ఇదిగో తెలుగు సైన్యం
ABN , Publish Date - Sep 19 , 2026 | 02:31 AM
ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారులు పతకాల వేటకు సిద్ధమయ్యారు. బ్యాడ్మింటన్, ఆర్చరీ, షూటింగ్, అథ్లెటిక్స్, క్రికెట్, టేబుల్ టెన్నిస్, ఈ-స్పోర్ట్స్‌లో తెలుగు సైన్యం సత్తా చాటనుంది. పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, ఇషా సింగ్, జ్యోతి సురేఖ, జ్యోతి యర్రాజి, తిలక్ వర్మ తదితరులు బరిలో ఉన్నారు.
కొత్త, పాత మేళవింపుతో గంపెడు పతక ఆశలతో జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలుగు క్రీడాకారులు సిద్ధమయ్యారు. వీరంతా తమ క్రీడాంశాల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
బ్యాడ్మింటన్: స్టార్ షట్లర్ పీవీ సింధు సింగిల్స్‌తో పాటు టీమ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగుతోంది. ఆదివారం నుంచి టీమ్ ఈవెంట్ పోటీలు ప్రారంభమవనుండగా, ఈనెల 25వ తేదీ నుంచి వ్యక్తిగత పోటీలు జరగనున్నాయి. సాత్విక్ సాయిరాజ్ పురుషుల డబుల్స్, టీమ్ ఈవెంట్‌లో, గాయత్రి గోపీచంద్ మహిళల డబుల్స్, టీమ్ ఈవెంట్‌లో ఆడుతుండగా, కిడాంబి శ్రీకాంత్, తరుణ్ మన్నేపల్లి కేవలం టీమ్ ఈవెంట్‌లోనే పోటీ పడుతున్నారు.
ఆర్చరీ: విజయవాడ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కాంపౌండ్ సింగిల్స్, టీమ్ ఈవెంట్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవ్వగా పెద్దపల్లి యువ ఆర్చర్ తానిపర్తి చికితరావు కాంపౌండ్ వ్యక్తిగత, మిక్స్‌డ్, టీమ్ ఈవెంట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరో ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రికర్వ్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌ల్లో బరిలోకి దిగుతున్నాడు. రాజమండ్రికి చెందిన గణేష్ మణిరత్నం కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లో బరిలోకి దిగుతున్నాడు.
షూటింగ్: గత ఆసియా క్రీడల్లో నాలుగు రజతాలు కొల్లగొట్టి సంచలనం సృష్టించిన హైదరాబాదీ ఇషా సింగ్ మరోసారి పతకాల పంట పండించేందుకు సిద్ధమవుతోంది. ఇషా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లో బరిలోకి దిగనుంది. కైనాన్ షెనాయ్ ట్రాప్, మిక్స్‌డ్ స్కీట్ విభాగాల్లో పోటీ పడనున్నాడు.
అథ్లెటిక్స్: గత ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన యర్రాజి జ్యోతి మరోసారి పతకంపై కన్నేసింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో ఈ విశాఖ ఎక్స్‌ప్రెస్ బరిలోకి దిగనుంది. కర్నూలుకు చెందిన 19 ఏళ్ల మొగిలి వెంకట్రామ్ రెడ్డి 800 మీటర్ల పరుగులో పతక వేటకు సిద్ధమయ్యాడు.
క్రికెట్: హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ ఆసియా క్రీడల్లో రెండోసారి ఆడేందుకు సన్నద్ధమయ్యాడు. ఈసారి టీమిండియా టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ ఎడమ చేతి బ్యాటర్‌పైన భారీ అంచనాలున్నాయి. మహిళల టీ20ల్లో కడప యువ స్పిన్నర్ శ్రీచరణి, హైదరాబాద్ ఆల్‌రౌండర్ అరుంధతి బరిలోకి దిగుతున్నారు.
టేబుల్ టెన్నిస్: కామన్వెల్త్ గేమ్స్ మెడలిస్ట్, హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ సింగిల్స్, డబుల్స్, టీమ్ ఈవెంట్‌ల్లో బరిలోకి దిగనుంది.
ఈ-స్పోర్ట్స్: ఈ-స్పోర్ట్స్‌లో భారత్ నుంచి 15 మంది పోటీ పడుతుండగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయికృష్ణ నల్లూరి పోకీమాన్ యునైట్ ఈవెంట్‌లో ఆడనున్నాడు.
ఇవి కూడా చదవండి:
టెక్‌బాల్‌లో.. చరిత్రకు చేరువలో
అథ్లెట్ల అగచాట్లు.. సాయానికి ఎన్నారైలు!