగతి వర్గం.. కంప్యూటర్‌ విప్లవం వల్ల ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గంలోకి చేరింది. అదే కోవలో ఏఐ కూడా మన జీవనాన్ని మరింత మెరుగుపరుస్తుందని.. అది మనుషుల్ని భర్తీ చేయదని, వారి సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. పనిప్రదేశాల్లో ఏఐ ఏజెంట్లు డిజిటల్‌ సహోద్యోగులుగా మారి.. తక్కువ సామర్థ్యాలున్నవారు సైతం మరింత మెరుగ్గా పనిచేయగలిగేలా చేస్తాయని స్పష్టం చేశారు. ఉదాహరణకు.. ఒక 100 పేజీల డాక్యుమెంట్‌ను చదివి దాని సారాంశాన్ని అర్థం చేసుకుని, ఆ సారాంశం ఆధారంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటే గతంలో ఆ పని చేయడానికి కొన్ని రోజులు పట్టేది. ఇప్పుడు ఏఐకి ఆ డాక్యుమెంట్‌ని ఇస్తే.. క్షణాల్లో దాని సారాంశాన్ని మనకు చెప్పేస్తుంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం వేగవంతమవుతుంది. కాబట్టి.. ఏఐతో ఉద్యోగాలు పోతాయని భయపడక, దాంతో పనిచేయించడం, పనిచేయడం ఎలాగో నేర్చుకుంటే, ఆ సామర్థ్యాలను మెరుగుపరచుకుంటే మరిన్ని అవకాశాలు ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇక.. వైద్యరంగంలో ఇప్పటికే విప్లవం సృష్టిస్తున్న ఏఐ మున్ముందు మరిన్ని సంచలనాలు నమోదు చేస్తుందని అంచనా. ప్రస్తుతానికి రోగనిర్ధారణకు మాత్రమే ఏఐని వినియోగిస్తున్నారు. ఇకపై దాన్ని చికిత్స ప్రణాళికకు కూడా వినియోగించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్‌ ఏఐలో ఆరోగ్యవిభాగం వైస్‌ప్రెసిడెంట్‌ డాక్టర్‌ డోమ్నిక్‌ కింగ్‌ వంటివారు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల మంది ఆరోగ్య కార్మికుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని.. ఆ సమస్యను ఏఐ సాయంతో అధిగమించడానికిఅవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌ ఏఐ డయాగ్నస్టిక్‌ ఆర్కెస్ట్రేటర్‌ 2025లో అత్యంత క్లిష్టమైన వైద్య సవాళ్లను 85.5 శాతం కచ్చితత్వంతో పరిష్కరించిందని.. ఇది అనుభవజ్ఞులైన వైద్యనిపుణుల సగటు కచ్చితత్వం (20ు)తో పోలిస్తే చాలా ఎక్కువని ఆయన వెల్లడించారు.


ఏఐతో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ జత..

ఇప్పటికే జోరందుకున్న కృత్రిమ మేధకు.. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ శక్తి కూడా తోడైతే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని మైక్రోసా్‌ఫ్టలో డిస్కవరీ అండ్‌ క్వాంటమ్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ చెప్పారు. కంప్యూటింగ్‌కి సంబంధించి తదుపరి ముందడుగు చాలా మంది ఊహిస్తున్నదానికన్నా త్వరలోనే పడబోతోందని.. అందుకు దశాబ్దాలు కాదు, కొన్నేళ్లు మాత్రమే పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఏఐ, సూపర్‌కంప్యూటర్లు, క్వాంటమ్‌ కంప్యూటర్లు కలిసి పనిచేస్తాయని (హైబ్రీడ్‌ కంప్యూటింగ్‌).. మామూలు కంప్యూటర్లకు అసాధ్యమైన పనిని సైతం ఈ హైబ్రీడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా అవలీలగా, అలవోకగా చేయొచ్చని తెలిపారు. అయితే, ఇంత శక్తి ఉన్న క్వాంటమ్‌ కంప్యూటింగ్‌కి సంబంధించి శాస్త్రజ్ఞులు ఒక ముఖ్యమైన సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. అదేంటంటే.. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో కీలకమైన ‘క్యూబిట్లు’ దుర్బలమైనవి. బాహ్య ప్రభావాల వల్ల అవి చాలా త్వరగా అస్థిరతకు గురై పనిచేయకుండా పోతాయి. దీన్ని అధిగమించేందుకు శాస్త్రజ్ఞులు ‘ఫాల్ట్‌ టోలరెంట్‌ అల్గారిథమ్స్‌’.. అంటే బయటి ఒత్తిళ్లకు క్యూబిట్లు ప్రభావితం కాకుండా చూసే అల్గారిథమ్స్‌ను రూపొందిస్తున్నారు. ఆ ప్రయత్నాలు పూర్తిగా సఫలమైతే.. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ 2026లోనే వాస్తవ ప్రపంచంలో అందుబాటులోకి వస్తుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

