Share News

టెక్‌బాల్‌లో.. చరిత్రకు చేరువలో

ABN , Publish Date - Sep 19 , 2026 | 02:19 AM

ఆసియా క్రీడల్లో టెక్‌బాల్‌లో భారత క్రీడాకారిణి క్విమ్సీ డిసౌజా సంచలనం సృష్టిస్తోంది. మహిళల సింగిల్స్‌లో సెమీస్‌కు, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్య పోరుకు చేరింది. సింగిల్స్‌లో మరో విజయం సాధిస్తే ఫైనల్‌కు చేరి కనీసం రజతం ఖాయం చేసుకునే అవకాశం ఉంది.

టెక్‌బాల్‌లో.. చరిత్రకు చేరువలో
Asian Games 2026 Techball

  • భారత స్టార్‌ క్విమ్సీ డిసౌజా సంచలనం

  • సింగిల్స్‌లో సెమీస్‌కు, మిక్స్‌డ్‌లో కాంస్యం పోరుకు

టెక్‌బాల్‌.. ఈ పేరే కొత్తగా ఉంది కదూ! టేబుల్‌ టెన్నిస్‌, ఫుట్‌బాల్‌ కలగలపి ఆడే ఈ వినూత్న క్రీడలో భారత అమ్మాయి క్విమ్సీ జోక్విమ్‌ డిసౌజా ఇప్పుడు చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో టెక్‌బాల్‌ ఈవెంట్‌లో క్విమ్సీ రెండు పతకాలు సాధించేందుకు చేరువైంది. మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన 24 ఏళ్ల క్విమ్సీ.. భారత్‌కే చెందిన మహ్మద్‌ అనాస్‌ ఇమ్రాన్‌ బేగ్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ పతకరౌండ్‌ పోరులో నిలిచింది. తొలిసారి ఆసియాడ్‌లో తలపడుతోన్న 24 ఏళ్ల క్విమ్సీ సింగిల్స్‌లో తన గ్రూప్‌-ఎ తొలి మ్యాచ్‌లో 2-1తో టాప్‌సీడ్‌ యునా సకమొటొ (జపాన్‌)కు షాకిచ్చింది.


అనంతరం రెండో మ్యాచ్‌లో 2-0తో కొమియేన్‌ డీవై (కాంబోడియా)ను చిత్తుచేసిన క్విమ్సీ గ్రూప్‌ టాపర్‌గా నిలిచి క్వార్టర్‌ఫైనల్స్‌కు అర్హత సాధించింది. అయితే, క్వార్టర్స్‌లో బై లభించడంతో నేరుగా సెమీ్‌సలో అడుగుపెట్టింది. ఇంకొక్క గెలుపు అందుకుంటే ఫైనల్‌ చేరికతో కనీసం రజతం ఖాయం చేసుకుంటుంది. ఇక, మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో భారత జోడీ క్విమ్సీ/అనాస్‌ 0-2తో వియత్నాం జంట హువాంగ్‌/గియా ట్రిన్‌ చేతిలో ఓటమిపాలైంది. అయితే, తమ ప్రత్యర్థి ఫైనల్‌ రౌండ్‌కు చేరడంతో రెపిచేజ్‌లో తలపడే అవకాశం భారత ద్వయానికి దక్కింది. దీంతో రెపిచేజ్‌ రౌండ్‌లో పోటీపడ్డ క్విమ్సీ/మహ్మద్‌ జంట 2-0తో ఫిలిప్పీన్స్‌ జోడీ జానా/ప్రిన్స్‌పై గెలిచి కాంస్యం పోరుకు చేరుకుంది.


ఎలా ఆడతారంటే..

టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ), ఫుట్‌బాల్‌ను కలిపి ఆడడమే టెక్‌బాల్‌. టీటీ బోర్డును పోలి, కాస్త వంపు ఉన్న బోర్డుపై ఫుట్‌బాల్‌తో ఆటగాళ్లు తలపడతారు. అయితే, ఆ బంతిని చేతులతో కాకుండా.. కాలు, మోకాలు, తల, తొడ, ఛాతీ ఇలా శరీరంలో ఏ భాగంతోనైనా బంతిని అటువైపు బోర్డుపై పడేలా ఆడాలి. సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఒక్కో మ్యాచ్‌ బెస్ట్‌ ఆఫ్‌ త్రీగా మూడు సెట్లలో జరుగుతుంది. ఒకవేళ స్కోరు 11-11తో సమమైతే, రెండు పాయింట్లు అంతరం వచ్చేవరకు ఆ సెట్‌ను కొనసాగిస్తారు. 2016లో ప్రపంచానికి పరిచయమైన ఈ క్రీడను ఆసియా క్రీడల్లో తొలిసారి నిర్వహిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

‘ఆసియా’ను గెలవాలని..
అథ్లెట్ల అగచాట్లు.. సాయానికి ఎన్నారైలు!

Updated Date - Sep 19 , 2026 | 02:19 AM