Share News

వైభవ్‌.. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టు

ABN , Publish Date - Jul 28 , 2026 | 05:15 AM

టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఆటతీరుపై తాత్కాలిక కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. గత ఆరు నెలలుగా 15 ఏళ్ల వైభవ్‌కు ఆటపై అవగాహన పెరిగిందని తెలిపాడు

వైభవ్‌.. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టు

హరారే: టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఆటతీరుపై తాత్కాలిక కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. గత ఆరు నెలలుగా 15 ఏళ్ల వైభవ్‌కు ఆటపై అవగాహన పెరిగిందని తెలిపాడు. అలాగే ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవడంలో అతను మరింత నైపుణ్యం సాధిస్తున్నట్టు గుర్తుచేశాడు. అయితే అతడు తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాల్సి ఉందని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. వైభవ్‌ చాలా చిన్న కుర్రాడని, ఫిట్‌నెస్‌ సహా ఆటకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ఎంతో మెరుగవ్వాల్సి వుందని అన్నాడు. సూర్యవంశీ ఇంగ్లండ్‌ పర్యటనలో ఆడిన మూడు టీ20 మ్యాచ్‌ల్లో విఫలం కావడంతో చివరి రెండు మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. అయితే జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీ్‌సలో మాత్రం రెండు హాఫ్‌ సెంచరీలతో ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా నిలిచిన విషయం తెలిసిందే. ‘ప్రతీ ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడే వైభవ్‌ మూడో టీ20లో భిన్నంగా ఆడాడు. ఆ పిచ్‌ మందకొడిగా ఉండడంతో తన ఆటతీరును మార్చుకుని క్రీజులో నిలబడ్డాడు. మ్యాచ్‌ మ్యాచ్‌కూ పరిస్థితులను అంచనా వేయడం, అర్థం చేసుకోవడంలో పరిణతి చూపుతున్నాడు’ అని లక్ష్మణ్‌ తెలిపాడు. 2024 క్వాడ్రఫుల్‌ సిరీ్‌సలో ఇండియా ‘బి’ తరఫున విజయవాడలో వైభవ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడని, అతడి ఆటను అప్పుడే గమనించానని చెప్పాడు. ఇదిలావుండగా.. వన్డేల్లో ఓపెనర్‌గా రోహిత్‌కు జతగా వైభవ్‌ను ఎంపిక చేయాలని మాజీ ఆటగాడు ఫరూక్‌ ఇంజనీర్‌ అభిప్రాయపడ్డాడు. అలాగే గిల్‌ నాలుగో స్థానంలో వస్తే మిడిలార్డర్‌ బలంగా మారుతుందని సూచించాడు.

థాంక్యూ వీవీఎస్‌ సర్‌: శ్రేయాస్‌

తన కెప్టెన్సీలో వరుసగా రెండు సిరీస్‌ ఓటములతో డీలాపడిన శ్రేయా్‌సకు జింబాబ్వేపై విజయం ఊరటనిచ్చింది. ఈనేపథ్యంలో జట్టు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్‌ లక్ష్మణ్‌కు శ్రేయాస్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ‘వాస్తవానికి ఈ సిరీ్‌సలో ఫీల్డింగ్‌ మినహా అంతా అద్భుతంగా ఆడాం. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ సర్‌కు ధన్యవాదాలు. మమ్మల్ని నిరంతరం ప్రోత్సహిస్తూ స్ఫూర్తిని నింపారు’ అని శ్రేయాస్‌ కొనియాడాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్‌ సర్కార్‌..!

బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 28 , 2026 | 05:15 AM