- సెంట్రల్‌ డెస్క్‌


ఎన్నికల సందడి

మిగతా దేశాల సంగతేమోగానీ.. మన దేశంలో ఎన్నికలంటే పండగ! 2025లో ఢిల్లీ, బిహార్‌లో మాత్రమే ఈ పండగ వచ్చింది!! కానీ ఈ ఏడాది ఏకంగా ఐదు చోట్ల ఎన్నికల సంరంభం జరగనుంది. 2026 మార్చి-మే నెలల నడుమ.. అసోం, పశ్చిమబెంగాల్‌, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళలో హోరాహోరీగా ఎన్నికల పోరు జరగనుంది. వీటిలో.. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆ హడావుడి బాగా కనపడుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో పట్టు సాధించడం కోసం బీజేపీ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఉన్న పట్టు నిలుపుకొనేందుకు అధికారపక్షాలైన టీఎంసీ, డీఎంకేలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

ముసలితనానికి అడ్డుకట్ట!

మనిషికి తప్పనివి జర, మరణం. జర అంటే ముసలితనం. ప్రస్తుతానికి మరణాన్నైతే తప్పించలేంగానీ.. ముసలితనాన్ని జయించే మార్గాల కోసం ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రజ్ఞులు, పలు సంస్థలు, స్టార్ట్‌పలు ఇప్పటికే విస్తృతంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పోర్చుగల్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ అవీరోకు చెందిన రసాయన శాస్త్రజ్ఞులు ‘ఎపిజెనెటిక్‌ రీప్రోగ్రామింగ్‌’పై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. సాధారణంగా మనకు వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడుతుంది. శరీర పటుత్వం సడలుతుంది. అవయవాల పనితీరు మందగిస్తుంది. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ అని మనం సరిపెట్టుకుంటాం. కానీ, అవీరో వర్సిటీ శాస్త్రజ్ఞులు మాత్రం.. కణాల్లోని ‘ఎపిజెనెటిక్‌ నియంత్రణ’ క్రమంగా పట్టుతప్పడం వల్లే వృద్ధాప్యం వస్తుందని చెబుతున్నారు. అలా దెబ్బతిన్న జన్యువులను గుర్తించి.. ప్రత్యేక ప్రొటీన్ల ద్వారా వాటిని తిరిగి పనిచేయించే దిశగా శాస్త్రజ్ఞులు ఇన్నాళ్లూ కృషి చేస్తున్నారు. కానీ, అవీరో శాస్త్రజ్ఞులు మాత్రం అలా ప్రత్యేక ప్రొటీన్ల ద్వారా కాకుండా కొన్ని రసాయనాలను ఉపయోగించి జీవనియంత్రణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ల్యాబులో వారి ప్రయోగాలు కొంతమేర ఇప్పటికే ఫలించాయి కూడా. ఈ పరిశోధనలు మరింత జోరుగా సాగి.. ముసలితనాన్ని జయించే రోజు త్వరలోనే రావాలని అందరూ కోరుకుంటున్నారు.

Updated Date - Jan 01 , 2026 | 06:56 AM