యూఎస్ ఓపెన్: అల్కరాజ్ అదిరిపోయే రీఎంట్రీ.. తొలి రౌండ్‌లో ఘన విజయం
ABN , Publish Date - Sep 01 , 2026 | 10:24 AM
నాలుగు నెలల విరామం తర్వాత టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టిన డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ అదరగొట్టాడు. యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే ఘన విజయంతో టోర్నీలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: నాలుగు నెలల విరామం తర్వాత టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టిన డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ అదరగొట్టాడు. యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే ఘన విజయంతో టోర్నీలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మణికట్టు గాయం కారణంగా ఏప్రిల్ నుంచి ఆటకు దూరమైన అల్కరాజ్.. ఆర్థర్ యాష్ స్టేడియంలో రష్యా ఆటగాడు రోమన్ సఫియులిన్‌పై 6-4, 6-4, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఆది నుంచి ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపిస్తూ రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు.
‘గత ఐదు నెలలు నాకు చాలా కఠినంగా గడిచాయి. మళ్లీ ఆర్థర్ యాష్ స్టేడియంలో అడుగుపెట్టి పోటీ పడటం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. తిరిగి రావడానికి ఇంతకంటే మంచి టోర్నీని ఎంచుకోలేనేమో. సాధ్యమైనంతగా ఈ క్షణాలను ఆస్వాదించేందుకు ప్రయత్నించాను. ప్రేక్షకులను, వారి ఉత్సాహాన్ని, పోటీ వాతావరణాన్ని ఎంతో మిస్ అయ్యాను. నిజం చెప్పాలంటే ప్రతిదీ మిస్ అయ్యాను’ అని అల్కరాజ్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.
జకోవిచ్ నిష్క్రమణ.. అల్కరాజ్‌కు కలిసొచ్చేనా?
ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకున్న అల్కరాజ్.. సీజన్‌ను మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ముగించాలని పట్టుదలగా ఉన్నాడు. మరో స్టార్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఈ టోర్నీలో అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. మరియానో నవోనే చేతిలో ఐదు సెట్ల హోరాహోరీ పోరులో ఓడిపోయాడు. 20 ఏళ్ల తర్వాత జకోవిచ్ గ్రాండ్‌స్లామ్‌లో ఇంత తొందరగా నిష్క్రమించడం ఇదే తొలిసారి. ఇప్పటికే ప్రపంచ నంబర్ వన్ యానిక్ సినర్ మోకాలి గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పుడు జకోవిచ్ కూడా తప్పుకోవడంతో అల్కరాజ్‌కు మరో అడ్డంకి తొలగినట్లైంది.
ఇవి కూడా చదవండి:
పదేళ్ల క్రితమే మెస్సి రిటైర్‌మెంట్.. రొనాల్డో రియాక్షన్ వైరల్!
14వేల పరుగులు కష్టపడకుండానే వచ్చాయా?.. విమర్శకులకు జో రూట్ కౌంటర్