Share News

ఆసియా క్రీడల్లో భారత పతాకధారిగా పవన్

ABN , Publish Date - Sep 19 , 2026 | 07:37 AM

ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో భారత పతాకధారిగా స్టార్ షూటర్ మనూ బాకర్‌తో కలిసి కబడ్డీ స్టార్ ఆటగాడు పవన్ షెరావత్ పాల్గొననున్నాడు. మొదట పతాకధారిగా ఎంపికైన షాట్‌పుట్ ఆటగాడు తజిందర్ పాల్ సింగ్ తూర్‌కు తన అఫీషియల్ కిట్ సకాలంలో అందకపోవడంతో ఈ మార్పు జరిగింది.

ఆసియా క్రీడల్లో భారత పతాకధారిగా పవన్
Asian Games Opening Ceremony

ఇంటర్‌నెట్ డెస్క్: ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో భారత పతాకధారిగా స్టార్ షూటర్ మనూ బాకర్‌తో పాటు ఎంపికైన షాట్‌పుట్ ఆటగాడు తజిందర్ పాల్ సింగ్ తూర్ స్థానంలో కబడ్డీ ప్లేయర్ పవన్ షెరావత్ వచ్చాడు. తూర్ అఫీషియల్ కిట్ ఇంకా అతడికి చేరలేదు. దీంతో భారత పతాకధారిగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని అతడు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో భారత పతాకధారులుగా మనూతో కలిసి పవన్ పాల్గొననున్నాడని చీఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్ మీడియాకు వెల్లడించారు. కాగా.. గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన భారత పురుషుల జట్టులో పవన్ షెరావత్ సభ్యుడిగా ఉన్నాడు. కాగా.. నేటి నుంచే ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి.


కిట్ అందుకొని వేడుకకు వెళ్లడం చాలా కష్టం: తూర్

తన స్థానంలో పవన్ షెరావత్‌ను ఎంపిక చేయడంపై తజిందర్ పాల్ సింగ్ తూర్ స్పందించాడు. ‘నా అఫీషియల్ కిట్ ఇంకా భారత్‌లోనే ఉంది. అది ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నగోయాకు వస్తుందని నాకు చెప్పారు. నగోయా విమానాశ్రయానికి వెళ్లి ఆ కిట్ అందుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవాలకు నేను రావడం లేదని భారతీయ ఒలింపిక్ సంఘానికి(ఐఓఏ) సమాచారం అందించాను. ఇక అథ్లెటిక్స్ టీమ్‌లో ఎవరికీ కిట్లు అందలేదు’ అని తూర్ చెప్పాడు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత పతాకధారిగా తనను ఎంపిక చేసినట్లు ముందే తెలిసి ఉంటే, ఎలాగైనా నా కిట్‌ను నగోయాకు సమయానికి రప్పించుకునేవాడినని తూర్ పేర్కొన్నాడు. భారత పతాకధారిగా తనను ఎంపిక చేసిన విషయాన్ని ఐఓఏ శుక్రవారం తెలిపిందన్నారు. అంతకుముందే ఈ విషయం తెలిపి ఉంటే, తన కోచ్ తన కిట్‌ను నగోయాకు తెచ్చేవారని తూర్ వెల్లడించాడు.

Updated Date - Sep 19 , 2026 | 08:12 AM