Share News

టీ20 ప్రపంచ కప్2026: నరాలు తెగే ఉత్కంఠ.. సూపర్ ఓవర్‌లో గెలిచిన సౌతాఫ్రికా

ABN , Publish Date - Feb 11 , 2026 | 03:41 PM

టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా ఇవాళ సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ మధ్య ఉత్కంఠభరిమైన మ్యాచ్ జరిగింది. విజయం కోసం ఇరుజట్లు పోటీ పడ్డాయి. ఫలితంగా మ్యాట్ టై కావడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇక్కడ కూడా ఫలితం తేలకపోవడంతో రెండో సూపర్ ఓవర్ జరిగింది. ఈ సూపర్ ఓవర్‌లో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీ20 ప్రపంచ కప్2026: నరాలు తెగే ఉత్కంఠ.. సూపర్ ఓవర్‌లో గెలిచిన  సౌతాఫ్రికా
South Africa vs Afghanistan

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ఇవాళ(బుధవారం) సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ టెన్షన్ పుట్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో సఫారీ జట్టు విజయం సాధించింది. దక్షిణాఫ్రికా గెలుస్తుందని అంతా అనుకున్న సమయంలో నూర్ అహ్మద్ సిక్సర్లతో అఫ్గాన్ జట్టును విజయానికి చేరువ చేశాడు . చివరి ఓవర్ తొలి బంతికే అవుటైనా అది నో బాల్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. సౌతాఫ్రికా జట్టు 187/6 చేయగా.. అఫ్గాన్ జట్టు కూడా 187/10 చేయడంతో సూపర్ ఓవర్ తప్పలేదు. ఈ సూపర్ ఓవర్ కూడా టై అయింది. దీంతో రెండో సూపర్ అనివార్యమైంది. రెండో సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇవాళ(బుధవారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన అఫ్గాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుని సఫారీ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 187 పరుగులు చేసింది. ప్రొటీస్ బ్యాటర్లలో ర్యాన్‌ రికెల్టన్‌ (61 పరుగులు), ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (59 పరుగులు) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. కెప్టెన్‌ ఎడెన్‌ మార్‌క్రమ్‌ (5), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (1) విఫలమయ్యారు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (23), డేవిడ్ మిల్లర్(20) ఫర్వాలేదనిపించారు. అఫ్గానిస్థాన్‌ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 3, రషీద్‌ ఖాన్‌ 2, ఫజల్ హక్‌ ఫరూఖీ తలో వికెట్‌ తీసుకున్నారు.


అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన అఫ్గాన్ జట్టు కూడా 187 పరుగులు చేసి.. ఆలౌటైంది. ఈ జట్టు పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. గుల్బదీన్ నాయబ్, సెడీకుల్లా అటల్ డకౌట్లు కావడంతో 52 పరుగులకే అఫ్గాన్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సరిగ్గా ఆ సమయంలోనే ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ సఫారీ బౌలర్లు ఊచకోత కోశాడు. 42 బంతుల్లోనే 84 పరుగులు చేసి.. విజయంపై ఆశలు కల్పించాడు. ఈ క్రమంలోనే 84 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అలానే చివర్లో అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (22), రషీద్‌ ఖాన్‌ (20), నూర్‌ అహ్మద్‌ (15 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో అఫ్గాన్ స్కోర్ సమం చేసి... లక్ష్యానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీసి అఫ్గాన్ విజయంపై నీలు చల్లాడు. అలానే జన్సెన్‌, రబాడ, లిండే, కేశవ్‌ మహారాజ్‌ తలో వికెట్‌ తీశారు.


సూపర్ ఓవర్-1

ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇక్కడ కూడా సూపర్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విజయం కోసం రెండు జట్లు కొదమ సింహాల్లా పోటీ పడ్డాయి. సూపర్ ఓవర్లలో కూడా ఇరు జట్లు 17 పరుగులు చేశాయి. దీంతో రెండో సూపర్ ఓవర్‌కు దారి తీసింది

అఫ్గానిస్థాన్‌- 4, 6, 1, 1, 4, 1 (17 పరుగులు)

సౌతాఫ్రికా- 1, 6, W, 4, 0, 6 (17 పరుగులు)


సూపర్ ఓవర్-2

ఇక రెండో సూపర్ ఓవర్లో కూడా అఫ్గానిస్థాన్ విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. అయితే వారి వీరోచిపోరాటం రెండో సూపర్ ఓవర్ లో వృథా అయింది. 4 పరుగుల తేడాతో సఫారీ జట్టు విజయం సాధించింది. ఈ సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 23 పరుగులు చేసింది. అనంతరం అఫ్గాన్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 19 పరుగులు మాత్రమే చేసింది.

సౌతాఫ్రికా- 6, 1, 2, 6, 6, 2 (23 పరుగులు)

అఫ్గానిస్థాన్- 0, W, 6, 6, 6, Wd1, W (19 పరుగులు)


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్ అభిమానులకు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్.!

టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!

Updated Date - Feb 11 , 2026 | 04:31 PM